సాక్షి, హైదరాబాద్: ‘నూనె లేని ఆహార పదార్థాలు తింటేనే ఆరోగ్యకరమని చాలామంది అనుకుంటారు. కానీ అసలు నూనెలే వాడకపోవడం అనారోగ్యకరం’ అని భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ)లోని ఆయిల్స్, ఫ్యాట్స్ సైంటిఫిక్ ప్యానెల్ జాతీయ చైర్మన్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) మాజీ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఆర్‌బీఎన్ ప్రసాద్ అన్నారు. ‘ప్రతీ మనిషికి సాధారణం గా రోజుకు 2 వేల కేలరీలు కావాలి. కష్టపడి పని చేసే వారికి 2,500 వరకు కేలరీలు అవసరం. అందులో 30 శాతం నూనెలు, కొవ్వుల ద్వారానే రావాలి. అంటే 50 నుంచి 65 గ్రాము ల వరకు ఫ్యాట్స్ అవసరం’అని తెలిపారు. శనివారం ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆర్‌బీఎన్ ప్రసాద్.. నూనెలు వాడటంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
సమాన నిష్పత్తిలో మూడు ఫ్యాటీ ఆమ్లాలు
ఆయిల్స్‌లో శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు, మోనో అన్ శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు, పాలీ అన్ శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు ఉండాలి. ఈ మూడు సమాన నిష్పత్తిలో ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) స్పష్టంచేసిం ది. ఈ నిష్పత్తిలో బ్యాలెన్స్ తప్పితే అనారోగ్య సమస్యలు ముంచెత్తుతాయి. పాలీ అన్ శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు చాలా ముఖ్యమైనవి. ఇవి మన శరీరంలో తయారు కావు. వీటిని నూనెల ద్వారానే తీసుకోవాలి. ఇవి ఎక్కువున్నా, తక్కువున్నా సమస్యలే. పాలీ అన్ శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాల్లో ఒమెగా–3, ఒమెగా–6 ఆమ్లాలుం డాలి. ఒమెగా–3 ఆమ్లాలు.. కేవలం సోయాబీన్, ఆవ నూనెల్లో మాత్రమే 5–10 శాతం ఉం టాయి. ఒమెగా–3 లేని నూనెలను వాడితే శారీరక రుగ్మతలు తలెత్తుతాయి. ఒమెగా–3 ఉన్న నూనెలను వాడని వారు తప్పనిసరిగా వేయించిన అవిసె గింజలు రోజూ కొద్దిగా తింటే సరిపోతుంది. అవిసె గింజల్లో 55 శాతం ఒమెగా–3 ఆమ్లాలుంటాయి. నిత్యం చేపలు తినేవారికి కూడా ఒమెగా–3 లభిస్తుంది. ఆలివ్ నూనెలో మోనో అన్ శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు 75 శాతం ఉంటాయి. ఇక సన్ ఫ్లవర్, సోయాబీన్, మొక్కజొన్న, పత్తి గింజ, అవిసె నూనెల్లో పాలీ అన్ శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు 50 శాతం కంటే ఎక్కువగా ఉంటాయి. కొబ్బరి నూనెలో 90 శాతం, పామాయిల్‌లో 50 శాతం వరకు శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలుంటాయి.
ఆ నూనెలు అత్యంత ప్రమాదకరం
జంతువుల కొవ్వు, కళేబరాల నుంచి తయారు చేసే నూనెలు అత్యంత ప్రమాదకరం. వాటిలో శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటాయి. తినుబండారాలు తయారు చేసే కేంద్రాల్లో ఉపయోగించే అవకాశముంది. తక్కువ ధరకు దొరుకుతుంది కాబట్టి వ్యాపారస్తులు వారికి అంటగడుతుంటారు. వృక్షాల నుంచి తయారయ్యే నూనెలో కొలెస్ట్రాల్ ఉండదు. ఇక నూనెలను పలుమార్లు వాడకూడదు. ఎక్కువ సార్లు వేడి చేసినప్పుడు పెరా క్సైడ్ వంటి విష పదార్థాలు తయారవుతాయి.
విడిగా కొనవద్దు..
- ఆయిల్‌ను విడిగా కొనవద్దు. ప్యాకింగ్ నూనెనే కొనుగోలు చేయాలి. ప్యాకింగ్‌ను ట్యాంపరింగ్ చేసినట్లు అనిపిస్తే.. బ్రాండెడ్ నూనెలైనా సరే కొనకూడదు.
- ప్యాకింగ్‌పై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ ఉందా లేదా చూసుకోవాలి.
- న్యూట్రీషియన్ సమాచారం, ప్రమాణాల ప్రకారం 3 ఫ్యాటీ ఆమ్లాల సమాన నిష్పత్తి ఆధారంగానే నూనెలను ఎంపిక చేసుకోవాలి.
- గుండెకు మేలు జరుగుతుందంటూ ప్యాకింగ్‌లపై రాస్తారు. అయితే సైంటిఫిక్ రిఫరెన్స్ లేబిలింగ్ ఉందో లేదో చూసుకుని మాత్రమే కొనాలి. అనుమానమొస్తే ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐకి ఫిర్యాదు చేయవచ్చు.
- పత్తి గింజల నుంచి నూనె తీస్తుంటారు. పత్తి పంటలో రసాయనాలు కలుపుతుండటం వల్ల నూనె కూడా విషంగా మారుతుందని అనుకోవడం అశాస్త్రీయం. రిఫైనింగ్‌లో అంతా సవ్యంగానే ఉంటుంది. బ్రాండెడ్ కంపెనీలు రిఫైనింగ్‌ను సరిగానే చేస్తుంటాయి. మహారాష్ట్రలో పత్తి నూనెను అధికంగా వాడతారు.
Comments
Please login to add a commentAdd a comment