=11నుంచి జేఎన్టీయూహెచ్ బీటెక్ సెమిస్టర్ పరీక్షలు
=హాజరు కానున్న 2.5 లక్షలమంది విద్యార్థులు
=ఇంకా అందని హాల్‌టికెట్లు.. అయోమయంలో విద్యార్థులు
సాక్షి, సిటీబ్యూరో: ఇంజినీరింగ్ విద్యార్థులకు జేఎన్టీయూహెచ్ అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. నాలుగు రోజుల్లో సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానుండగా నేటివరకు బీటెక్ విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వలేదు. శని, ఆదివారాలు సెలవు దినాలను మినహా ఇస్తే.. విద్యార్థులు హాల్‌టికెట్లు పొందేందుకు రెండ్రోజులే సమయం ఉంది. దీంతో పరీక్షల సమయంలో చదువుకోవాల్సిన లక్షలాది మంది విద్యార్థులు.. ప్రిపరేషన్ మానేసి హాల్‌టికెట్ల కోసం కళాశాలల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అటు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు, ఇటు వర్సిటీ అధికారులు స్పందించట్లేదు.
జంబ్లింగ్‌తో మళ్లీ తంటా!
ఈనెల 11నుంచి ప్రారంభం కానున్న జేఎన్టీయూహెచ్ బీటెక్ సెమిస్టర్ పరీక్షలు సుమారు 2.5లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. సెమిస్టర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌ను అరికట్టేందుకు జేఎన్టీయూహెచ్ గతేడాది నుంచి జంబ్లింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానంలో పరీక్ష కేంద్రాలు దూరంగా ఉండడంతో విద్యార్థులకు అవ స్థలు పడుతున్నారు. అంతేకాదు.. కొత్త విధానంలో విద్యార్థుల హాల్‌టికెట్లను పరీక్ష కేంద్రంలోనే జారీ చేస్తామని అధికారులు చెబుతున్నారు.
విద్యార్థి హాల్‌టికెట్ ఏకారణంగానైనా మిస్సయితే.. తమ విద్యార్థి కనుక పేరెంట్ కళాశాల్లో డూప్లికేట్ ఇచ్చేవారు. తాజాగా జంబ్లింగ్ వలన హాల్‌టికెట్ మిస్సయితే ఏ ప్రాతిపదికన డూప్లికేట్ ఇవ్వాలో తెలియని పరిస్థితి నెలకొంది.
ఇబ్బందులను పరిశీలిస్తాం: రిజిస్ట్రార్
హాల్‌టికెట్లు వెంటనే జారీ అయ్యేలా చర్యలు తీసుకుంటాం. జంబ్లింగ్ విధానంలో పరీక్ష కేంద్రం 10కిలోమీటర్ల పరిధిలోనే ఉండాలి. దూరం ఎక్కువ ఉన్నట్లు ఫిర్యాదులు, విన ్నపాలు వస్తే సెల్ఫ్ సెంటర్లు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తాం.
- ఎన్వీ రమణరావు, రిజిస్ట్రార్