ఏపీకి 11.. తెలంగాణకు 2 టీఎంసీలు
- జలాలు కేటాయిస్తూ కృష్ణా బోర్డు మధ్యంతర ఉత్తర్వులు
- ఫిబ్రవరి 20 వరకు వినియోగానికి అనుమతి
- పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా కింద అధిక వినియోగం చేస్తున్నారంటూ ఏపీకి హెచ్చరిక
- శ్రీశైలం నుంచి సాగర్‌కు నీటిని విడుదల చేయాలని ఆదేశం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల్లో ప్రస్తుతం లభ్యతగా ఉన్న నీటిని తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు పంచుతూ కృష్ణా బోర్డు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో లభ్యతగా ఉన్న 53.49 టీఎం సీలలో తెలంగాణకు 2, ఏపీకి 11 టీఎంసీలు కేటాయిస్తూ బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీ బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ తాగునీటి అవసరం నిమిత్తం ఏఎమ్మార్పీ కింద 2 టీఎం సీలు తెలంగాణకు కేటాయించగా.. ఏపీకి కృష్ణా డెల్టా కింద 6 టీఎంసీలు, సాగర్ కుడి కాల్వకు 5 టీఎంసీలు కేటాయించారు. ఈ నీటిని ఫిబ్రవరి 20 వరకు వాడుకోవాలని సూచించారు. సాగర్ ఎడమ కాల్వ కింద తెలంగాణ అవసరాలకు ఇంకా 9.94 టీఎం సీల నీటిని వినియోగించాల్సి ఉన్నందున.. ప్రస్తుతం కేటాయింపులు చేయలేదన్నారు.
పోతిరెడ్డిపాడు కింద అధిక వినియోగం
తాము గతంలో ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా ఏపీ నీటిని వినియోగి స్తోందని బోర్డు స్పష్టం చేసింది. పోతిరెడ్డిపాడు కింద 54 టీఎంసీలు కేటాయించగా, 64.44 టీఎంసీలు వినియోగించుకున్నారని, హంద్రీ నీవా కింద 29 టీఎంసీలు కేటాయిస్తే, 32.4 టీఎంసీలు వినియోగించుకున్నారని పేర్కొం ది. మొత్తంగా 13 టీఎంసీల అధిక విని యోగం ఉందని తెలిపింది. ఇక తెలంగాణ కల్వకుర్తి కింద 6.22 టీఎంసీలకుగాను 11.44 టీఎంసీలు వినియోగించుకుందని పేర్కొంది. ఈ నీటి విడుదల పూర్తిగా పవర్‌హౌస్‌ల ద్వారానే జరగాలని ఆదేశించింది. విద్యుదుత్పత్తిని ఎలా పంచుకోవాలన్న దానిపై ఇరు రాష్ట్రాల ఈఎన్‌సీలు కేంద్ర విద్యుత్ శాఖతో చర్చించుకుని నిర్ణయానికి రావాలని సూచించింది. ప్రాజెక్టుల కింద కేటాయించిన నీటిని ఎలా వాడుతున్నా రన్నది ఈఎన్‌సీలు గమనిస్తూ ఉండాలని, విడుదలకు సంబంధించి సంయుక్త కమిటీ పర్యవేక్షిస్తుందని పేర్కొంది.
20న కృష్ణా వరదలపై సమావేశం
ఈ 20న కృష్ణా వరదల పరిస్థితిపై కేంద్ర జల సంఘం సమీక్షించనుంది. పార్లమెంట్ సభ్యులతో ఉన్న పిటిషన్స్ కమిటీ సూచన మేరకు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిసింది.
నీటి విడుదలకు చర్యలు తీసుకోండి
శ్రీశైలం నుంచి సాగర్‌కు 30 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఆదేశించినా 22.43 టీఎంసీ లనే విడుదల చేశారని.. మిగతా నీటి విడుదలపై చర్యలు తీసుకోవాలంటూ బోర్డు ఏపీకి లేఖ రాసింది. సాగర్ నుంచి ఎడమ కాల్వ కింద ఏపీ సరిహద్దు వరకు నీటిని విడుదల చేసేలా తెలం గాణ చర్యలు తీసుకోవాలంది. వీటితోపాటు ప్రాజెక్టులపై మార్గదర్శకాల తయారీకి సుంకేశుల, జూరాల, సాగర్, శ్రీశైలం, పులిచింతల ప్రాజెక్టుల కింద 30 ఏళ్ల నీటి ప్రవాహ లెక్కలు, ప్రాజెక్టుల వివరాలు అందించాలంటూ మరో లేఖ రాసింది.