ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్‌పై దేశద్రోహం కేసు పెట్టడాన్ని నిరసిస్తూ ఈ నెల 25న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించాలని వామపక్షాలు నిర్ణయించాయి.
కన్హయ్యపై కేసును నిరసిస్తూ ఆందోళన
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్‌పై దేశద్రోహం కేసు పెట్టడాన్ని నిరసిస్తూ ఈ నెల 25న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించాలని వామపక్షాలు నిర్ణయించాయి. అదేరోజు అన్ని జిల్లా కేంద్రాల్లోనూ నిరసనలు, ధర్నాలు చేపట్టనున్నాయి. శనివారం మఖ్దూంభవన్‌లో వేములపల్లి వెంకటరామయ్య(న్యూడెమోక్రసీ-రాయల) అధ్యక్షతన జరిగిన సమావేశంలో చాడ వెంకటరెడ్డి, అజీజ్‌పాషా, రాంనర్సింహా రావు (సీపీఐ), తమ్మినేని వీరభద్రం, జి.రాములు (సీపీఎం), కె.గోవర్దన్ (న్యూడెమోక్రసీ-చంద్రన్న), ఎండీగౌస్ (ఎంసీపీఐ-యూ), మురహరి (ఎస్‌యూసీఐ-సీ), గోవింద్ (ఆర్‌ఎస్‌పీ), భూతం వీరయ్య (సీపీఐ-ఎంఎల్), ఇంద్రకరణ్‌రెడ్డి (ఫార్వర్డ్‌బ్లాక్) పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ, కన్హయ్యపై తప్పుడు వీడియోలు సృష్టించి అక్రమంగా దేశద్రోహం కేసు పెట్టారన్నారు. వర్సిటీల్లో కేంద్రం జోక్యం పెరిగిపోయిందన్నారు. రీసెర్చ్ స్కాలర్ రోహిత్ ఆత్మహత్య అంశంపై కేంద్రం బోనెక్కాల్సి రావడంతో, దాన్నుంచి బయటపడేందుకు కన్హయ్యపై కేసుపెట్టారని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. కన్హయ్యపై తప్పుడు కేసు పెట్టినందుకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని వేములపల్లి వెంకటరామయ్య డిమాండ్‌చేశారు.