భారతావనిపై వెలుగుల సంతకం | Lighted sign on India! | Sakshi
Sakshi News home page

భారతావనిపై వెలుగుల సంతకం

Published Mon, Aug 15 2016 3:33 AM | Last Updated on Mon, Sep 4 2017 9:17 AM

భారతావనిపై వెలుగుల సంతకం

భారతావనిపై వెలుగుల సంతకం

దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందిన విద్యుత్ రంగం - సంస్కరణలు, విప్లవాత్మక మార్పులతో ముందడుగు
* చీకటి నుంచి మిగులు విద్యుత్‌కు ప్రస్థానం

ఫసియొద్దీన్ - సాక్షి, హైదరాబాద్ : ఏ దేశ అభివృద్ధిలోనైనా విద్యుత్ రంగం పాత్రఅత్యంత కీలకం. మన దేశంలోనూ స్వాతంత్య్రం అనంతరం విద్యుత్ రంగం గణనీయ పురోగతిని సాధించింది. స్వాతంత్య్రానికి ముందు బ్రిటిష్‌వాళ్లు ఇండియన్ ఎలక్ట్రిసిటీ యాక్ట్‌ను అమలు చేశారు. దాని ప్రకారం ప్రైవేటు సంస్థలు విద్యుత్ పంపిణీ లెసైన్స్ తీసుకుని వ్యాపారం చేసేవి. అవి ప్రధానంగా పట్టణ ప్రాంతాలకే విద్యుత్‌ను సరఫరా చేసేవి. స్వాతంత్య్రం అనంతరం విద్యుత్ సరఫరా చట్టం-1948 అమల్లోకి వచ్చింది.

రాజ్యాంగంలో ఉమ్మడి జాబితాలో విద్యుత్ రంగాన్ని చేర్చారు. 1950లో ప్రణాళికబద్ధ అభివృద్ధి ప్రారంభమైన నాటి నుంచి విద్యుత్‌కు ప్రభుత్వాలు ప్రధాన పీటవేశాయి. 1959-61 మధ్య అన్ని రాష్ట్రాల్లో విద్యుత్ బోర్డులు(ఎస్‌ఈబీ) ఏర్పాటయ్యాయి. 1947లో దేశ విద్యుదుత్పత్తి సామర్థ్యం 1,362 మెగావాట్లు మాత్రమే కాగా.. ప్రస్తుతం 3,03,083 మెగావాట్లకు పెరిగింది. థర్మల్, జల విద్యుత్ ప్రాజెక్టులే ప్రధాన విద్యుత్ వనరులు. 1950 వరకు దేశంలోని విద్యుత్ ప్లాంట్లలో 63 శాతం ప్రైవేటు రంగానివే కాగా.. అనంతరం ప్రభుత్వ రంగంలో విద్యుదుత్పత్తి పెరిగింది.
 
విద్యుత్ రంగంలోకి కేంద్రం
1975 వరకు విద్యుత్ రంగంలో కేంద్రం పాత్ర పెద్దగా లేదు. కొన్ని రాష్ట్రాల్లో విద్యుత్ రంగం వెనుకబడిపోవడంతో ఐదో పంచవర్ష ప్రణాళిక (1974-79) నుంచి కేంద్రం కలుగజేసుకుని.. భారీ ఎత్తున విద్యుదుత్పత్తి, సరఫరా ప్రాజెక్టులపై దృష్టిపెట్టింది. ఈ క్రమంలో 1975లో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ), నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ)లను నెలకొల్పింది. ఈశాన్య భారతంలో నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌ఈఈపీసీఓ)ను 1976లో ఏర్పాటు చేసింది. అయితే కేంద్రం ఉత్పత్తి చేసే విద్యుత్‌ను స్థానిక రాష్ట్రాలకే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాలకు కేటాయించేందుకు కేంద్రం గాడ్గిల్ ఫార్ములాను అనుసరించింది. అంతర్రాష్ట విద్యుత్ లైన్ల నిర్మాణం, నిర్వహణ కోసం పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది.
 
మళ్లీ ప్రైవేటు పెట్టుబడులు
90వ దశకం వరకు కేంద్ర, రాష్ట్రాల ఆధ్వర్యంలోనే విద్యుత్ రంగ అభివృద్ధి జరిగింది. అయితే సరళీకరణలో భాగంగా విద్యుత్ రంగంలోకి భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు 1992లో పీవీ నరసింహారావు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విద్యుత్ రంగంలో 100 శాతం విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరిచింది. పరస్పర అవగాహన ఒప్పందం (ఎంవోయూ) ద్వారా ఫాస్ట్‌ట్రాక్ విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం తొలిసారిగా 8 ప్రైవేటు సంస్థలకు కేంద్రం అనుమతిచ్చింది. స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలకు విద్యుత్ విక్రయించేందుకు ఈ కంపెనీలు ఒప్పందం చేసుకున్నాయి. అయితే కేంద్రం గ్యారెంటీ ఇచ్చినా.. ఆ ప్రాజెక్టులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు విముఖత చూపాయి. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రాల విద్యుత్ బోర్డులను సంస్కరించాలన్న డిమాండ్లు వచ్చాయి.
 
సంస్కరణల బాటలో
1995లో తొలిసారిగా ఒడిశా ప్రభుత్వం విద్యుత్ సంస్కరణల చట్టాన్ని తీసుకురాగా.. తర్వాత హరియాణా, ఏపీ, రాజస్థాన్, కర్ణాటక, మధ్యప్రదేశ్, యూపీ, ఢిల్లీ రాష్ట్రాలు అనుసరించాయి. విద్యుదుత్పత్తి, సరఫరా, పంపిణీ అవసరాల కోసం విద్యుత్ బోర్డులను జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కంలుగా మూడు ముక్కలు చేశాయి. రెండో అంశం డిస్కంల ప్రైవేటీకరణకాగా.. ఒక్క ఒడిశా మాత్రమే ప్రైవేటీకరించింది. మూడో అంశమైన స్వతంత్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)ని 8 రాష్ట్రాలు ఏర్పాటు చేసుకున్నాయి.

పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, కేరళ తదితర రాష్టాల్లో మాత్రం బోర్డులే కొనసాగాయి. అయితే కేంద్ర, రాష్ట్రాల స్థాయిలో విద్యుత్ టారిఫ్ నిర్ధారణ, ఇతర నిర్ణయాలపై సమీక్ష కోసం కేంద్రం విద్యుత్ నియంత్రణ మండలిని ఏర్పాటు చేసింది. గతంలో అమల్లో ఉన్న మూడు విద్యుత్ చట్టాల స్థానంలో ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003ని అమల్లోకి తీసుకువచ్చింది. దీంతో ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్లలో ఓపెన్ యాక్సెస్ విధానం అమల్లోకి వచ్చింది. ట్రాన్స్‌కో పాత్ర కేవలం సరఫరాకు పరిమితమైంది.
 
త్వరలో ప్రైవేటు డిస్కంలు
ఇటీవల కేంద్రం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన విద్యుత్ చట్టం (సవరణ)-2014 బిల్లు ఆమోదం పొందితే విద్యుత్ రంగం రూపురేఖలు మారిపోనున్నాయి. దాని ప్రకారం విద్యుత్ డిస్ట్రిబ్యూషన్‌ను డిస్ట్రిబ్యూషన్, సప్లై అని మళ్లీ రెండు విభాగాలుగా విడగొడతారు. విద్యుత్ లైన్లు, సబ్‌స్టేషన్ల నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వ డిస్కంల ఆధీనంలో ఉంచి... వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేసేందుకు మాత్రం ప్రైవేటు కంపెనీలను అనుమతిస్తారు. ఆ ప్రైవేటు కంపెనీలు ఉత్పత్తి కంపెనీల నుంచి విద్యుత్ కొని.. వినియోగదారులకు సరఫరా చేస్తాయి. ప్రస్తుతం ఈ వ్యవస్థ బ్రిటన్ తరహా అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రమే అమల్లోకి ఉంది.
 
ఇంకా 6 కోట్ల జనాభా చీకట్లోనే!
దేశంలో విద్యుత్ రంగం ఇంతగా అభివృద్ధి చెందినా.. ఏకంగా మిగులు విద్యుత్‌ను కూడా సాధించినా... ఇంకా దాదాపు 6 కోట్ల మందికిపైగా చీకట్లోనే మగ్గుతున్నారు. ఓ వైపు విద్యుత్ డిమాండ్ తగ్గి విద్యుదుత్పత్తి కేంద్రాలు నిరుపయోగంగా మారుతుండగా... మరోవైపు విద్యుత్ సరఫరా లేక మారుమూల ప్రాంతాల ప్రజలు అల్లాడుతున్నారు. తగిన సామర్థ్యంతో విద్యుత్ సరఫరా నెట్‌వర్క్ (గ్రిడ్) అందుబాటులో లేకపోవడం, మారుమూల, అటవీ ప్రాంతాలు కావడం.. అత్యల్ప జనాభా ఉన్న చోట్లకు విద్యుత్ లైన్ల ఏర్పాటుకు భారీ వ్యయమయ్యే అవకాశముండడం వంటివి దీనికి కారణంగా చెప్పవచ్చు.
 
గణాంకాల్లో విద్యుత్ రంగం
విద్యుత్ ప్రాజెక్టుల స్థాపిత సామర్థ్యం: 3,03,083 మెగావాట్లు
థర్మల్ ప్రాజెక్టుల సామర్థ్యం: 2,11,670 మెగావాట్లు
జల విద్యుత్ ప్రాజెక్టులు: 42,783 మెగావాట్లు
పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు: 42,849 మెగావాట్లు
2014-15లో వార్షిక విద్యుదుత్పత్తి 1,272,000 గిగావాట్/అవర్ (జీడబ్ల్యూహెచ్)
2013లో జపాన్, రష్యా తర్వాత విద్యుదుత్పత్తిలో ప్రపంచంలోనే మూడో స్థానంలో భారత్ నిలిచింది. ప్రపంచ విద్యుదుత్పత్తిలో 4.8 శాతం మన దేశంలోనే జరుగుతోంది.
 
1950లో 15 యూనిట్లుగా ఉన్న వార్షిక జాతీయ తలసరి విద్యుత్ వినియోగం 2014-15లో 746 యూనిట్లకు పెరిగింది.

విద్యుత్ వినియోగంలో వ్యవసాయం వాటా 18.45 శాతం
 2016-17లో విద్యుత్ డిమాండ్ 12,14,642 మిలియన్ యూనిట్లుకాగా... 12,27,895 మిలియన్ యూనిట్ల లభ్యత ఉంది. డిమాండ్‌తో పోల్చితే 1.1 శాతం మిగులును సాధించింది.

2016 ఏప్రిల్ నాటికి దేశం 5,780 మెగావాట్ల అణు విద్యుత్ కేంద్రాలను కలిగి ఉంది. 2014-15లో 37,835 మిలియన్ యూనిట్ల అణు విద్యుత్ ఉత్పత్తి జరిగింది. తారాపూర్‌లో రెండు బాయిలింగ్ రియాక్టర్ల నిర్మాణం కోసం 1964లో అమెరికాకు చెందిన జనరల్ ఎలక్ట్రిక్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా దేశంలో అణు విద్యుత్ అభివృద్ధి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.
 
దేశంలో సౌర విద్యుత్ ప్రాజెక్టుల స్థాపిత సామర్థ్యం 2016 మార్చి నాటికి 6,763 మెగావాట్లు, పవన విద్యుత్ సామర్థ్యం 26866 మెగావాట్లు కాగా... 2022 నాటికి సౌర విద్యుత్‌ను 1,00,000 మెగావాట్లకు, పవన విద్యుత్‌ను 60,000 మెగావాట్లకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement