
వరద కాల్వలను పట్టించుకోండి
మరిన్ని రెయిన్‌గేజ్‌లు ఏర్పాటు చేయాలి: మర్రి శశిధర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ అధికారులకు, నేతలకు కొత్త ప్రాజెక్టులపై ఉన్నంత శ్రద్ధ... ఉన్నవాటి సక్రమ నిర్వహణపై ఉండదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాలుష్యం కారణంగా ముంచుకువస్తున్న వాతావరణ మార్పుల ప్రభావం నగరాలపై ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అధికారులు వరదనీటి కాల్వల నిర్వహణను సక్రమంగా చేపట్టాలన్నారు. వాతావరణ మార్పులు విసురుతున్న సవాళ్లను ఎదుర్కోవడంపై ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా గురువారం ఇక్కడ సదస్సు నిర్వహించింది.
ఇందులో శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ... నగరీకరణతో అక్కడికక్క డ అధిక వేడిమి ఉన్న ప్రాంతాలు ఎక్కువవుతున్నాయని,ఫలితంగా నగరాల్లో తక్కువ సమయంలో ఎక్కువగా వర్షపాతం నమోదవుతోందన్నారు. హైదరాబాద్‌లో కనీసం 150 వరకూ రెయిన్ గేజ్‌లు ఏర్పాటు చేసి, ఏటా వర్షా కాలానికి మునుపే వరద నీటి కాల్వల్లో పూడికలు సక్రమంగా తీస్తే వరదముప్పును గణనీయంగా తగ్గించవచ్చన్నారు.
వాతావరణ మార్పుల ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కోవాలంటే అంతర్జాతీయ స్థాయిలో తగిన భాగస్వామ్యాలు ఉండాలని అమెరికా ప్రభుత్వ కార్యక్రమం స్టేట్ ఎన్విరాన్‌మెంట్ ఇనిషియేటివ్స్ డెరైక్టర్ సుబ్రమణియన్ చెప్పారు. ఈఎస్‌సీఐ డెరైక్టర్ డి.ఎన్.రెడ్డి, పర్యావరణవేత్త కె.పురుషోత్తమ్‌రెడ్డి, ఈఎస్‌సీఐ సెంటర్ ఫర్ క్లైమెట్ చేంజ్ సలహాదారు బి.వి.సుబ్బారావు పాల్గొన్నారు.