గుండెల్లో ‘రైళ్లు’ పరుగెత్తించాడు | mental patient's tention in sec raiway station | Sakshi
Sakshi News home page

గుండెల్లో ‘రైళ్లు’ పరుగెత్తించాడు

Published Tue, Mar 24 2015 12:48 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM

గుండెల్లో ‘రైళ్లు’ పరుగెత్తించాడు - Sakshi

గుండెల్లో ‘రైళ్లు’ పరుగెత్తించాడు

 హైదరాబాద్: నిత్యం ప్రయాణికుల రాకపోకలతో రద్దీగా ఉండే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సోమవారం మధ్యాహ్నం ఓ వ్యక్తి అరుపులు, కేకలతో దద్దరిల్లిపోయింది. మతిస్థిమితం సరిగా లేని ఆ వ్యక్తి రైల్వేస్టేషన్‌లోని ప్రయాణికులు, సిబ్బంది గుండెల్లో గంటన్నరపాటు  ‘రైళ్లు’ పరుగెత్తించాడు. పిచ్చిగా అరుస్తూ... పరుగులు పెడుతూ.. చివరికి తన ప్రాణాలకే ప్రమాదం కొనితెచ్చుకున్నాడు. మహబూబ్‌నగర్ జిల్లా దొల్లోనిపల్లికి చెందిన సంపంగి రంగయ్య (40) వృత్తిరీత్యా వడ్డరి. హైదరాబాద్‌లో ఉద్యోగం కోసం భార్య కాంతమ్మ కుమారుడు శ్రీకాంత్‌తో కలసి ఉదయం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వచ్చాడు.

నగరంలోని తన సోదరి బాలమ్మ చిరునామా కోసం తిరగగా దొరకలేదు. దీంతో గత్యంతరం లేక మళ్లీ కుటుంబంతో సహా మహబూబ్‌నగర్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. మధ్నాహ్నం 2.30 గంటల ప్రాంతంలో మళ్లీ రైల్వేస్టేషన్‌లోని 10వ నంబర్ ప్లాట్‌ఫామ్‌పైకి చేరుకున్నాడు. అంతలోనే అకస్మాత్తుగా అక్కడి నుంచి పరుగులు పెట్టాడు. రైల్వే పోలీసులు,ప్రయాణికులు ఎంత వారించినా వినకుండా రైలు బోగీల మీది నుంచి పరుగు తీయడం మొదలుపెట్టాడు. ఒక బోగీపై నిల్చుని బీడీ కాల్చేందుకు అగ్గిపుల్లను అంటించే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో రైలుకు అనుసంధానమై ఉన్న హైటెన్షన్ విద్యుత్ లైన్ రంగయ్య చేతికి తగలడంతో పెద్ద పెట్టున మంటలు చెలరేగాయి. రంగయ్య అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. రైల్వే పోలీసులు చికిత్స నిమిత్తం అతడిని సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. 80 శాతం కాలిన గాయాలు ఉండడంతో రంగయ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement