ప్రజామోదం లేకుండా భూ సేకరణా?
హరీశ్‌కు టీటీడీపీ అధికార ప్రతినిధి నర్సిరెడ్డి బహిరంగ లేఖ
సాక్షి, హైదరాబాద్: గ్రామ సభలు నిర్వహించకుండా, ప్రజల ఆమోదం లేకుండా నిర్బంధంగా భూసేకరణ ఎలా చేపడతారని తెలంగాణ టీడీపీ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ మేరకు ఆయన సోమవారం నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావుకు బహిరంగ లేఖ రాశారు. నిరసన తెలిపిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ, భూములు ఇస్తారా, చస్తారా అంటూ బెదిరింపులకు దిగుతున్న ప్రభుత్వం... తన ధోరణిని వెంటనే మానుకోవాలన్నారు.
2013 భూసేకరణ చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి భూముల రిజిస్ట్రేషన్లు నిలిపివేసి, పోలీసు బలగాలను వెనక్కి రప్పించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ ఆధ్వర్యంలో అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయంతో పరిష్కారం చూపాలన్నారు.