‘నయాసాల్’ జోష్..పోలీస్ రెడీ | 'Nayasal Josh .. Police will | Sakshi
Sakshi News home page

‘నయాసాల్’ జోష్..పోలీస్ రెడీ

Published Mon, Dec 30 2013 4:31 AM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM

‘నయాసాల్’ జోష్..పోలీస్ రెడీ - Sakshi

‘నయాసాల్’ జోష్..పోలీస్ రెడీ

=ప్రత్యేక బృందాల ఏర్పాటు
 =హద్దు మీరితే చర్యలు
 =పబ్‌లు, హోటళ్లపై ఆంక్షలు
 =‘మాజీ డ్రగ్ పెడ్లర్స్’పై ప్రత్యేక దృష్టి
 =అనుమానిత డీజేలపై ‘మఫ్టీ’ నిఘా

 
సాక్షి, సిటీబ్యూరో: న్యూ ఇయర్ వేడుకలు సాఫీగా సాగిపోయేందుకు నగర పోలీసులు పక్కా ఏర్పాట్లు చేస్తున్నారు. అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా అంతా ఎంజాయ్ చేసేందుకు వీలుగా చర్యలు తీసుకుంటున్నారు. పలు కీలక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. నయా సాల్ సంబరాలు సజావుగా సాగేలా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని కొత్వాల్ అనురాగ్ శర్మ ఆదేశాలు జారీ చేశారు.
 
స్టాగర్స్ జాబితాలు సిద్ధం

 వివిధ సందర్భాలు, సమయాల్లో సిటీలోని పబ్స్ కపుల్ ఎంట్రీలను మాత్రమే అనుమతిస్తుంటాయి. దీనిపై పలు సందర్భాల్లో కొందరు యువకులు గుంపులుగా వచ్చి పబ్స్ వద్ద హల్‌చల్ చేస్తుంటారు. స్టాగ్ గ్యాంగ్స్‌గా పిలిచే వీరు గతంలో చేసిన హంగామాలను బట్టి పోలీసులు ఓ బ్లాక్‌లిస్ట్ తయారు చేశారు. ఇలాంటి వారి కదలికలు, వ్యవహారాలపై డేగకన్ను వేయడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి.
 
పెడ్లర్స్‌కు కట్టడి...


న్యూ ఇయర్ పార్టీల నేపథ్యంలో డ్రగ్స్ విక్రయం, వినియోగం పెరిగే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో రెండు విడతల్లో పట్టుబడిన ముఠాలూ నగరానికి కొకైన్ రవాణా చేసినట్లు బయటపెట్టాయి. నగరంలోని మిగతా నాలుగింటితో పోలిస్తే పశ్చిమ మండలం పూర్తి విభిన్నమైంది. ఇది వీఐపీ జోన్ మాత్రమే కాదు..
‘ఖరీదైన’ కుర్రకారు జోన్ కూడా.

మాదకద్రవ్యాల విక్రయం, వినియోగం సైతం ఇక్కడే ఎక్కువగా సాగుతుంటుంది. సిటీలో చిక్కిన డ్రగ్స్ విక్రేతలు, వినియోగదారుల్లో అనేకమంది వెస్ట్‌జోన్‌లోనే పట్టుబడ్డారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న అనురాగ్ శర్మ గతంలో మాదకద్రవ్యాలు విక్రయిస్తూ (పెడ్లర్స్) అరెస్టై, ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న వారిని కట్టడి చేయాలని ఆదేశించారు. అవసరమైన పక్షంలో వీరందరినీ ముందస్తుగా అదుపులోకి తీసుకోవడం ద్వారా చెక్ చెప్పేందుకు స్పెషల్ టీమ్స్ రంగంలోకి దింపాలని యోచిస్తున్నారు.

మరోపక్క కొన్ని పబ్స్‌లోని డీజేలు కూడా పెడ్లర్స్‌గా మారి వ్యవహారాలు సాగిస్తున్నట్లు గుర్తించారు. వీరిపై నిఘా వేయడానికి మఫ్టీ బృందాలు విధుల్లో ఉండబోతున్నాయి. వీటితో పాటు శాంతి భద్రతల సమస్యలు రాకుండా చూసేందుకు క్విక్ రెస్పాన్స్ టీమ్స్ (క్యూఆర్టీ), ఈవ్‌టీజింగ్ కంట్రోలింగ్‌కు ప్రత్యేక బృందాలు మోహరిస్తున్నారు. మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు ఈ బృందాలన్నీ పని చేస్తుంటాయి. అలాగే న్యూ ఇయర్ నేపథ్యంలో వివిధ సామూహిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న హోటల్స్, పబ్స్ తదితర సంస్థలకు పోలీసులు పలు ఆంక్ష లు విధించారు.
 
 ఆంక్షలివీ...

 కార్యక్రమాలకు వచ్చే ఆర్టిస్టులు, డీజేలకూ నిబంధనలున్నాయి. వీరి వస్త్రధారణ, హావ భావాలు, పాటలు తదితరాల్లో ఎక్కడా అశ్లీలం, అసభ్యతలకు తావుండకూడదు.
 
 ఏర్పాటు చేసే సౌండ్ సిస్టం నుంచి వచ్చే ధ్వని తీవ్రత 45 డెసిబుల్స్‌కు మించకూడదు.
 
 అపార్ట్‌మెంట్స్‌లో వ్యక్తిగత పార్టీలు నిర్వహిస్తున్న వాళ్లూ పక్కవారికి ఇబ్బంది లేకుండా సౌండ్ పెట్టుకోవాలి.
 
 మాదకద్రవ్యాలు సేవించి వచ్చే వారినీ హోటల్స్, పబ్స్ నిర్వాహకులు అనుమతించకూడదు.
 
 యువతకు సంబంధించి ఎలాంటి విశృంఖలత్వానికి తావు లేకుండా, మైనర్లు పార్టీలకు రాకుండా నిర్వాహకులు చూసుకోవాలి.
 
 బౌన్సర్లు అతిగా ప్రవర్తించినా, ఆహూతులకు ఇబ్బందులు కలిగించినా వారితోపాటు ఏర్పాటు చేసిన సంస్థల పైనా చర్యలు.
 
 ఏసీపీల నేతృత్వంలో ప్రత్యేక బృందాలు కార్యక్రమాలు జరిగే ప్రాంతాల్లో తనిఖీలు చేస్తాయి.
 
 వీరు కార్యక్రమాల చిత్రీకరణతో పాటు ఆడియో మిషన్ల సాయంతో శ బ్ద తీవ్రతనూ కొలుస్తారు.
 
 నెక్లెస్‌రోడ్, కేబీఆర్ పార్క్‌రోడ్, బంజారాహిల్స్ రోడ్ నెం.1, 2, 45, 36లతోపాటు జూబ్లీహిల్స్ రోడ్‌నెం. 10, సికింద్రాబాద్, మెహిదీపట్నం, గండిపేట దారుల్లో రేసులు, డ్రంకన్ డ్రైవింగ్‌పై ప్రత్యేక నిఘా.
 
 బహిరంగ ప్రదేశాల్లో టపాసులు కాల్చకూడదు.
 
 వాహనాల్లో ప్రయాణిస్తూ, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చేస్తే చర్యలు.
 
 వాహనాలు టాప్స్, డిక్కీలు ఓపెన్ చేసి డ్రైవ్ చేయడం, కిటికీల్లోంచి టీజింగ్ చేయడం నిషేధం.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement