ఇక్కడ అమ్మాయి...అక్కడ అబ్బాయి
హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్ నయీం లీలలు సినిమాను తలపిస్తున్నాయి. మారువేషాల్లో ఎంచక్కగా విమానంలో వెళ్లడమే కాకుండా ఆయా ఎయిర్‌పోర్టుల నుంచి నిమిషాల వ్యవధిలో ఇంటికి చేరేందుకు మహీంద్రా ఎక్స్‌యూవీ వెహికల్స్‌ను అక్కడే పార్క్ చేసేవాడన్న విషయం తాజాగా బహిర్గతమైంది. నార్సింగ్ పోలీసు కస్టడీ ముగిసిన మహమ్మద్ అబ్దుల్ ఫహీమ్, ఆయన భార్య షాజీదా షాహీన్‌ల విచారణలో ఈ విషయం తేలడంతో పోలీసులు అవాక్కయ్యారు.
నయీం ఎక్కువగా చత్తీస్‌గడ్‌లోని రాయ్‌పూర్, హైదరాబాద్‌లోని శంషాబాద్‌కు ఎక్కువగా విమానాల్లో చక్కర్లు కొట్టేవాడని విచారణలో వెల్లడైంది. నెలలో కనీసం నాలుగైదు సార్లు ప్రయాణాలు చేసేవాడని తెలిసింది. ఇక్కడ భూసెటిల్‌మెంట్లు కాని వాటిని చత్తీస్‌గఢ్‌లోని డెన్‌లో సెటిల్ చేసేందుకు వెళుతుండేవాడు.
భూమి బాధితులను మాత్రం అక్కడికి రప్పించుకుని ముందు మంచి విందు ఇచ్చేవాడు. ఆ తర్వాత వారు మాట వినకుంటే బెదిరించి మరీ భూ డాక్యుమెంట్లపై సంతకాలు చేయించేవాడని సమాచారం. అయితే నయీం ఎన్‌కౌంటర్ తర్వాత రాజేంద్రనగర్ మండలం నెక్నాంపూర్ గ్రామంలోని అల్కాపూరి టౌన్‌షిప్‌లోని అతని ఇంట్లో లభించి కిట్ మేకప్‌లు, విగ్‌లను ఉపయోగించే విమానాల్లో ప్రయాణాలు చేసేవాడని పోలీసుల విచారణలో వెల్లడైంది.
ఇక్కడ అమ్మాయి...అక్కడ అబ్బాయి
శంషాబాద్ విమానాశ్రయం నుంచి చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ వెళ్లేందుకు లేడీ గెటప్ ధరించేవాడు. అడవాళ్ల వేషధారణ ధరించేందుకు తెగ ఆసక్తి చూపే నయీం రాయ్‌పూర్ విమానాశ్రాయానికి చేరుకోగానే అక్కడ పార్క్ చేసిన తన వెహికల్‌లోకి ఎక్కగానే చీర విప్పేసి టీషర్ట్, ప్యాంట్ వేసుకొని దర్జాగా మగాడిలా ఇంటికి వెళ్లేవాడట.
ఆ తర్వాత అక్కడ తన భూ దందాలు చేసేవాడు. ఆ క్రమంలో అమ్మాయిలతో ఎంజాయ్ చేసేవాడు. అయితే నయీం రియల్ లైఫ్‌లో చేసిన ఈ సీన్లు అచ్చం సినిమాల్లోని సన్నివేశాలను తలపిస్తుంది. నయీంతో కలిసి నేరాలు చేశాం... గ్యాంగ్‌స్టర్ నయీంతో కలిసి హేయమైన నేరాలు చేశామని అతడి అల్లుడు ఫహీమ్, ఆయన భార్య షాజీదా షాహీన్‌లు పోలీసు విచారణలో ఒప్పుకున్నారు. నదీమ్, నస్రీమ్ హత్య కేసుల్లో తాము సహకరించామని, వారి మృతదేహాలను నగర శివారు ప్రాంతాలైన షాద్‌నగర్, మంచిరేవుల ప్రాంతాల్లో కాల్చివేసినట్లు తెలిపారు.
తమ సహాకారంతో ఎంతో మందిని బెదిరించి భారీ మొత్తంలో డబ్బులు సంపాదించిన నయీం...నిందితురాలైన అక్క కూతురు షాజీదా షాహీన్ పేరిట రాజమండ్రి, విజయవాడ, బాపట్ల, నెల్లూరు, ఒంగోలు తదితర ప్రాంతాల్లో ఇళ్లను కొనుగోలు చేశాడని చెప్పారు. తనకు అనుమతిస్తే తాము కొనుగోలు చేసిన వాహనాలను చూపిస్తానన్నారు. శంషాబాద్, రాయ్‌పూర్ ఎయిర్‌పోర్టులలో మహీంద్రా ఎక్స్‌యూవీ వెహికల్స్ పార్క్ చేసి ఉన్నాయి. నల్గొండలో బొలెరోను మసూద్‌కు ఇచ్చామని, చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో అల్టో కారు, టాటా సఫారీ, హ్యందాయ్ ఇయాన్ కారులు ఉన్నాయని తెలిపారు.
రాజేంద్రనగర్ మండలం నెక్నాంపూర్ గ్రామంలోని అల్కాపూరి టౌన్‌షిప్‌లోని వైఎస్‌ఆర్ హౌస్‌లో నస్రీమ్‌ను హతమార్చి ఆ తర్వాత మంచిరేవుల ప్రాంతానికి తీసుకెళ్లి కాల్చిన ఆస్థిపంజర మృతదేహాన్ని ఫహీమ్ చూపించాడు. అక్కడ ఒక చున్నీ ముక్కను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
వాహనాలు స్వాధీనం చేసుకునేంత సమయం లేకపోవడంతో తర్వాత నిందితులను కస్టడీకిస్తే ఆ సమయంలో సదరు వాహనాలను సీజ్ చేస్తామని రాజేంద్రనగర్‌లోని ఉప్పర్‌పల్లి కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పోలీసులు పేర్కొన్నారు. అయితే వీరిద్దరిని పది రోజుల పాటు కస్టడీకివ్వాలన్న పిటిషన్ విచారణను న్యాయస్థానం బుధవారానికి వాయిదా వేసింది. ఇదే కేసులో ఏ1, ఏ2లుగా ఉన్న ఫర్హానా, ఆఫ్సాల ఏడు రోజుల పోలీసు కస్టడీకివ్వాలని నార్సింగ్ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ విచారణ కూడా బుధవారానికే వాయిదా పడింది.