
ముస్లింలకు వ్యతిరేకం కాదు
* బీజేపీ నేతలు కె.లక్ష్మణ్, కిషన్‌రెడ్డి
* పేద ముస్లింల అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: తమ పార్టీ ముస్లింలకు వ్యతిరేకం కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, శాసనసభాపక్ష నేత జి.కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈద్ మిలాప్ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. ముస్లింల సంక్షేమం, అభివృద్ధి కోసం కేంద్రం ఎన్నో పథకాలను తెచ్చిందన్నారు. రాష్ట్రంలో పేద ముస్లింల అభివృద్ధిని టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. పాతబస్తీలో ప్రభుత్వ స్కూళ్లు, ఆస్పత్రులు అధ్వానంగా ఉన్నాయని విమర్శించారు.
ప్రభుత్వ సంస్థలను, వ్యవస్థలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు. పేదలకు కేంద్రం ఇస్తున్న నిధులనూ రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందన్నారు. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉగ్రవాదంపై మాత్రమే బీజేపీ పోరాటమని, ముస్లింలకు వ్యతిరేకం కాదన్నారు. మతోన్మాదాన్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందుతున్న మజ్లిస్‌కు మాత్రమే తాము వ్యతిరేకమన్నారు.
కాంట్రాక్టర్ల కనుసన్నల్లో ప్రభుత్వం: నాగం
సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల ఆర్థిక ప్రయోజనాల కోసం.. కాంట్రాక్టర్ల కనుసన్నల్లో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని మాజీ మంత్రి, బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి విమర్శించా రు. నగరంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో నడుస్తున్న ప్రాజెక్టుల్లో అంచనా వ్యయం పెంచడానికి ఇచ్చిన జీవో 146 ఆధారంగా అవినీతి రాజ్యమేలుతోందని ఆరోపించారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెంచడంలో కేసీఆర్‌కు ప్రమేయం లేకుంటే సీబీఐ విచారణ జరి పించాలని డిమాండ్ చేశారు.
ఈఎన్‌సీ మురళీధర్‌రావు ఈ అవినీతిలో కీలకపాత్రధారి అని, ప్రాజెక్టుల్లో అవినీతికి పాల్పడటం, కేసీఆర్ కుటుంబ సభ్యులకు కమీషన్లు దోచిపెట్టడానికే మురళీధర్‌రావుకు పదవీకాలాన్ని పొడిగించారన్నారు. ప్రాజెక్టులను ఆలస్యం చేసినవారికి జరిమానాలను విధించకుండా, అంచనాలను పెంచడం వెనుక భారీ అవినీతి ఉందన్నారు. కరువులో రైతులను ఆదుకోవడానికి కేంద్రం ఇచ్చిన నిధులనూ కాంట్రాక్టర్లకు ఇస్తూ, రైతుల రక్తాన్ని సీఎం కేసీఆర్ పీల్చుకుంటున్నారని నాగం విమర్శించారు.