మాజీ బాస్‌కు టోపీ.. రూ. 3 లక్షల షాపింగ్!
మాజీ బాస్ డెబిట్ కార్డు సమాచారం మొత్తాన్ని దొంగిలించి.. దాంతో ఏకంగా రూ. 3 లక్షల వరకు ఆన్‌లైన్ షాపింగ్ చేసిన ప్రబుద్ధుడిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. అతడు కొన్నవాటిలో దాదాపు రూ. 1.50 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు, దుస్తులు, రెండు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాధితుడు ఫిర్యాదు చేయడంతో.. ఈ-కామర్స్ వెబ్‌సైట్లు కూడా అతడు ఆర్డర్ చేసిన వస్తువులను డెలివరీ ఇవ్వకుండా ఆపేసి.. ఆ డబ్బును సదరు అకౌంటుకు తిప్పి పంపుతున్నాయి.
తన ఖాతాలోంచి జనవరి 31 నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు దాదాపు రూ. 3 లక్షల మేర ఆన్‌లైన్ లావాదేవీలు జరిగినట్లు అకౌంటు బ్యాలెన్స్‌లో ఉందని శాంతినగర్ కాలనీలోని స్నిపర్ ఎలక్ట్రానిక్స్ అధినేత ఖాజా సల్మాన్ వాసిఫ్ పోలీసులకు ఈనెల 6వ తేదీన ఫిర్యాదుచేశారు. అయితే అసలు తాను ఆన్‌లైన్‌లో ఏమీ కొనలేదని, డెబిట్ కార్డు కూడా తన దగ్గరే ఉందని చెప్పారు. దాంతో సీసీఎస్‌లోని సైబర్ క్రైం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ కామర్స్ వెబ్‌సైట్ల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం నిందితుడి మొబైల్ నెంబరు, అతడికి వస్తువులు డెలివరీ చేసిన చిరునామా పట్టుకున్నారు. అతడి మొబైల్ సిగ్నల్ శంకర్‌పల్లిలో ట్రేస్ అయింది. వాటి ద్వారా నిందితుడు శ్రీకాంత్ రెడ్డి (19)ని అరెస్టు చేశారు.
శ్రీకాంత్ రెడ్డి స్నైపర్ ఎలక్ట్రానిక్స్‌లో ఆఫీస్ బోయ్‌గా పనిచేసేవాడు. యజమాని డెబిట్ కార్డు నెంబరు, సీవీవీ నెంబరు, ఎక్స్‌పైరీ డేట్ లాంటివాటిని జాగ్రత్తగా రాసుకుని, 2015 డిసెంబర్‌లో ఉద్యోగం మానేశాడు. తర్వాత ఫ్లిప్‌కార్ట్, ఎమెజాన్, మైంత్రా, జబాంగ్, జాపర్, షాప్‌క్లూస్ లాంటి ఈ కామర్స్ యాప్‌లను తన మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్నాడు. ఇక తన మాజీ బాస్ డెబిట్ కార్డుతో ఎడాపెడా కొనుగోళ్లు మొదలుపెట్టాడు. పోలీసులను తప్పుదోవ పట్టించడానికి తన పేరు, చిరునామా తప్పుగా ఇచ్చాడు. డెలివరీ బోయ్ కాల్ చేయగానే తానే స్వయంగా వెళ్లి వాటిని తీసుకునేవాడు. అయితే ఫోన్ నెంబరు మాత్రం అదే ఉండటంతో పోలీసులు అతడిని పట్టుకున్నారు.