ఎల్‌జీసీ రద్దుపై హైకోర్టులో పిటిషన్
- కేసుల బదలాయింపు అధికారంపై సందేహం
- లోతుగా విచారణ చేపట్టాల్సి ఉందన్న ధర్మాసనం
సాక్షి, హైదరాబాద్: భూ ఆక్రమణల నిరోధక న్యాయస్థానాన్ని (ఎల్‌జీసీ) రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ కోర్టులో ఉన్న కేసులన్నింటినీ వివిధ జిల్లా కోర్టులకు, హైకోర్టుకు బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 1న జారీ చేసిన జీవో 113ను రద్దు చేయాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన ఎల్.సుబ్బరామిరెడ్డి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిని శుక్రవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం విచారించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, భూ ఆక్రమణల నిరోధక న్యాయస్థానాన్ని రద్దు చేసి అక్కడున్న కేసులను వివిధ కోర్టులకు బదలాయించే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు.
గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా ప్రభుత్వం జీవో జారీ చేసిందని నివేదించారు. తరువాత ప్రభుత్వం తరఫు అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 101 ప్రకారం తమకున్న అధికారాన్ని ఉపయోగించి భూ ఆక్రమణల నిరోధక న్యాయస్థానాన్ని రద్దు చేశామన్నారు. అక్కడున్న కేసులను వివిధ కోర్టులకు బదలాయించేందుకు ఉత్తర్వులు జారీ చేశామని తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ, సెక్షన్101 ప్రకారం చట్టాన్ని అన్వయింప చేసుకోవడం, సవరణలు చేసుకోవడం, రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, అయితే అక్కడ నుంచి కేసులను బదలాయించే అధికారం ప్రభుత్వానికి ఉందా? అంటూ సందేహం వ్యక్తం చేసింది.
అలా బదలాయించాలంటే శాసనవ్యవస్థ ద్వారానే సాధ్యమవుతుందని అభిప్రాయపడింది. పిటిషనర్ తరఫు న్యాయవాది జోక్యం చేసుకుంటూ, జీవో 113 అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించారు. అయితే ధర్మాసనం ఈ అభ్యర్థనను తిరస్కరించింది. ఇది చట్ట నిబంధనలకు సంబంధించిన వ్యవహారం కావడంతో లోతుగా విచారణ చేపట్టాల్సి ఉందన్న ధర్మాసనం, మీరు కూడా అన్ని విషయాలను అధ్యయనం చేసి రావాలని ఇరు పక్షాలకు స్పష్టం చేసింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.