ఏరో స్పేస్ హబ్ భారత్ | President Pranab Mukherjee started indian aviation show-2016 in begumpet airport | Sakshi
Sakshi News home page

ఏరో స్పేస్ హబ్ భారత్

Published Thu, Mar 17 2016 4:44 AM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

ఏరో స్పేస్ హబ్ భారత్ - Sakshi

ఏరో స్పేస్ హబ్ భారత్

అభివృద్ధికి సువర్ణ అవకాశమున్న రంగం
2020 నాటికి ప్రపంచంలో మూడో స్థానం
ఏవియేషన్ షోను ప్రారంభించిన రాష్ట్రపతి
విమానాలు, హెలికాప్టర్లను తిలకించిన ప్రణబ్
దీనికి నగరాన్ని మించిన వేదిక లేదు: కేసీఆర్
వేడుకలో పాల్గొన్న గవర్నర్ తదితరులు

సాక్షి, హైదరాబాద్: దేశంలో పౌర విమానయాన వ్యాపారం శరవేగంగా వృద్ధి చెందుతోందని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అన్నారు. ‘‘విదేశీ పెట్టుబడులకు మన విమానయాన రంగం ఆకర్షణీయ గమ్యస్థానంగానిలుస్తోంది.ఓపెన్ స్కై పాలసీతో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులకు ద్వారాలు తెరవడంతో మన దేశం ఏరోస్పేస్ పరిశ్రమల తయారీ కీలక కేంద్రంగా మారనుంది. విమానయాన రంగంలో ప్రస్తుతం ప్రపంచంలో ప్రస్తుతమున్న 9వ స్థానం నుంచి 2020 నాటికి మూడో స్థానానికి ఎదిగే అవకాశముంది’’ అని అభిప్రాయపడ్డారు. బుధవారం హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో ఐదో ‘ఇండియన్ ఏవియేషన్ షో-2016’ ఉత్సవాలను రాష్ట్రపతి ప్రారంభించి ప్రసంగించారు. ‘‘మన దేశం నుంచి 45 దేశాలకు విమానాలు నడుస్తున్నాయి.

గతేడాది దాదాపు 19 కోట్ల మంది ప్రయాణికులకు సేవలందాయి. కానీ ఇప్పటికీ మన దేశంలో విమానయానం ఆశించిన స్థాయిలో విస్తరించలేదు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విమాన సేవలందడం లేదు. కొన్ని నగరాలు ఇప్పటికీ జాతీయ గ్రిడ్‌లో లేవు. ఈశాన్య రాష్ట్రాలు ఇప్పటికీ వైమానిక అనుసంధానికి, సదుపాయాలకు దూరంగానే ఉన్నాయి’’ అని ఆవేదన వెలిబుచ్చారు. ‘‘మధ్యతరగతి జనాభా గణనీయంగా పెరగడం, వారి ఆదాయం స్థిరంగా పెరుగుతుండటంతో వ్యాపార, విహారయాత్రలకు విమాన ప్రయాణాలు చేసే స్థాయికి చేరుకున్నారు. పర్యాటకం, వాణిజ్యం విమానయానానికి అండగా నిలిచాయి. 2020 నాటికి దేశంలో విమానయానం చేసే ప్రయాణికుల సంఖ్య 42 కోట్లకు చేరుతుంది. ప్రభుత్వంతో పాటు ఈ రంగంలోని భాగస్వాములంతా దీన్నో సువర్ణ వ్యాపారవకాశంగా గుర్తించాలి.

మౌలిక సదుపాయాలను మరింత పెంచడం, కొత్త విమానాశ్రయాలను నెలకొల్పడం, ఉన్నవాటి స్థాయి పెంచడం అత్యవసరం. విమానాశ్రయాల మౌలిక సదుపాయాల అభివృద్ధి, నావిగేషన్ సేవలకు వచ్చే పదేళ్లలో దాదాపు 120 బిలియన్ డాలర్లను కేంద్ర ప్రభుత్వం పెట్టుబడులుగా పెట్టే ప్రణాళికతో ఉంది’’ అన్నారు. భారత్‌ను ఏరో స్పేస్ తయారీ, నిర్వహణ, కార్యకలాపాల హబ్‌గా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సదస్సుకు వచ్చిన ప్రతినిధులకు రాష్ట్రపతి పిలుపునిచ్చారు. ఈ రంగంలోని భాగస్వామ్యులకు, అంతర్జాతీయ వాణిజ్యవేత్తలకు ఈ షో బృహత్తర వేదికగా నిలుస్తుందన్నారు.

కేంద్రం ప్రారంభించిన మేకిన్ ఇండియా, స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియాలకూ ఉత్ప్రేరకంగా నిలుస్తుందన్నారు. 25 దేశాల నుంచి 200 మందికిపైగా ప్రతినిధులు హాజరవడం సంతోషించదగ్గ విషయమన్నారు. విమానాల తయారీ, మరమ్మతులు, కార్యకలాపాల నిర్వహణను దేశంలోనే చేపట్టేందుకు అవసరమైన పరిశ్రమలు, శిక్షణా నైపుణ్యాలను ప్రోత్సహించేందుకు ఈ రంగంపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించిందని పౌర విమానయాన మంత్రి అశోక్‌గజపతిరాజు అన్నారు.

 ఘనంగా ప్రారంభోత్సవం
అంతకుముందు ఏవియేషన్ ఎగ్జిబిషన్ అట్టహాసంగా ప్రారంభమైంది. మధ్యాహ్నం 3.30కు ప్రణబ్ బేగంపేట విమానాశ్రయానికి వచ్చారు. రన్‌వేపై కొలువుదీరిన విమానాలను ప్రత్యేక వాహనంపై కూర్చొని తిలకిస్తూ ముందుకు సాగారు. పక్కన అశోక్ గజపతిరాజు, వెనక వాహనంలో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఆ వెనక హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు అనుసరించారు. కార్యక్రమం అనంతరం ప్రదర్శనలోని ఏ380, ఏ350, ఎయిర్‌బస్747, ఎయిర్‌బస్800, బోయింగ్ తదితర విమానాలు, హెలికాప్టర్లు, పలు కంపెనీల స్టాళ్లను ప్రణబ్ తిలకించారు.

తర్వాత ఢిల్లీకి తిరుగు పయనమయ్యారు. ప్రారంభోత్సవంలో పాల్గొనని ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రపతి తిరిగి వెళ్లేటప్పుడు విమానాశ్రయానికి చేరుకొని ఆయనకు వీడ్కోలు పలికారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్, స్పీకర్ మధుసూదనాచారి, రాష్ట్ర మంత్రులు, ఫిక్కీ ప్రెసిడెంట్ హర్షవర్ధన్, పలు దేశాలకు చెందిన 200 మంది ప్రతినిధులు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. విమానయాన సంస్థలు, ఎమ్‌ఆర్‌ఓలు, విమాన తయారీ, ఇంజన్ తయారీ, శిక్షణా సంస్థలు తదితరాలు ప్రదర్శనలో పాలుపంచు కున్నాయి.

ఎలిమినేడులో ఏరోస్పేస్ పార్క్: కేసీఆర్
ఏవియేషన్ షో నిర్వహణకు హైదరాబాద్‌కు మించిన వేదిక లేదని సీఎం కేసీఆర్ అన్నారు. వైమానిక రంగంతో పాటు రక్షణ రంగంలో పలు పరికరాల తయారీ సంస్థలుండటం నగరానికి ప్రత్యేకతగా నిలుస్తోందన్నారు. దేశంలోనే అత్యంత వనరులున్న కేంద్రంగా పెట్టుబడులకు గమ్యస్థానంగా నగరం నిలుస్తుందన్నారు. ఇప్పటికే ఆదిభట్ల, నాదర్‌గుల్‌లలో ఏరోస్పేస్ పార్క్‌లు నెలకొల్పామని, ఎలిమనేడులో మరో పార్కును ఏర్పాటు చేస్తామని తెలిపారు.

 ఇవెంతో ‘స్పెషల్’ గురూ
దేశ, విదేశీ లోహ విహంగాలు రాష్ట్ర రాజధానిలో హంగామా చేస్తున్నాయి. బేగంపేట విమానాశ్రయంలో ప్రారంభమైన ఏవియేషన్ షోలో పలు ప్రత్యేక విమానాలు చూపరులను ఆకట్టుకున్నాయి. పలు ప్రత్యేకతలతో విదేశీ అతిథులనూ కట్టిపడేసిన లోహ విహంగాల్లో కొన్నింటి విశేషాలు...      - సాక్షి, హైదరాబాద్

‘ఖతర్’నాక్ కూల్ జర్నీ...
కమర్షియల్ విమానాల్లోకెల్లా అత్యాధునికమైనది ఎయిర్‌క్రాఫ్ట్ ఎయిర్‌బస్ 350-900. 283 సీట్ల సామర్థ్యమున్న ఈ విమానంలో ప్రయాణికులకు కూల్ కూల్ వాతావరణం ఉంటుంది. మిగతా విమానాలతో పోలిస్తే దీని కేబిన్లో ఉక్కపోత 20 శాతం మాత్రమే ఉంటుందట. 52 శాతం కార్బన్ ఫైబర్‌తో తయారవడంతో ఇంధనాన్ని కూడా చాలా తక్కువగా వాడుకుంటుంది. మరే విమానంలోనూ లేని విధంగా దాదాపు 3,000 చానళ్లు, కావాల్సినన్ని సినిమాలతో ప్రయాణికులకు కావాల్సినంత వినోదం అందుబాటులో ఉంటుంది. చివరికి కాక్‌పీట్ కూడా అందంగా ఆకట్టుకుంటుంది. అయితే ఈ విమాన సేవలు భారత్‌లో ఇంకా మొదలవలేదు. ప్రస్తుతానికి అమెరికా, జర్మనీ, సింగపూర్‌లకే పరిమితం.

‘థ్రస్ట్’ అదుర్స్
ముంబైకి చెందిన కెప్టెన్ అమోల్ ఎస్.యాదవ్ రూపొందించిన బుల్లి విహంగం ‘థ్రస్ట్’ చూడగానే ఆహా అన్పించేలా ఉంది. ఆరుగురు కూర్చునేలా తీర్చిదిద్దిన ఈ విమానం గంటకు 350 కిలోమీటర్ల వేగంతో 13,000 అడుగుల ఎత్తున ఎగరగలదు. సాధారణ పెట్రోల్‌తోనే నడవడం దీని ప్రత్యేకత! డీజీసీఏ అనుమతులు రాగానే ఈ విమాన సేవలను ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తానంటున్నారు యాదవ్.

 ఎమిరేట్స్ విమానంలో తెలుగు
ప్రపంచంలోనే పెద్ద విమానం ఎమిరేట్స్ ఫ్లైట్ ఏ380-800లో ఇక తెలుగువెలుగులను చూడవచ్చు. విమానంలోని రెస్టారెంట్‌లో లంచ్‌లో వడ్డించే వంటకాలు, వాటిలోనూ స్నాక్స్, కాఫీ, టీ తదితరాల్లోనూ వాడే పదార్థాల దాకా ప్రతి విషయాన్నీ మెనూలో తెలుగు భాషలో కూడా రాసి ఉంచడం విశేషం! రాజహంసగా పిలిచే ఈ రెండంతస్తుల దుబాయ్ విమానంలో సకల సదుపాయాలున్నాయి. బార్ నుంచి భోజనశాల వరకు అన్నీ సూపర్. బీర్లు, కాక్‌టెయిల్స్, స్పిరిట్స్, విస్కీ, వోడ్కావంటి మద్యంతో కూడిన బార్,  తాగేందుకు ప్రత్యేక కేబిన్లు, పడుకునేందుకు బెడ్లు తదితరాలు దీని సొంతం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement