♦ ‘మెట్రో’కు తొలగిన వారసత్వ చిక్కులు
♦ బేగంపేట్‌లో లైన్ క్లియర్
♦ అల్లావుద్దీన్, జబ్బార్ బిల్డింగ్‌ల కూల్చివేత
♦ ట్రాఫిక్ కష్టాలు తొలగించాలని సీఎస్ ఆదేశం
బేగంపేట్ వైపు మెట్రో రైలు దూసుకుపోయేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇక పనులు ఊపందుకోనున్నాయి. ప్రధాన రహదారిపై మెట్రో ప్రాజెక్టుకు అవరోధంగా మారిన వారసత్వ కట్టడాల చిక్కులు ఎట్టకేలకు తొలగిపోయాయి. పాత ఎయిర్‌పోర్ట్ ఫ్లైఓవర్, షాపర్స్‌టాప్ వద్ద మెట్రో పనులకు తాజాగా లైన్ క్లియరైంది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రెండు భవంతుల కూల్చివేత కార్యక్రమాన్ని మంగళవారం జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎంఆర్ అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు. ఆ ప్రాంతాల్లోని అల్లాఉద్దీన్ బిల్డింగ్, జబ్బా ర్ బిల్డింగ్‌లను వారసత్వ కట్టడాలుగా పేర్కొంటూ గత 30 ఏళ్లుగా న్యాయస్థానాల్లో కేసులు నడుస్తున్నాయి.
దీంతో గతంలో రహదారి విస్తరణలో వీటిని తొలగించడం సాధ్యం కాలేదు. హైకోర్టు తాజా ఆదేశాలతో అల్లావుద్దీన్ భవనంలో 666 చదరపు అడుగులు, జబ్బార్ బిల్డింగ్‌లో 635 అడుగుల స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు పరిహారాన్ని అందజేసిన తర్వాతే భవనాలను కూల్చివేసినట్లు హెచ్‌ఎంఆర్ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఈ ప్రాంతంలో రహదారిని మరో 40 అడుగుల మేర విస్తరించేందుకు అవకాశం ఏర్పడిందన్నారు. ఆస్తుల సేకరణ వేగవంతం చేయడ ంతో సీఎస్ రాజీవ్ శర్మ జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎంఆర్ అధికారులను ప్రత్యేకంగా అభినందించినట్లు తెలిపారు.
ట్రాఫిక్ ఇక్కట్లు తొలగించండి:సీఎస్
మెట్రో పనులు జరుగుతున్న ప్రధాన రహదారులపై ట్రాఫిక్ చిక్కులు తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎస్ రాజీవ్ శర్మ అధికారులను ఆదేశించారు. ప్రధాన మెట్రో కారిడార్లలో అధికారులు పర్యటించి ప్రజలకు పరిష్కారం చూపాలని సూచించారు. మంగళవారం మెట్రో పనులపై జరిగిన టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశంలో ఆయన పనుల పురోగతిపై సమీక్షించారు.
ఇటీవల పనులను వేగవంతం చేసేందుకు వీలుగా నగరంలో 22 ఆస్తులను తొలగించామని, మరో 204 ఆస్తులను సేకరించాల్సి ఉందని హెచ్‌ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి సీఎస్‌కు వివరించారు. పిల్లర్ల నిర్మాణానికి వీలుగా పంజాగుట్ట-నిరంకారీ భవన్, గ్రీన్‌ల్యాండ్స్ జంక్షన్-అమీర్‌పేట్ జంక్షన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో ట్రాఫిక్ అనుమతులు లభించాయన్నారు.పిలర్లు పూర్తయిన వెంటనే బారికేడ్‌లను తొలగించాలని సీఎస్ ఆదేశించారు. సమావేశంలో సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి బీ.ఆర్‌మీనా తదితరులు పాల్గొన్నారు.
ఇక పరుగులే..!
Published Wed, Apr 8 2015 12:20 AM | Last Updated on Tue, Oct 16 2018 5:04 PM
Advertisement
Advertisement