
అభిమానుల అత్యుత్సాహం.. వెనుదిరిగిన సినీతారలు
కేపీహెచ్‌బీకాలనీ (హైదరాబాద్): చెన్నై వరద బాధితులకు అండగా విరాళాలను సేకరించేందుకు ఆదివారం కూకట్‌పల్లి సుజనా ఫోరం మాల్‌లో ఏర్పాటు చేసిన సినీతారల కార్యక్రమం రసాభాసగా మారింది. పెద్దసంఖ్యలో తరలివచ్చిన అభిమానులతో ఫోరం మాల్ కిక్కిరిసిపోయి తొక్కిసలాటకు దారితీసింది. సీనీతారలు కాజల్, రానా, అల్లరి నరేష్, నిఖిల్, మంచు లక్ష్మి, తేజశ్వి తదితరులకు చేదు అనుభవం ఎదురైంది. సభా వేదిక వద్దకు వచ్చిన హీరో, హీరోయిన్లను తాకేందుకు అభిమానులు పెద్దసంఖ్యలో ముందుకు చొచ్చుకురావడం, సెల్‌ఫోన్లతో చిత్రీకరించేందుకు పోటీపడటంతో పరిస్థితి ఒక్కసారిగా తొక్కిసలాటకు దారితీసింది.
దీంతో పలువురు అభిమానులు కిందపడిపోయారు. కార్యక్రమ నిర్వాహాకులు, పోలీసులు, బౌన్సర్లు అభిమానులను కట్టడి చేసేందుకు యత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో సినీతారలు పక్కనే ఉన్న స్టార్‌బక్స్ లోకి వెళ్లి కొద్దిసేపు సేదతీరారు. అనంతరం అక్కడి నుంచి నిష్ర్కమించారు. కాగా, చెన్నై వరద బాధితులను ఆదుకునేందుకు ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలని సినీ తారలు కాజల్, అల్లరి నరేష్, రానా, మంచులక్ష్మి, తేజస్విలు కోరారు. తమిళనాడులో మునుపెన్నడూ లేని విధంగా వర్షాలు, వరదలు ముంచెత్తి చెన్నై నగరం నీటమునిగిందని, అక్కడి ప్రజలలో తెలుగువారు కూడా ఉన్నారని, ప్రజలను ఆదుకునేందుకు మనమంతా సహకారం అందించాల్సిన అవసరం ఉందని వారు అన్నారు.