దళారీకి జీ హుజూర్
సాక్షి, సిటీబ్యూరో/న్యూస్‌లైన్ నెట్‌వర్క్: రైతుబజార్లలో దళారుల దందా కొనసాగుతోంది. నిట్టనిలువునా దోపిడీ జరుగుతోంది. రైతులకు, వినియోగదారులకు అనుసంధాన భూమిక పోషించాల్సిన రైతుబజార్లు అక్రమాలకు అడ్డాలయ్యాయి. అధికారుల అలక్ష్యం, దళారుల దందాగిరి వెరసి దళారీ బజార్లుగా మారాయి. గ్రేటర్‌లోని వీటి పనితీరుపై ‘సాక్షి’ జరిపిన పరిశీలన లో లోపాల గుట్టు రట్టయింది. నగరంలోని అన్ని రైతుబ జార్లలో దళారులే రాజ్యమేలుతున్నారు.
ఇక్కడ వారి మాటే వేదం. ఇదేమని ప్రశ్నిస్తే.. కొనుగోలుదారులపై చిందులు. రైతుబ జార్ సిబ్బంది అండతో రెచ్చిపోతున్నారు. రైతుబజార్‌లోని స్టాళ్లను 75% రైతులకు, 25% స్వయం సహాయ సంఘాలు, ప్రభుత్వ ఏజెన్సీలు, వికలాంగులకు కేటాయించాలి. అయితే, ఏ రైతుబజార్‌లో చూసినా 75% స్టాళ్లు దళారులకు, 25% స్టాళ్లు రైతులకు కేటాయిస్తుండటం విశేషం. దీంతో ప్రత్యక్ష అమ్మకాలు సాగించాల్సిన రైతుబజార్లు బ్రోకరేజీ మార్కెట్లుగా మారాయి.
ఎర్రగడ్డ మోడల్ రైతుబజార్‌లో మొత్తం 259 స్టాళ్లకు గాను, 150 స్టాళ్లలో దళారులే పాగా వేశారు. ఇక్కడ కిరాణా, బియ్యం, పండ్ల దుకాణాలతో పాటు అల్లం, వెల్లుల్లి, నిమ్మ, ఉల్లి, ఆలు, ములక్కాయ, క్యారెట్, చామగడ్డ, క్యాప్సికమ్ వంటివన్నీ వారి చేతుల్లోనే ఉన్నాయి. కూకట్‌పల్లి, మెహిదీపట్నం, సరూర్‌నగర్, వనస్థలిపురం, ఫలక్‌నుమా రైతుబజార్లలో కూడా బయటి వ్యక్తలే తిష్ట వేశారు.
కటిక నేలపై కర్షకులు
దళారులు దుకాణాల ప్లాట్‌ఫారాలు చేజిక్కించుకొని దర్జాగా వ్యాపారాలు చేస్తుండగా, నిజమైన రైతులు మాత్రం
బిక్కుబిక్కుమంటూ గేటు వద్ద కటిక నేలపై కూర్చొని కూరగాయలు అమ్ముకొంటున్నారు. బినామీ రైతులు హోల్‌సేల్ మార్కెట్లో సరుకు కొనుగోలు చేసి, రైతుబజార్‌లో అధిక ధరకు విక్రయిస్తున్నారు. రాబడి బాగుండటంతో రోజువారీ కూలీపై యువకులను పెట్టిమరీ వ్యాపారాలు చేస్తుండటం గమనార్హం. రైతుబజార్ సిబ్బందికి నెలవారీగా మామూళ్లు ఇస్తూ దర్జాగా దందా చేస్తున్నారు.
ఇష్టారీతిన రేట్లు
వాస్తవానికి ఎస్టేట్ ఆఫీసర్ నిర్ణయించిన ధర కంటే ఒక్క పైసా కూడా ఎక్కువ తీసుకోవద్దు. అయితే బినామీలు అధిక రేట్లకు విక్రయిస్తూ నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. బోర్డుపై ధరను చూసి ఎవరైనా ప్రశ్నిస్తే.. ‘ఇష్టమైతే కొనండి.. లేదంటే వెళ్లండి’ అంటూ దురుసుగా సమాధాన మిస్తున్నారు. కొన్ని రైతుబజార్లలో ఏకంగా సూపర్‌వైజర్లపైనే ఒత్తిడి తెచ్చి బోర్డుపై అధిక ధరలు రాయిస్తుండటం విశేషం. నిజానికి హోల్‌సేల్ ధరకు ఒక రూపాయి అదనంగా రేటు నిర్ణయించి ఇక్కడ విక్రయించాలి. కానీ, అందుకు విరుద్ధంగా జరుగుతోందిక్కడ.
స్టాల్స్ అద్దెకు
మెహిదీపట్నం రైతుబజారులో ఒక షెడ్డులో నాలుగు దుకాణాలు ఉండాల్సి ఉండగా, ఆరుగురు షాపులు నిర్వహిస్తున్నారు. కొందరు వ్యా పారులు తమ దుకాణాలను ఇతరులకు అద్దెకిచ్చి ఆదాయాన్ని గడిస్తున్నారు. ఇక్కడ 70 స్టాళ్లు ఉంటే 150కి పైగా వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. వీరిలో సగానికి పైగా బినామీలే. ఎర్రగడ్డ, మెహిదీపట్నం రైతుబజార్లలో బియ్యం వ్యాపారులకు ఎదురే లేకుండా పోయింది. వీరిపై చర్యలకు ఉపక్రమిస్తే కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు నేరుగా రంగంలోకి దిగుతుండడం విశేషం.
ఇవి ఏ మూలకూ..
గ్రేటర్ జనాభా సుమారు కోటి.. ఉన్న రైతుబజార్లు తొమ్మిదే. కూకట్‌పల్లి, ఎర్రగడ్డ, మెహిదీపట్నం, సరూర్‌నగర్, వనస్థలిపురం, అల్వాల్, ఆర్‌కేపురం, ఫలక్‌నుమా, మీర్‌పేటల్లో ఉన్న ఈ బజార్లు ఏమాత్రం ప్రజల అవసరాలను తీర్చగలవు. కుత్బుల్లాపూర్ రైతుబజార్ ఎప్పుడో మూతపడింది. నిజానికి అత్తాపూర్, కొండాపూర్, మియాపూర్, సైనిక్‌పురి, బంజారాహిల్స్, తార్నాక , మేడిపల్లి (ఉప్పల్)లలో రైతుబజార్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపినా.. ఇంతవరకూ అతీగతీ లేదు.
అడ్రస్ లేని ఔట్‌లెట్లు
కూరగాయల ఔట్‌లెట్ల ఏర్పాటు అటకెక్కింది. తార్నాక, కాచిగూడ, ఐడీపీఎల్ కాలనీ, మలేషియా టౌన్‌షిప్, గచ్చిబౌలి-టెలికం కాలనీ, ఓయూ కాలనీ, కవాడీగూడ, వెస్టు మారె డ్‌పల్లి, ఈసీఐఎల్, మౌలాలి తదితర ప్రాంతాల్లో షెల్టర్లు ఇచ్చేందుకు స్థానికులు ముందుకొచ్చారు. తార్నాకలో రైల్వే సిబ్బంది షెడ్ కూడా నిర్మించి ఇచ్చారు. కానీ, మార్కెటింగ్ శాఖ వెనుకడుగు వేసింది. ఫిల్మ్‌నగర్‌లోని 24 బస్తీల కోసం ఔట్‌లెట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినా, తగిన స్థలం దొరకలేదన్న సాకుతో దాన్ని పక్కకు పెట్టేశారు. నిజానికి అక్కడ ప్రభుత్వ భూమి చాలా ఉంది. సమస్య స్థలం లేక కాదు.. శాఖల మధ్య సమన్వయం లేకే.
సిబ్బంది పట్టించుకోరు
బోర్డుపై ఉన్న ధరల ప్రకారం విక్రయించడం లేదు. ఇదేమని అడిగితే గొడవ పెడుతున్నారు. రైతుబజారు సిబ్బందికి ఫిర్యాదు చేస్తే అసలు వాళ్లు పట్టించుకోవట్లేదు.
- నిర్మల, వనస్థలిపురం
వ్యాపారులదే రాజ్యం
రైతుబజార్లలో వ్యాపారులదే హవా. వ్యాపారులు నిర్ణయించిందే ధర. తూకాల్లోనూ మోసం చేస్తున్నారు. ధరలపై ప్రశ్నిస్తే దురుసుగా సమాధానమిస్తున్నారు. రైతుబజారు సిబ్బంది మాట వినే పరిస్థితి లేదు.
- శ్రీనివాస్, సరూర్‌నగర్
సరఫరా పెంచాలి
మార్కెటింగ్ శాఖ సరఫరా చేస్తున్న సబ్సిడీ ఉల్లి ఏ మూల కూ సరిపోవట్లేదు. సరఫరా మరింత పెంచాలి. అధికారుల పర్యవేక్షణ లేక సిబ్బంది ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు.
- సంతోష్, ఉప్పుగూడ
ఉల్లిపై నిఘా ఏది?
ఉల్లి ధర చూస్తే కళ్లు తిరుగుతున్నాయి. సబ్సిడీ ఉల్లి వినియోగదారులకు దక్కట్లేదు. ఆ ఉల్లి ఏమవుతోందన్నది అర్థం కావట్లేదు. నిఘా లేకపోవడం వల్ల సరుకు దారి మళ్లే అవకాశం ఉంది.
- ఎంఏ ఖాదర్ సిద్ధిఖీ, షంషీర్‌గంజ్
బినామీలను ఏరేస్తాం
రైతుబజార్లలో బినామీలను ఏరిపారేస్తాం. వీరిని గుర్తించేందుకు డీడీ స్థాయి అధికారితో తనిఖీలు నిర్వహించనున్నాం. మూడేళ్లు దాటిన స్వయం సహాయక సంఘాలు, ప్రభుత్వ ఏజెన్సీలను బయటకు పంపిస్తాం. మార్కెటింగ్ శాఖ సరఫరా చేస్తున్న ఉల్లి పక్కదారి పట్టకుండా నిఘా ఏర్పాటు చేశాం. సీసీ కెమెరాల ద్వారా విక్రయాల తీరును గమనిస్తున్నాం. సంచార రైతుబజార్ల స్థానే కాలనీలకు, అపార్టుమెంట్లకు కూరగాయలు సరఫరా చేసేందుకు ‘మన కూరగాయలు’ స్కీంను త్వరలో ప్రారంభించబోతున్నాం. ఉప్పల్ వద్ద మేడిపల్లిలో కొత్త రైతుబజార్ అందుబాటులోకి రానుంది.
- ఎంకే సింగ్, సీఈఓ