
వరల్డ్ క్లాస్ ఆశ..
సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధికి వినతి
మౌలాలీ, వట్టినాగులపల్లిల్లో భారీ టెర్మినళ్లు
మల్కాజిగిరి, సనత్‌నగర్ స్టేషన్ ల విస్తరణ
నగర ఎంపీల ప్రతిపాదనలు
సిటీబ్యూరో: ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల నడుమ ప్రధాన కేంద్ర బిందువుగా ఉన్న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌పై భారాన్ని తగ్గించేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని నగర ఎంపీలు ముక్తక ంఠంతో కోరారు. రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు, ప్రయాణికుల సదుపాయాల వంటి అంశాలపై చర్చించేందుకు బుధవారం రైల్ నిలయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ పార్లమెంటు సభ్యుల సమావేశంలో నగర ఎంపీలు రైల్వే శాఖకు వివిధ ప్రతిపాదనలు అందజేశారు. సికింద్రాబాద్‌పై భారాన్ని తగ్గించేందుకు మౌలాలీ, వ ట్టినాగులపల్లి స్టేషన్లను భారీ టెర్మినళ్లుగా అభివృద్ధి చేయడంతో పాటు, మల్కాజిగిరి, సనత్‌నగర్ స్టేషన్లను విస్తరించాలనే ప్రతిపాదనలు వచ్చాయి. పెరుగుతున్న నగర జనాభా, విస్తరిస్తున్న కాలనీలు, ప్రాంతాలకు అనుగుణంగా రైల్వే సదుపాయాలను పెంచాలని ఎంపీలు కోరారు. వివిధ అంశాలపై ఎంపీల నుంచి తమకు అందిన ప్రతిపాదనలను పరిశీలించి వచ్చే బడ్జెట్‌లో సాధ్యమైంత వరకు అమలయ్యేందుకు ప్రయత్నించనున్నట్లు జనరల్ మేనేజర్ పి.కె.శ్రీవాస్తవ వెల్లడించారు.
వరల్డ్ క్లాస్‌గా అభివృద్ధి
నిత్యం 80కి పైగా ఎక్స్‌ప్రెస్‌లు, మరో వంద ప్యాసింజర్లు, వంద ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోకలతో రద్దీగా ఉండే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో తగినన్ని ప్లాట్‌ఫామ్‌లు లేవు. స్టేషన్‌కు రావాల్సిన రైళ్లు నగర శివార్లలో గంటల తరబడి నిలిచిపోతున్నాయి. రోజూ 2.5 లక్షల మంది ప్రయాణికులు సికింద్రాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులో లేకపోవడంతో రద్దీ వేళల్లో మౌలాలీ, ఘట్కేసర్, చర్లపల్లి, లింగంపల్లి తదితర ప్రాంతాల్లో పదుల సంఖ్యలో రైళ్లు నిలిచిపోవాల్సి వస్తోంది. ఉదయం 5 నుంచి 9 గంటల వరకు... తిరిగి సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు రద్దీ కారణంగా అనేక రైళ్లు సకాలంలో స్టేషన్‌కు చేరుకోలేకపోతున్నాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు ఏటా కొత్త రైళ్లు అందుబాటులోకి వస్తూనే ఉన్నాయి. దీనికి అనుగుణంగా స్టేషన్ విస్తరణకు నోచుకోవడం లేదు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని 2005లోనే వరల్డ్ క్లాస్ ప్రమాణాలతో స్టేషన్‌ను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. దీని వల్ల స్టేషన్‌లోకి వచ్చే రైళ్లకు... ఇక్కడి నుంచి వెళ్లే రైళ్లకు వేర్వేరు ప్లాట్‌ఫామ్‌లు ఉంటాయి. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది. కానీ ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. బుధవారం పార్లమెంట్ సభ్యుల సమావేశంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ మరోసారి ఇదే అంశాన్ని లేవనెత్తారు. అంతర్జాతీయ ప్రమాణాలతో సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధితో పాటు... రెండు ప్రధాన మార్గాల్లో రైళ్ల ఒత్తిడిని తగ్గించేందుకు మౌలాలీ, వట్టినాగులపల్లిలో రెండు భారీ టెర్మినళ్లను నిర్మించాలని కోరారు. దీని వల్ల ముంబయి మీదుగా వచ్చే వాటికి నాగులపల్లిలో... కాజీపేట్ నుంచి వచ్చే వాటికి మౌలాలీలో హాల్టింగ్ లభిస్తుంది. సనత్‌నగర్, మల్కాజిగిరి స్టేషన్లను అభివృద్ధి చేయడం వల్ల నాంపల్లి, కాచిగూడ స్టేషన్లకు ప్రత్యామ్నాయం లభిస్తుందన్నారు.
ఎఎంటీఎస్‌ను విస్తరించాలని..
ఎంఎంటీఎస్ రెండో దశను తెల్లాపూర్ నుంచి పటాన్‌చెరు వరకు, అక్కడి నుంచి సంగారెడ్డి వరకు విస్తరించాలని ఎంపీలు కోరారు. ఈ పనులను వేగంగా పూర్తి చేసి ప్రయాణికులకు సదుపాయం కల్పించాలని సూచించారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డితో పాటు, తెలంగాణలోని పలువురు ఎంపీలు సమావేశానికి హాజరయ్యారు.
సంయుక్త కార్యాచరణ
మౌలాలీ, వట్టినాగులపల్లిల్లో తలపెట్టిన భారీ టెర్మినళ్లకు వచ్చే బడ్జెట్‌లో నిధులను కేటాయించేలా చూస్తా. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి... దశల వారీగా రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు చేపట్టాలని భావిస్తున్నాం. ఈ నెలాఖ రున ఢిల్లీలో రైల్వేమంత్రితో జరిగే సమావేశంలో ఈ అంశాన్ని ప్రతిపాదిస్తాం. నగరంలో కొత్తగా రైల్వే డిగ్రీ కళాశాల, రైల్వే మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం ఉన్న రైల్వే కేంద్రీయ ఆస్పత్రికి సూపర్‌స్పెషాలిటీ హోదా కల్పించాలి.
- బండారు దత్తాత్రేయ
పరిహారం చెల్లించాకే లైన్లు
ఎంఎంటీఎస్ రెండో దశ విస్తరణతో మల్కాజిగిరి ప్రాంతంలో సుమారు 10 వేల మంది నిరాశ్రయులయ్యే అవకాశం ఉంది. గత 30 ఏళ్లుగా వారు అక్కడే ఉంటున్నారు. వారికి పునరావాసం కల్పించే వరకు ఇప్పుడు ఉన్న చోటు నుంచి తొలగించవ ద్దు. మల్కాజిగిరి రైల్వేస్టేషన్ అభివృద్ధికి చాలా స్థలం అందుబాటులో ఉంది. దీనివల్ల కాచిగూడపైఒత్తిడి తగ్గుతుంది. ఈ ప్రాంత ప్రయాణికులకు ఎంతో ఊరట లభిస్తుంది. సనత్‌నగర్ స్టేషన్‌ను విస్తరించాలి. మేడ్చెల్ రైల్వేస్టేషన్‌ను గూడ్స్ జంక్షన్‌గా అభివృద్ధి చేయాలి. దీని వల్ల సరుకు రవాణా సులభమవుతుంది. అవుటర్ రింగు రోడ్డు మీదుగా వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేడ్చెల్ గూడ్స్ జంక్షన్‌కు చేరుకోగలుగుతాయి.
- మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎంపీ