జనం సొమ్మేగా.. జల్సా చేసొద్దాం
పెద్దసార్ల విదేశీ యాత్రల ఖర్చు రూ.100 కోట్లు
♦ ఏకంగా 125 జీవోలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
♦ సంక్షేమ పథకాలకు నిధుల్లేవంటూ సర్కారు బీద అరుపులు
♦ విదేశీ పర్యటనలకు మాత్రం విచ్చలవిడిగా ఖర్చు
సాక్షి, హైదరాబాద్: ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచడానికి నిధుల్లేవు... ఉద్యోగులకు డీఏ ఇవ్వడానికి డబ్బుల్లేవు... నిరుద్యోగులకు భృతి ఇచ్చేందుకు సొమ్ముల్లేవు... రైతులు, డ్వాక్రా రుణాల మాఫీకి కాసుల్లేవు... ఇవి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చెబుతున్న కబుర్లు. మరి నిధులు లేనప్పుడు చేయాల్సిందేమిటి? వృథా వ్యయాలకు అడ్డుకట్ట వేయాలి. పొదుపు పాటిస్తూ హంగూ ఆర్భాటాలకు దూరంగా ఉండాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన అధికార యంత్రాంగం మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. రూ.కోట్లు ఖర్చు చేస్తూ విదేశాల్లో విహరిస్తోంది. ఈ విదేశీ యాత్రల వల్ల రాష్ట్రానికి ఏమైనా మేలు జరిగిందా అంటే అదీలేదు. ప్రభుత్వ పెద్దల యాత్రల వల్ల ప్రజల సొమ్ము హారతి కర్పూరంలా హరించుకుపోతోంది. ఆయన యంత్రాంగం విదేశీ పర్యటనలకు ఇప్పటిదాకా అక్షరాలా రూ.వంద కోట్లు ఖర్చయ్యాయి. ఇదంతా ముమ్మాటికీ ప్రజల డబ్బే.
సీఎం సింగపూర్ యాత్రలు
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే ప్రథమ ప్రాధాన్యంగా విదేశీ పర్యటనలనే ఎంచుకున్నారు. ఇప్పటివరకూ పెద్ద సార్లందరూ 125 సార్లు విదేశాల్లో తిరిగి వచ్చారు. ముఖ్యమంత్రి, మంత్రులు, సలహాదారులు, ఐఏఎస్, ఐపీఎస్‌లు, సీఆర్‌డీఏ అధికారుల విదేశీ పర్యటనల కోసం ప్రభుత్వం ఏకంగా 125 జీవోలను జారీ చే సింది. సీఎంగా బాధ్యతలు చేపట్టగానే రాష్ట్ర రాజధాని నిర్మాణంపై చర్చించడం కోసమంటూ చంద్రబాబు ప్రత్యేక విమానంలో సింగపూర్ వెళ్లారు. మళ్లీ చర్చల పేరిట ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారాయణ బృందం సింగపూర్ వెళ్లింది.
అనంతరం చంద్రబాబు బృందం జపాన్, చైనా, లండన్ పర్యటనలకు వెళ్లి వచ్చింది. ఇక రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి సీఈఓగా ఉన్న జె.కృష్ణకిషోర్ అమెరికా, చైనా, బ్రిటన్, దుబాయ్, సింగపూర్ దేశాల్లో పర్యటించారు. పురపాలక శాఖ మంత్రి నారాయణ పలుమార్లు సింగపూర్, చైనా, ఆస్ట్రియా తదితర దేశాల్లో పర్యటించారు. ఆయన ఐదారు రోజులకోసారి సింగపూర్‌కు వెళ్లొచ్చిన సందర్భాలున్నాయి. పరిశ్రమల శాఖ డెరైక్టర్ కార్తికేయ మిశ్రా, పరిశ్రమల శాఖ కార్యదర్శి రావత్, పర్యాటక శాఖ కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పీవీ రమేశ్ పలు దేశాలను చుట్టివచ్చారు. ప్రతీ నెలా దాదాపు నలుగురు అధికారులు విదేశాల్లోనే ఉంటున్నారు. మంత్రులు యనమల రామకృష్ణుడు, గంటా శ్రీనివాసరావు, శిద్ధా రాఘవరావు, అచ్చెన్నాయుడు, మృణాళిని, కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావుతోపాటు పలువురు ఐఏఎస్ అధికారులు విదేశాలకు వెళ్లివచ్చారు.
నిబంధనలకు తూట్లు
ప్రభుత్వంలోని ఏ అధికారైనా విదేశీ పర్యటనకు వెళ్లాలంటే అందుకు సహేతుకమైన కారణాలుండాలి. రాష్ట్రానికి ప్రయోజనం కలగాలి. అలాంటిదేమీ లేకుండా అధికారులు ఇష్టారాజ్యంగా విదేశాలకు వెళ్లివస్తున్నారు. నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నా అడిగే నాథుడే లేకపోవడం గమనార్హం. అనవసర పర్యటనల వల్ల రాష్ట్రానికి ప్రయోజనం లేకపోగా ఖజానా గుల్ల అవుతోందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
సీఆర్‌డీఏకు మినహాయింపులు
విదేశీ పర్యటనల విషయంలో కేపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ(సీఆర్‌డీఏ)కు నిబంధనల నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చేసింది. అంటే సీఆర్‌డీఏ అధికారులు విదేశాలకు వెళ్లాలంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా సీఆర్‌డీఏ అధికారుల విదేశీ పర్యటనలకుగాను ఏడాదికి రూ.4 కోట్ల చొప్పున ముందుగానే చెల్లించేందుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు.