లేహ్‌లో మైనస్ 17 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత.. సహారా ఎడారిలో కురుస్తున్న మంచు.. 40 ఏళ్లలో ఇది మూడోసారి.. అమెరికాలో మంచు తుపానులు.. ఇవన్నీ దేనికి సంకేతం..
కొంపదీసి భూమి మొత్తం మంచు ముద్దలా మారిపోనుందా..! అవును నిజమే..! అదెంటీ ఒకపక్క ఏటికేటికీ వేసవి తాపం పెరిగిపోతుంటే.. మంచు ముద్ద ఎలా అవుతుందని ఆశ్చర్యపోతున్నారా..? కొందరు శాస్త్రవేత్తలు దీనికీ ఓ లెక్కుందని ఆధారాలతో సహా చెబుతున్నారు.. భూ వాతావరణాన్ని ప్రభావితం చేసే శక్తి మానవులకు లేదని, సూర్యుడి వంటి భారీ నక్షత్రం వల్లే ఇది సాధ్యమన్నది వారి వాదన. సూర్యుడిపై ఎప్పుడూ మార్పులు జరుగుతుంటాయి. అది కూడా ఓ క్రమ పద్ధతిలో.. వీటి ప్రభావం మన వాతావరణంపై కూడా పడుతుంటుంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని శాస్త్రవేత్తలు ఓ అంచనాకు వచ్చారు. ఇంకొన్నేళ్లలో భూమి మంచుముద్దగా మారుతుందని ప్రొఫెసర్ వాలెంటీనా ఝర్‌కోవా వంటి శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ఉత్పాతం తప్పదా..?
సూర్యుడిపై జరుగుతున్న కార్యకలాపాలను శాస్త్రవేత్తలు కొన్ని వందల సంవత్సరాలుగా పరిశీలిస్తున్నారు. అక్కడి మార్పులకు, అదే సమయంలో భూమ్మీద మార్పులకు మధ్య సంబంధాన్ని వెతికే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఓ ఎత్తు.. ఝర్‌కోవా వేస్తున్న లెక్కలు ఇంకో ఎత్తు. ఎందుకంటే అత్యాధునిక పద్ధతుల్లో ఝర్‌కోవా వేసిన లెక్కలకు, వాస్తవ పరిస్థితులకు దగ్గరి సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. సూర్యుడిపై జరుగుతున్న కార్యకలాపాలు క్రమేపీ బలహీన పడుతున్నాయని ఝర్‌కోవా చెబుతున్నారు. 1645లో ఇలాంటి పరిస్థితి ఏర్పడ్డప్పుడు లండన్‌లోని థేమ్స్ నది గడ్డకట్టుకుపోయిందని పేర్కొంటున్నారు. 2030 నాటికి సూర్యుడిపై కార్యకలాపాలు దాదాపు 60 శాతం వరకు తగ్గుతాయని, ఆ తర్వాత భూ ఉష్ణోగ్రతలు కూడా కనిష్టస్థాయికి చేరుకుంటాయని వివరిస్తున్నారు.
హెచ్చరించిన హైదరాబాద్ శాస్త్రవేత్త..
భూమి మంచుముద్దగా మారబోతోందని ఎన్‌జీఆర్‌ఐ విశ్రాంత శాస్త్రవేత్త జనార్దన్ నేగీ ఎనిమిదేళ్ల కిందే హెచ్చరించారు. ‘1420 వరకూ గ్రీన్‌ల్యాండ్ పచ్చదనంతో ఉండేది. ఆ తర్వాత 1,600 నాటికి మంచుముద్దగా మారిపోయింది. మినీ మంచుయుగం వచ్చింది అప్పుడే. ఈ కాలంలోనే బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్, పోర్చుగల్ వంటి యూరోపియన్ దేశాలు ఇతర దేశాలపై దండయాత్రలు చేశాయి. వలస రాజ్యాలను ఏర్పాటు చేసుకున్నాయి’అని అప్పట్లోనే ‘సాక్షి’తో చెప్పారు. లక్ష సంవత్సరాలకు ఓసారి, పది వేల ఏళ్ల విరామంతో భూమి మంచులో కూరుకుపోతుందని, మధ్యలో అప్పుడప్పుడూ కొంతకాలం పాటు మినీ మంచుయుగపు పరిస్థితులు ఏర్పడతాయన్నది నేగీ విశ్లేషణ.
విపత్తుల కాలం..
సూర్యుడిపై కార్యకలాపాలు మందగించినప్పుడల్లా భూమ్మీద భూకంపాలు, అగ్నిపర్వతాల పేలుళ్లు వంటి విపత్తులు చోటు చేసుకున్నట్లు చరిత్ర చెబుతోంది. 1650–2009 మధ్య కాలం లో జరిగిన అగ్నిపర్వతపు పేలుళ్ల అవశేషాలను విశ్లేషించడం ద్వారా ఫ్లోరిడాలోని ది స్పేస్ సైన్స్ రీసెర్చ్ సెంటర్ ఈ అంచనాకొచ్చింది. 1700–2009 మధ్యకాలంలో సన్‌స్పాట్స్ అతితక్కువగా ఉన్న సమయంలోనే భారీ భూకంపాలు వచ్చినట్లు వీరి అధ్యయనం చెబుతోంది. జపాన్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఫర్ కాస్మిక్ రే రీసెర్చ్ శాస్త్రవేత్త టోషికాజూ ఇబిసుజాకీ కూడా అగ్నిపర్వత పేలుళ్లకు, సన్‌స్పాట్స్‌కు మధ్య సంబంధం ఉందని చెబుతున్నారు.
శక్తిమంతమైన భూకంపాలు..
సన్‌స్పాట్స్ తక్కువగా ఉన్న సమయంలో భూమి ఉపరితలంపై సూర్యుడికి ఉండే అయస్కాంత ఆకర్షణ శక్తి కొంచెం తగ్గుతుందని, ఫలితంగా భూగర్భంలోని టెక్టోనిక్ ప్లేట్ల కదలికలు దాదాపు నిలిచిపోతాయని వెదర్ యాక్షన్ సంస్థకు చెందిన పైర్స్ కార్బిన్ పేర్కొన్నారు. టెక్టోనిక్ ప్లేట్ల కదలికలు ఆగిపోవడం వల్ల వాటి మధ్య ఒత్తిడి పెరిగిపోతుందని.. తగిన పరిస్థితులు ఏర్పడినప్పుడు ఈ శక్తి మొత్తం భూకంపాల రూపంలో విడుదల అవుతుందన్నారు. సన్‌స్పాట్స్ తక్కువ ఉన్న సమయంలో భూకంపాలు తక్కువగా వచ్చినా.. ఎప్పుడో ఒకప్పుడు వచ్చే భూకంపాలు మాత్రం శక్తిమంతంగా ఉంటాయని కార్బిన్ హెచ్చరిస్తున్నారు.
విస్తృత పరిశోధనలు..
సూర్యుడిపై సన్‌స్పాట్స్‌కు, భూ వాతావరణానికి మధ్య సంబంధాన్ని తెలుసుకునేందుకు అనేక పరిశోధనలు కొనసాగుతున్నాయి. సన్‌స్పాట్స్‌ను, ఇతర కార్యకలాపాలను నిత్యం గుర్తించేందుకు నాసా రెండు ఉపగ్రహాలను ప్రయోగించింది. సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ సంస్థ నిత్యం సూర్యుడిపై ఓ కన్నేసి ఉంచుతుంది. అతిపెద్ద స్థాయిలో పేలుళ్లు జరిగే అవకాశమున్నప్పుడు ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తుంటుంది.
సన్‌స్పాట్ శాస్త్రం..
సూర్యుడిలో జరిగే కార్యకలాపాలు 11 ఏళ్లకోసారి మారుతుంటాయి. సూర్యుడిపై కూడా కొన్నిచోట్ల ఉష్ణోగ్రతలు తగ్గుతుంటాయి. అయస్కాంత క్షేత్ర ప్రభావం వల్ల ఇలా జరుగుతుందని అంచనా. సాపేక్షంగా తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతం నలుపు రంగులో కనిపిస్తుంటుంది. దీన్నే సన్‌స్పాట్ అంటారు. ఈ మచ్చల సంఖ్య ఆధారంగా ఏడాదిలో సూర్యుడు ఎంత చురుగ్గా ఉన్నాడన్నది నిర్ణయిస్తారు. సూర్యుడిపై కొన్ని పదార్థాలు పేలడం వల్ల ఎగసిపడే మంటలూ సన్‌స్పాట్స్‌ను ప్రభావితం చేస్తాయి. 1775 నుంచి జరుగుతున్న పరిశీలనల ఆధారంగా దాదాపు 11 ఏళ్లకోసారి ఈ సన్‌స్పాట్స్ పెరుగుతూ.. తగ్గుతూ ఉంటాయని తెలిసింది. దీన్నే సోలార్‌సైకిల్ అంటారు. ప్రస్తుతం 25వ సోలార్ సైకిల్ నడుస్తోంది. 2020 నాటికి సన్‌స్పాట్స్ అతితక్కువ స్థాయికి చేరడంతో ఈ సోలార్ సైకిల్ ముగుస్తుంది. 2016లో జరిపిన పరిశీలనల్లో దాదాపు 21 రోజులపాటు సూర్యుడిపై ఎలాంటి సన్‌స్పాట్స్ ఏర్పడలేదని గుర్తించారు.
మాండర్ మినిమమ్..
సూర్యుడిపై సన్‌స్పాట్స్ అతి తక్కువగా కనిపించే కాలాన్ని మాండర్ మినిమమ్ అని పిలుస్తారు. 1645 నుంచి 1715 మధ్యకాలంలో సన్‌స్పాట్స్ కనిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు భూగోళం మొత్తమ్మీద మంచుయుగపు పరిస్థితులు ఏర్పడ్డాయి. లండన్‌లోని థేమ్స్ నది పూర్తిగా గడ్డకట్టుకుపోయిందని రికార్డులు చెబుతున్నాయి. నాసా అంచనా ప్రకారం.. 1645 కంటే ముందు కూడా చాలాసార్లు భూమి మంచు కప్పి ఉంది.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment