బాబూ.. ధైర్యముంటే ప్రభుత్వాన్ని రద్దుచెయ్ | several TDP MLAs in touch with ysrcp, says ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

బాబూ.. ధైర్యముంటే ప్రభుత్వాన్ని రద్దుచెయ్

Published Thu, Feb 18 2016 1:55 AM | Last Updated on Tue, Aug 21 2018 11:41 AM

గవర్నర్‌ను కలసిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ జగన్ - Sakshi

గవర్నర్‌ను కలసిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ జగన్

ఎమ్మెల్యేలను కొనటం కాదు...
ప్రజల్లోకి వెళ్లి ఎవరు గెలుస్తారో తేల్చుకుందాం
టీడీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లోనే ఉన్నారు.. తగినంతమంది రాగానే మీడియాకు చెబుతాం..
ఆ తర్వాత గంటలోనే ప్రభుత్వం కూలుతుంది..
టీడీపీ పాలనపై గవర్నర్‌కు జగన్ ఫిర్యాదు


సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలను కొనుగోలు చేయండంటూ మంత్రులను పురమాయించే బదులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దమ్ముంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు సిద్ధం కావాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సవాలు విసిరారు. ‘చంద్రబాబు మంత్రివర్గ సమావేశాలు పెట్టి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఎందుకు కొనడం లేదు...కొని నా దగ్గరకు ఇంకా ఎందుకు తీసుకు రావడం లేదు... తెలంగాణలో కేటీఆర్‌ను, హరీశ్‌రావును చూసి బుద్ధి తెచ్చుకోండి అని నిస్సిగ్గుగా చెబుతున్నారు. అంతెందుకు ప్రభుత్వాన్ని రద్దు చేయండి, ప్రజల్లోకి పోదాం. నేను చాలెంజ్ చేస్తున్నా...నువ్వు గెలిచే సమస్యే లేదు, నువ్వు గెలుస్తావో... మేం గెలుస్తామో... ప్రజలే తీర్పు ఇస్తారు’ అని జగన్ అన్నారు. తుని సంఘటనలు, రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలపై బుధవారం రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను కలిసి వినతిపత్రాలను సమర్పించిన అనంతరం జగన్ రాజ్‌భవన్ వద్ద మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్లిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయంటూ మీడియా ప్రతినిధులు ప్రస్తావించినపుడు ఆయన పై విధంగా స్పందించారు.  ‘చంద్రబాబును గట్టిగా అడగండమ్మా...టీడీపీలో  నుంచి వైసీపీలోకి ఎంత మంది ఎమ్మెల్యేలు రాబోతున్నారో...’ అని జగన్ అన్నారు. ఇంతకీ ఎవరెవరు వస్తున్నారని మళ్లీ అడిగినపుడు ‘ నేను మాటలు చెప్పడం ఎందుకు మీరే చూస్తారు కదా...’ అన్నారు. వల్లభనేని వంశీ మీ పార్టీలో చేరుతున్నారంటున్నారు? నిజమేనా అని ప్రశ్నించినపుడు అవన్నీ ఇపుడు చెప్పడం సరికాదు అని జగన్ వ్యాఖ్యానించారు. ‘చంద్రబాబుకు ఓ చెడ్డ అలవాటుంది. ఆయనకు మీడియాలో కొద్దో గొప్పో మద్దతు ఉంది. ఆ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేయించడం ఆయనకు బాగా అలవాటైన పనే...వైసీపీ నుంచి అంత మంది, ఇంత మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోతారని ఆ మీడియాలో రాస్తారు. టీవీల్లో చూపిస్తారు. అలా వాళ్లు రాయడం మా ఎమ్మెల్యేలు విలేకరుల సమావేశాలు పెట్టి చంద్రబాబును ఎడాపెడా తిట్టడం చేస్తూ ఉంటారు’ అని జగన్ అన్నారు. ఇంకా అనేక అంశాలపై ఆయన మాటల్లోనే...

 మునిగే పడవలో బుద్ధి ఉన్న వారెవరైనా ఎక్కుతారా?

 ‘‘అసలు అది మునిగే పడవ. అందులో ఎవరైనా ఎక్కుతారా? ప్రజల్లోకి వెళ్లి విచారిస్తే చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారనేది స్పష్టం అవుతుంది. ఎన్నికల వేళ ఏం చెప్పావు, ఇపుడేం చేస్తున్నావు అని ప్రజలు కోపంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బుద్ధి ఉన్నవాడెవ్వడూ చంద్రబాబు పార్టీలోకి పోడు. ఆ విషయం తెలిసినా  చంద్రబాబు మాత్రం ప్రచారం ఆపడు. మా ఎమ్మెల్యేలు విలేకరుల సమావేశాల్లో తిట్టే తిట్లను దులిపేసుకుంటాడు. నాలుగు రోజులు ఆగి ఐదో రోజు మళ్లీ అలాంటి రాతలే రాయిస్తూ ఉంటాడు. ప్రజలకు కూడా వాటిపై విసుగెత్తింది. చంద్రబాబు వద్ద నల్లధనం, అవినీతి సొమ్ము ఎక్కువగా ఉంది కాబట్టి ఆయన ఏం చేయడానికైనా సిద్ధపడతాడు. కానీ దేవుడున్నాడు మొట్టికాయలు వేస్తాడు. ప్రజలు మొట్టికాయలు వేస్తారు.

 స్పీకర్ మీద అవిశ్వాసం కచ్చితంగా పెడతాం

 ఏపీ శాసనసభ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం కచ్చితంగా పెడతాం. ఆ విషయానికి కట్టుబడి ఉన్నాం. ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టేంత బలం మా వద్ద లేదని, మా బలం 67 మందేనని అందరికీ తెలుసు. మాతో టీడీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నా... ప్రభుత్వాన్ని పడగొట్టడానికి అవసరమైన  21 మంది ఉన్నారని నేను ఎప్పుడూ చెప్పలేదు. మాకు ఆ సంఖ్య రాగానే కచ్చితంగా మీడియాను పిలిచి చెబుతా. అలా చెప్పిన గంటకే ప్రభుత్వం పడిపోతుంది.  

 పాలమూరు - రంగారెడ్డి పథకాన్ని ఆపండి

 పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని తక్షణం ఆపాలి. మేం గవర్నర్‌కు విన్నవించిన నాలుగు ప్రధానాంశాల్లో ఇదొకటి. ఈ ప్రాజెక్టు నిర్మాణం కొనసాగితే రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు నీళ్లందని పరిస్థితి ఏర్పడుతుంది. శ్రీశైలం ప్రాజెక్టుకు నీళ్లే రావు. ఇక ఆ తరువాత ఉన్న నాగార్జునసాగర్‌కు కూడా నీళ్లుండవనే విషయాన్ని గవర్నర్‌కు వివరించాం. ఈ రెండు ప్రాజెక్టుల కింది ఆయకట్టుదారులంతా  చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పథకాన్ని ఆపాలని కోరాం. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాజెక్టు ఆపడానికి గట్టిగా కృషి చేయాల్సింది పోయి ఒక్క మాట కూడా దాని గురించి మాట్లాడ్డం లేదు. ఓటుకు కోట్లు వ్యవహారంలో ఆడియో, వీడియో టేపులతో సహా దొరికి పోయిన చంద్రబాబు ఆ కేసుల నుంచి బయటపడటం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో రాజీ పడిపోయి రాష్ట్ర ప్రయోజనాలనే ఫణంగా పెట్టారు.

 గిరిజన సలహా మండలి నియమించాలి

 రాజ్యాంగంలోని 5వ షెడ్యూలు ప్రకారం గిరిజన సలహా మండలిని నియమించి తీరాలి. అలాంటిది చంద్రబాబు దురుద్దేశంతోనే నియమించడం లేదని గవర్నర్ దృష్టికి తెచ్చాం. ట్రైబల్ అడ్వయిజరీ కమిటీని నియమిస్తే నాలుగింట మూడోవంతు మంది గిరిజన ఎమ్మెల్యేలను అందులో నియమించాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని 7 గిరిజన ఎమ్మెల్యే స్థానాల్లో ఆరుగురు వైఎస్సార్‌సీపీకి చెందిన వారే ఉన్నారు. నిబంధనల ప్రకారం గిరిజన సలహామండలిలో ఎక్కువ మంది వైఎస్సార్‌సీపీకి చెందిన ఎమ్మెల్యేలే ఉంటారు కనుక, చంద్రబాబు చేసే అఘాయిత్యాలకు, దౌర్జన్యాలకు వారు అడ్డు తగులుతారనే ఉద్దేశ్యంతో వేయడం లేదు. గవర్నర్‌కు ఈ విషయాన్ని తెలియజేసి చర్యలు తీసుకోవాలని కోరాం.  

 వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఇతరులపై తప్పుడు కేసులు

 తుని ఘటనల్లో చంద్రబాబు తన వైఫల్యాలను కప్పి పుచ్చుకుని తప్పుదోవ పట్టించే కార్యక్రమాలు చేస్తున్న సంగతిని గవర్నర్‌కు వివరించాం. తన తప్పుల నుంచి కాపాడుకోవడానికి ఇతరులపై ఏరకంగా తప్పుడు కేసులు పెడుతున్నారో కూడా వివరించాం. జనవరి 31వ తేదీన తాను అక్కడ సభ నిర్వహిస్తామని ముద్రగడ పద్మనాభం మూడు నెలల కిందటే నోటీసు ఇచ్చారు. అందరూ ఇందులో పాల్గొనండి. సంఘీభావం ప్రకటించండి అని అన్ని రాజకీయ పార్టీకు ఆయన విజ్ఞప్తి చేశారు కూడా...టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులను చంద్రబాబు రావొద్దని కట్టడి చేసినా కింది స్థాయి కార్యకర్తలు సమావేశానికి వెళ్లారన్న సంగతి వాస్తవం. తునిలో రైల్వే ట్రాక్ పక్కన సభ జరుపుకోవడానికి అనుమతిని ఇస్తున్న సంగతి చంద్రబాబుకు తెలుసు. ముద్రగడ పద్మనాభం ప్రారంభోపన్యాసం 15 నిమిషాల్లో పూర్తయింది. నాతో పాటు బస్‌రోకో చేస్తారా? అని ప్రజలనడిగితే వారంతా చేతులు పెకైత్తి చేస్తామన్నారు. రైల్ రోకో చేస్తారా? సంఘీభావం తెలుపుతారా అని అడి గినపుడు వారంతా మద్దతు పలికారు. జనంలో మనోభావాలు ఇంత తీవ్రంగా ఉన్నపుడు ‘ఛలో...పదండి’ అని ముద్రగడ రైల్వే ట్రాక్ వద్దకు తీసుకెళ్లారు. లక్షలాది మంది తరలివస్తారని తెలిసినా చంద్రబాబు తగినంతమంది పోలీసులను ఎందుకు పెట్టలేక పోయారు? జనం రైల్వే ట్రాక్ మీదకు వెళ్లకుండా బారికేడింగ్ ఎందుకు చేయలేక పోయారు. ట్రాక్ పక్కన సభకు అనుమతినిచ్చింది చంద్రబాబే అయినపుడు ఈ ఏర్పాట్లు ఎందుకు చేయలేదు. చంద్రబాబు ఊహించలేదా...ఆయనకు ఇంటెలిజెన్స్ లేదా... లక్షమంది ఒక్క చోట ఏకమై రైలు ఆపడానికి రైల్వే ట్రాక్ ఎక్కితే ‘మాస్ హిస్టీరియా క్రియేట్ కాదా...   రైల్వే ట్రాక్ వైపు వెళ్లకుండా బారికేడ్లు కట్టి ఉండాలి. ప్రతి కీలకమైన ప్రదేశంలో పోలీసులను పెట్టి ఉండాలి. కానీ అవేమీ చేయకుండా తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఎదుటి వారిపై ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేశారు. బురద జల్లారు. తప్పుడు కేసులు బనాయించారు. అసలు ఏం పాపం చేశారని వీళ్లందరి మీదా తప్పుడు కేసులు పెట్టారు అని ఆలోచిస్తే బాధనిపిస్తుంది. చంద్రబాబు హామీలను నెరవేర్చనందుకే ఆ సభ జరిగింది. ఇవన్నీ గవర్నర్‌కు వివరించాం. ఈ వ్యవహారంలో జైల్లో పెట్టాలంటే ఇచ్చిన మాట తప్పినందుకు చంద్రబాబునే జైల్లో పెట్టాలి. చంద్రబాబుపైనే కేసు పెట్టాలి. కానీ ఈరకంగా అందరి మీదా తప్పుడు కేసులు పెట్టడం న్యాయం కాదని గవర్నర్‌కు చెప్పాం.

 గవర్నర్ నోటితోనే అబద్ధాలు చెప్పిస్తున్నారు

 శాసనసభా సమావేశాల సందర్భంగా చేసే ప్రసంగంలో మీ చేతే అబద్ధాలు చెప్పిస్తున్నారని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం. రాష్ట్రంలో జరిగే కార్యక్రమాలపై మీ నోటితోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పిస్తోంది. మేమిచ్చే వివరాలు, సమాచారం కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించాం. చంద్రబాబు  ఎన్నికల వేళ పూర్తిగా రైతుల రుణాలు మాఫీ చేస్తానని చెప్పారు. రూ. 87,612 కోట్ల రైతు రుణాలను, రూ.14 వేల కోట్ల డ్వాక్రా మహిళలను రుణాలను మాఫీ చేస్తానని అన్నారు. ఈ రెండూ కలిపితే రూ. 1,00,200 కోట్లు అవుతుంది. ఈ మొత్తంపై వడ్డీయే రూ 30,000 కోట్లు అవుతుంది. కానీ రెండు దఫాల్లో చంద్రబాబు ఇచ్చిన రూ. 7,300 కోట్లు వడ్డీలో నాలుగో వంతుకు కూడా సరిపోదు. కానీ ఆయన మాత్రం అన్నీ మాఫీ చేసేశానని చెబుతున్నారు. అదే విషయాన్ని గవర్నర్ నోటితో కూడా చెప్పిస్తున్నారు. రైతుల రుణాలు మాఫీ కాక వారు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ఇంటికో ఉద్యోగం... లేకుంటే నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు. ఇప్పటికి చేసింది మాత్రం సున్నా. అందుకే తనకు అలాంటి అబద్ధాలు ఇవ్వవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పాల్సిందిగా గవర్నర్‌ను కోరాం. కానీ అది రాజ్యాంగ పరంగా ఆనవాయితీ అని, రాష్ట్ర మంత్రివర్గంలో వారు ఆమోదించి ఇచ్చిన వివరాలే తాను చెబుతానని గవర్నర్ మాకు చెప్పినపుడు బాధ కలిగింది. ఈ అన్ని అంశాలపై ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేస్తాం. చంద్రబాబు అన్యాయాలపై ప్రతిపక్ష పార్టీగా ప్రతి వేదికపైనా ఫిర్యాదు చేస్తాం. అది మా ధర్మం. ఆ ధర్మాన్ని నిర్వర్తిస్తాం.’’ అని జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.  

అవినీతి కోసమే తాత్కాలిక ప్రాజెక్టులు: నేషనల్ మీడియాతో జగన్

ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతి తారస్థాయికి చేరుకుందని, అవినీతి కోసమే అనేక తాత్కాలిక ప్రాజెక్టులు పుట్టుకొస్తున్నాయని ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ విమర్శించారు. టీడీపీ ప్రభుత్వ తీరుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన కొన్ని జాతీయ చానళ్లతో మాట్లాడుతూ చంద్రబాబు అవినీతి వ్యవహారాలపై నిప్పులు చెరిగారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి 15 శాతం ఎక్సెస్‌కు టెండర్లు ఇచ్చారు. ఇద్దరు మాత్రమే ఈ టెండర్లలో పాల్గొనేలా ముందస్తు నిబంధనలు రూపొందించారు. ఇది మొత్తం ఓ అవినీతి వ్యవహారం. ఏపీలో అవినీతి తారస్థాయికి చేరుకుంది. పట్టిసీమనే తీసుకుంటే అది కూడా తాత్కాలిక ప్రాజెక్టే. పోలవరంపై ఖర్చు పెట్టాల్సిన మొత్తాన్ని పట్టిసీమ అనే తాత్కాలిక ప్రాజెక్టుకు ఖర్చుపెట్టారు. టెయిలర్‌మేడ్ నిబంధనలతో టెండర్లను 23 శాతం ఎక్సెస్‌కు ఇచ్చారు. ఇదేమీ కొత్త కాదు. బాబు ఏం చేసినా కమిషన్ల కోసమే చేస్తున్నారు. తాత్కాలిక నిర్మాణాలు, తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక నివాసాలు, తాత్కాలిక కార్యాలయాల గురించి రాష్ర్టంలో ప్రతి ఒక్కరికీ తెలుసు. ఈవెంట్స్ మేనేజ్‌మెంట్ కోసం చేసే ఖర్చుల సంగతీ తెలుసు. రాజధాని శంకుస్థాపన కోసం ఒక రోజు కార్యక్రమానికి రూ. 400 కోట్లు ఖర్చు చేశారు. గోదావరి పుష్కరాలకు రూ. 1,600 కోట్లు ఖర్చుచేశారు. నామినేషన్ పద్ధతిన పనులు కేటాయించేశారు. తాత్కాలికం.. సమయం లేదు అని చెప్పారు. అంతేకాదు సీఎస్ సంతకం లేకుండానే కేబినెట్‌కు ఇరిగేషన్ ఫైళ్లు పోతున్నాయి. నిబంధనలను అడ్డగోలుగా ఉల్లంఘిస్తూ అవినీతికి పాల్పడుతున్నారు. గాలేరునగరి, హంద్రీనీవా పనుల అంచనాల పెంపు వ్యవహారంలో ఆర్థిక శాఖ కార్యదర్శి సంతకం చేయకపోయినా, సీఎస్ సంతకానికి నిరాకరించినా కేబినెట్ చేత ఆమోదముద్ర వేయించారు. ఇంకో దారి లేదు. ఈ అవినీతి వ్యవహారాలపై పోరాడడం తప్ప’’.

వైఫల్యాలు దాచి.. మాపై నిందలు

టీడీపీ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటూ ప్రతిపక్షంపై బురద జల్లి రాజకీయ లబ్ది పొందాలని చూస్తోందని జగన్‌మోహన్‌రెడ్డి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. తునిలో జరిగిన రైలు దహనం సంఘటన, అక్కడ జరిగిన పరిణామాలన్నింటిపైనా ప్రస్తుత హైకోర్టు సిట్టింగ్ జడ్జితో గానీ, లేదా సీబీఐతో గాని విచారణ జరిపించాలని ఆయనను కోరారు. అపుడే వాస్తవాలు వెల్లడై నిజమైన నిందితులెవరో తేలుతుందన్నారు.  కొద్ది నెలల క్రితం చిత్తూరు నగర మేయర్ అనూరాధ దంపతుల హత్య జరిగినపుడు తీవ్రమైన భద్రతాపరమైన లోపాలు ఉన్నప్పటికీ సొంత పార్టీ వారే ఈ నేరం చేశారని కుటుంబీకులు ఆరోపిస్తున్నప్పటికీ వైఎస్సార్‌సీపీ వారికి ఆ హత్యను ఆపాదించే యత్నం చేశారని వినతిపత్రంలో పేర్కొన్నారు. లక్ష మందికి పైగా పాల్గొంటున్న సభకు ఏమాత్రం భద్రతా ఏర్పాట్లు చేయకుండా వైఎస్సార్‌సీపీపై నిరాధారమైన ఆరోపణలు చేయడంతో పాటుగా బురదజల్లే ప్రయత్నం చేశారన్నారు. తునిలో ముద్రగడ పద్మనాభం కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ చేపట్టిన సభ సందర్భంగా అక్కడ తగినన్ని పోలీసు బలగాలే లేవన్న విషయం గవర్నర్ దృష్టికి తెచ్చారు. 2014లో అధికారం చేపట్టిన దగ్గరి నుంచీ టీడీపీ ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ నాయకులను, కార్యకర్తలను, ఎంపీలు, ఎమ్మెల్యేలను భయకంపితులను చేసే విధంగా వ్యవహరిస్తోందన్నారు. కాల్‌మనీ సెక్స్ రాకెట్ నిందితుల విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు, శేషాచలంలో ఎర్రచందనం స్మగ్లర్ల పేరుతో జరిగిన మూకుమ్మడి హత్యాకాండపై సరైన దర్యాప్తు చేయక పోవడం, గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట జరిగి 29 మంది మరణించిన సంఘటనపై దర్యాప్తు జరగక పోవడం వంటి అంశాలను గవర్నర్ దృష్టికి తెచ్చారు. ఇలాంటి వైఫల్యాలను తాము అసెంబ్లీలో ప్రస్తావించేందుకు ప్రయత్నిస్తున్నపుడు అప్రజాస్వామికంగా తమ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఇవన్నీ చూస్తూంటే అసలు ఈ రాష్ట్రంలో ఒక చట్టం అనేది ఉందా? అనిపిస్తోందన్నారు. జగన్ వెంట గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించడానికి వెళ్లిన వారిలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జ్యోతుల నెహ్రూ, మేకపాటి గౌతమ్‌రెడ్డి, విశ్వాసరాయి కళావతి, సుజయ్‌కృష్ణ రంగారావు, వంతెల రాజేశ్వరి, గిడ్డి ఈశ్వరి, పాముల పుష్ప శ్రీవాణి, దాడిశెట్టి రాజా, కాకాని గోవర్థన్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, పాశం సునీల్‌కుమార్, కిలివేటి సంజీవయ్య, బుడ్డా రాజశేఖరరెడ్డి, అంబటి రాంబాబు, జోగి రమేష్ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement