అదో చోర కుటుంబం... స్వస్థలం గుంటూరు జిల్లా ఉండవల్లి... తల్లి, తండ్రితో పాటు కుమారుడు సైతం నేరాలు చేయడంలో దిట్ట.
సిటీబ్యూరో: అదో చోర కుటుంబం... స్వస్థలం గుంటూరు జిల్లా ఉండవల్లి... తల్లి, తండ్రితో పాటు కుమారుడు సైతం నేరాలు చేయడంలో దిట్ట. తల్లిని వనస్థలిపురం పోలీసుల 2012లో పట్టుకున్నారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న కుమారుడిని పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.
జంట కమిషనరేట్ల పరిధిలో నమోదైన 52 కేసుల్లో వాంటెడ్‌గా ఉన్నాడు. అదనపు డీసీపీ కె.రామ్‌చంద్రన్ తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన మేకపాటి మనోహర్ కుటుంబంతో సహా చాంద్రాయణగుట్ట ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఆరో తరగతితో చదువుకు స్వస్తి చెప్పిన ఇతను మెకానిక్‌గా పని చేస్తున్నాడు. తల్లి మంగమ్మ, తండ్రి ఆదినారాయణలతో కలిసి రద్దీ బస్సులు, ప్రాంతాల్లో తిరుగుతూ చోరీలు చేసేవాడు.
2009లో ఓసారి అరెస్టైన ముగ్గురూ జైలు నుంచి విడుదలైనా తమ పంథా మార్చుకోలేదు. దీంతో వనస్థలిపురం పోలీసులు 2012 ఆగస్టులో మంగమ్మను మరోసారి అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలోనే తన కుమారుడు మనోహర్‌తో కలిసి జంట కమిషనరేట్ల పరిధిలో 52 నేరాలు చేశానని బయటపెట్టింది. వీటిలో జేబు దొంగతనాలు, అటెన్షన్ డైవర్షన్లు, స్నాచింగ్స్, చోరీలు ఉన్నాయని తెలిపింది. అప్పట్లో వీరి బ్యాంక్ ఖాతాలను పరిశీలించిన పోలీసులు రూ.లక్షల లావాదేవీలు చూసి అవాక్కయ్యారు. దీంతో అప్పటి నుంచి పోలీసులు మనోహర్ కోసం గాలిస్తున్నారు.
ఇతడి కదలికలపై సమాచారం అందుకున్న ఇన్‌స్పెక్టర్ వై.ప్రకాష్‌రెడ్డి నేతృత్వంలోని బృందం మంగళవారం వలపన్ని పట్టుకుంది. మనోహర్‌పై నగర కమిషనరేట్ పరిధిలోని సైదాబాద్, మలక్‌పేట్ ఠాణాల్లో మూడు కేసులు, సైబరాబాద్‌లో 49 కేసులు నమోదై ఉన్నట్లు తేలడంతో తదుపరి చర్యల నిమిత్తం సైదాబాద్ పోలీసులకు అప్పగించారు. మనోహర్ అరెస్టు సమాచారాన్ని సైబరాబాద్ పోలీసులు చేయగా.. అక్కడి అధికారులు పీటీ వారెంట్‌పై తమ కేసుల్లో అరెస్టు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.