బీసీ బిల్లు కోసం దశలవారీ ఉద్యమం
చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
బీసీ, కులసంఘాల విస్తృతస్థాయి సమావేశం డిమాండ్
ఈ నెల మూడోవారంలో ఇందిరాపార్కు వద్ద మహాభేరి
హైదరాబాద్: బీసీ బిల్లు కోసం బీసీ, కుల సంఘాలు ఏకమయ్యాయి. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశాయి. పార్లమెంట్‌లో బిల్లు పెట్టాలని, రాష్ట్రంలో బీసీ కులాల ఫెడరేషన్లకు నిధులు కేటాయించాలని, దశలవారీగా ఉద్యమించాలని నిర్ణయించాయి. ఈ మేరకు బుధవారం ఇక్కడ జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో వివిధ రాజకీయ పార్టీలు, బీసీ, కుల సంఘాలు పాల్గొన్నాయి. బీసీల్లోని కులానికి ఒకటి చొప్పున రెసిడెన్షియల్ స్కూలు ఏర్పాటు చేయాలని, ర్యాంకులతో నిమిత్తం లేకుండా బీసీ విద్యార్థులకు పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తింపజేయాలని, అత్యంత వెనుకబడిన, సంచారజాతులకు రూ. వెయ్యి కోట్లు కేటాయించాలని, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల మాదిరిగా బీసీలకు పారిశ్రామిక విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేసింది.
ఈ నెల 7న ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా పార్లమెంట్‌లో బీసీ బిల్లు, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు, కేంద్ర బడ్జెట్‌లో బీసీల సంక్షేమానికి రూ.50 వేల కోట్ల కేటాయింపు, జాతీయ బీసీ కమిషన్‌కు చట్టబద్ధత తదితర డిమాండ్లను ఆయన దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టేలా కేంద్రంపై ఒత్తిడి తె చ్చేందుకు ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ అఖిలపక్ష బృందాన్ని, బీసీ సంఘాల ప్రతినిధులను ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేసింది.
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో బీసీ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్, సీపీఐ నేత టి.వెంకట్రాములు, టీటీడీపీ నేత బుచ్చిలింగం, బీసీ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, గంగపుత్ర సంఘం నేత ఏఎల్ మల్లయ్య, విశ్వబ్రాహ్మణ సంఘం నేత గణేష్‌చారితోపాటు 70 కుల సంఘాలు, 30 బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. డిమాండ ్ల సాధనకు ఈ నెల మూడోవారంలో ఇందిరాపార్కు వద్ద బీసీల మహాభేరి నిర్వహించాలని, వచ్చే నెలలో కలెక్టరేట్లు, ఆర్డీవో కార్యాలయాలను ముట్టడించాలని తీర్మానించారు.
పోరాడే సమయం: కృష్ణయ్య
బీసీలుగా వాటాల కోసం పోరాడే సమయం ఆసన్నమైందని ఆర్.కృష్ణయ్య అన్నారు. డిమాండ్ల సాధనకు దశలవారీగా ఉద్యమించాలని, అంతిమంగా రాష్ర్టబంద్ నిర్వహించాలని పిలుపునిచ్చారు. బీసీ ఫెడరేషన్లవారీగా కాకుండా 80 శాతం సబ్సిడీతో వ్యక్తిగత రుణాలివ్వాలని, బీసీలకు 500 రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.