‘ఆపరేషన్ స్మైల్’కు టాస్క్‌ఫోర్స్ | Taskforce formed for operation smile | Sakshi
Sakshi News home page

‘ఆపరేషన్ స్మైల్’కు టాస్క్‌ఫోర్స్

Published Tue, Jan 6 2015 6:38 PM | Last Updated on Sat, Sep 2 2017 7:19 PM

డీసీపీ రమారాజేశ్వరి

డీసీపీ రమారాజేశ్వరి

సాక్షి, సిటీబ్యూరో: చైతన్యపురిలో గతేడాది జూన్ 4న మూడేళ్ల బాలిక ఒంటరిగా తిరుగుతుండగా సరూర్‌నగర్ పోలీసులు చేరదీసి నాంపల్లిలోని చైల్డ్ హెల్ప్‌లైన్‌కు తరలించారు. అయితే ఆ పాప తల్లిదండ్రులెవరు? ఎక్కడుంటారు అనే వివరాలు ఇప్పటి వరకూ తెలియలేదు. ఆ వివరాలు తెలుసుకొనే ప్రయత్నాలూ జరగలేదు.  నిజానికి ఈ పాప తల్లిదండ్రులు దేశంలోని ఏదో ఒక పోలీసు స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేసే ఉంటారు. అయితే ఆ పాప సరూర్‌నగర్ పోలీసులకు దొరికిన విషయం అక్కడి పోలీసులకు తెలియకపోవడంతో మిస్సింగ్ కేసు, ఇక్కడి ఠాణాలో పాప లభ్యం కేసు నమోదై ఉంది.  పాప మాత్రం అనాథగా స్వచ్ఛంద సంస్థ నిర్వహించే హోమ్‌లో ఉంటోంది. ఇకపై తప్పిపోయిన ఏ చిన్నారి ఇలా అనాథ కాకూడదని... ఆ చిన్నారి ఇంట్లో తిరిగి చిరు నవ్వులు పూయించాలనే లక్ష్యంతో సైబరాబాద్ పోలీసులు ‘ఆపరేషన్ స్మైల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.  
 
 డివిజన్ల వారీగా ...
 
 చిన్నారుల మిస్సింగ్ కేసుల మిస్టరీని ఛేదించేందుకు 55 మందితో సైబరాబాద్‌లో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలకు నోడల్ అధికారిగా మల్కాజిగిరి డీసీపీ రమారాజేశ్వరిని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ నియమించారు. కమిషనరేట్ పరిధిలోని 11 డివిజన్‌లలో ఒక్కో టాస్క్‌ఫోర్స్ బృందం ఉంటుంది. ఈ బృందంలో ఎస్‌ఐతో పాటు నలుగురు కానిస్టేబుళ్లు ఉంటారు. వీరంతా ఆయా పోలీసు స్టేషన్ పరిధిలో నమోదైన చిన్నారుల మిస్సింగ్ కేసులపై దృష్టి పెడతారు. బాధితులు, వారి స్నేహితులు, బంధువుల సహకారంతో మిస్సింగ్ కేసు మిస్టరీని ఛేదిస్తారు.  మిస్సింగ్ అయిన చిన్నారుల వివరాలు, వారి ఫొటో, ఎఫ్‌ఐఆర్‌లను కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ వారి వెబ్‌సైట్‌లో ‘నేషనల్ ట్రాకింగ్ సిస్టమ్’లో అప్‌లోడ్ చేస్తారు. అలాగే ఇక్కడ దొరికిన తప్పిపోయిన చిన్నారుల ఫొటోలను సైతం అదే వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఇందుకోసం ప్రతి ఠాణాకు యూజర్‌నేమ్, పాస్‌వర్డ్ ఉంటుంది. వెబ్‌సైట్‌లో డేటా బేస్‌ను ప్రతి ఒక్కరు చూసుకునే అవకాశం ఉంది.
 
 అనుసంధానంగా వెబ్‌సైట్...
 
 వెబ్‌సైట్‌లో పొందుపర్చిన చిన్నారుల ఫొటోలు, వివరాలను ప్రజలు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు వెబ్‌సైట్‌లో అవకాశం ఇచ్చారు. ఉదాహరణకు సైదాబాద్‌లో మిస్సింగ్ అయిన చిన్నారి ఫొటో అప్‌లోడ్ చేశారనుకోండి...ఇదే చిన్నారి గుజరాత్‌లో వారం తర్వాత అక్కడి పోలీసులకు దొరికితే వారు కూడా చిన్నారి ఫొటోను అదే వెబ్‌సైడ్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఈ ఫొటోను సైదాబాద్ పోలీసులు క్లిక్ చేస్తే చాలు గుజరాత్ పోలీసులకు చిన్నారి మిస్సింగ్ వివరాలన్నీ ఈ-మెయిల్ ద్వారా క్షణాల్లో వెళ్తాయి. ఇలా చేయడం ద్వారా దేశంలోని అన్ని ఠాణాల ఎస్‌హెచ్‌ఓలు చిన్నారుల వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుం ది. దీని ద్వారా వెబ్‌సైట్ ఇటు మిస్పింగ్ కేసు, అటు ట్రేసింగ్ కేసు ముడి విప్పేందుకు అనుసంధానంగా పని చేస్తుంది.
 
 ఎవరెవరు భాగస్వాములు...
 
 రాష్ట్రంలో తప్పిపోతున్న చిన్నారులను తిరిగి వారి తల్లిదండ్రుల చెంతకు చేర్చే ఈ కార్యక్రమంలో పోలీసులకు సహాయంగా రాష్ట్ర స్త్రీ,శిశు సంక్షేమ శాఖ, కార్మిక శాఖ, ఎన్జీవో సంస్థలు చేర్చారు. వీధి బాలలు,  తప్పిపోతున్న పిల్లల కారణంగా  సమాజంలో ఎదురవుతున్న సమస్యలను అరికట్టడానికి  కేంద్ర ప్రభుత్వం చేపట్టిన  కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ఈ బాధ్యతలను సీఐడీకి అప్పగించారు. ఆపరేషన్ స్మైల్ పథకం ఉత్తరప్రదేశ్‌లోని గజియాబాద్ జిల్లాలో విజయవంతంగా అమలు చేయడంతో దానిని మాడల్‌గా తీసుకుని రాష్ట్రంలో అమలు చేస్తున్నారు.
 
 మిస్టరీ వీడిన 76 శాతం కేసులు...
 
 గతనెల డిసెంబర్‌లో సైబరాబాద్‌లో 953 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 238 బాలురు, 488 మంది బాలికలు ఉన్నారు. పోలీసుల చొరవతో వీరిలో 60 మంది బాలురు, 167 మంది బాలికల ఆచూకీని కనిపెట్టారు. తప్పిపోయిన 726 మంది చిన్నారుల్లో 227 మంది ఆచూకీ లభ్యం కావడంతో 76 శాతం కేసులు కొలిక్కి వచ్చినట్లైంది.
 
 ఆకస్మిక దాడులు చేస్తాం...
 
 తప్పిపోయిన చిన్నారులను భిక్షగాళ్లుగా, బాల కార్మికులుగా చేస్తున్న వారిపై దృష్టి సారించాం. బస్సు, రైల్వేస్టేషన్లు, దాబాలు, హోటళ్లు, భవన నిర్మాణ రంగంతో పాటు చిన్నారులకు ఆశ్రయం కల్పిస్తున్న స్వచ్ఛంద సంస్థలపై నిఘా పెడుతున్నాం. కార్మిక శాఖ అధికారులతో కలిసి ఆయా ప్రాంతాలలో దాడులు చేసేందుకు కూడా ప్రణాళిక రూపొందించాం. ఇలాంటి చిన్నారులను రక్షించి వారి తల్లిదండ్రులకు అప్పగించేందుకు కసరత్తు చేస్తున్నాం. మొదటి ఫేజ్‌లో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా చిన్నారులు లభ్యమైన వెళ్లి తీసుకువస్తున్నాం. రెండోఫేజ్‌లో ఇతర రాష్ట్రాలకు కూడా టాస్క్‌ఫోర్స్ బృందాలు వెళ్తాయి. ఈనెల 31వ తేదీ వరకు ఆపరేషన్ స్మైల్ స్పెషల్ డ్రైవ్ నడుస్తుంది.    - డీసీపీ రమారాజేశ్వరి
 
 రౌడీషీటర్ చెరనుంచి బాలుడికి విముక్తి
 
 గచ్చిబౌలి: తప్పిపోయిన బాలుడ్ని రౌడీషీటర్ నిర్బంధించి, అతనితో గుడుంబా అమ్మిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన ‘ఆపరేషన్ స్మైల్’ టీమ్ రౌడీషీటర్ కబంధ హస్తాల నుంచి బాలుడిని రక్షించి అతని తల్లిదండ్రులకు అప్పగించారు. రౌడీషీటర్‌ను కటకటాల్లోకి నెట్టారు. ఎస్‌ఐ రాజేష్ కథనం ప్రకారం...  వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలం తాళ్లపూసలపల్లి గ్రామానికి చెందిన వల్లపు అరవింద్(13) ఐదు నెలల క్రితం తల్లిదండ్రులకు చెప్పకుండా ఇంట్లో నుంచి పారిపోయి హైదరాబాద్ చేరుకున్నాడు. రైల్వేస్టేషన్‌లో తచ్చాడుతున్న అరవింద్‌కు రాయదుర్గానికి చెందిన రౌడీషీటర్ జాడుకట్టల అశోక్ (35) మాయమాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లాడు. పోలీసులకు బాలుడి విషయం చెప్పకుండా తన వద్ద అక్రమంగా నిర్బంధించి అతనితో స్థానికంగా గుడుంబా ప్యాకెట్లు అమ్మిస్తున్నాడు. చిన్నారుల మిస్సింగ్ కేసులు ఛేదించేందుకు సైబరాబాద్ పోలీసులు ఏర్పాటు చేసిన ‘ఆపరేషన్ స్మైల్’ టీమ్ బృందం దృష్టి గుడుంబా విక్రయిస్తున్న అరవింద్‌పై పడింది. అతడి వివరాలు రాబట్టి రౌడీషీటర్ నిర్బంధం నుంచి విముక్తి కలిగించి చైల్డ్ వెల్ఫేర్ అధికారుల ద్వారా తల్లిదండ్రులకు అప్పగించారు.  రౌడీషీటర్ జాడుకట్టల అశోక్‌ను అరెస్టు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement