బాబు తీరుపై ‘తమ్ముళ్ల’ అసంతృప్తి | tdp leaders Unhappy to babu behave | Sakshi
Sakshi News home page

బాబు తీరుపై ‘తమ్ముళ్ల’ అసంతృప్తి

Published Thu, Jan 14 2016 4:25 AM | Last Updated on Sat, Aug 11 2018 4:44 PM

బాబు తీరుపై ‘తమ్ముళ్ల’ అసంతృప్తి - Sakshi

బాబు తీరుపై ‘తమ్ముళ్ల’ అసంతృప్తి

గ్రేటర్ ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు ప్రసంగంతో కంగుతిన్న టీటీడీపీ నేతలు
 సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణలో తెలుగుదేశం పార్టీని అధినేత చంద్రబాబునాయుడు పూర్తిగా వదిలేసుకున్నారేమోనని తెలంగాణ టీడీపీ నేతలు ఆం దోళన చెందుతున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచార సభలో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌పై, ప్రభుత్వంపై చంద్రబాబు కనీస విమర్శలు కూడా చేయకపోవడమేమిటని ప్రశ్నిస్తున్నారు.
 
  ఇందుకు ‘ఓటుకు కోట్లు’ కేసు భయమే కారణమని భావిస్తున్నారు. అసలు ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంలో బాబు నేరుగా మాట్లాడిన ఆడి యో టేపులు బహిర్గతం కావడం, ఏసీబీ తమ చార్జిషీటులోనూ చంద్రబాబు పేరు ప్రస్తావించి న నేపథ్యంలో... కేసీఆర్‌తో సఖ్యత కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారంటున్నారు. మంగళవారం నిజాం కళాశాల మైదానంలో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల సభలో చంద్రబాబు ప్రసంగించిన తీరు చూస్తే ఇదే అభిప్రాయం కలుగుతోందని పేర్కొంటున్నారు.
 
 ఇలాగైతే ఎలా..?
 గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారానికి రావడానికి తొలుత విముఖత చూపి, పార్టీ నేతల ఒత్తిడి మేరకు బహిరంగసభలో పాల్గొన్న చంద్రబాబు ముక్తసరి ప్రసంగం చేయడం వారికి ఏ మాత్రం మింగుడు పడడంలేదు. అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ను, ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపలేనప్పుడు ప్రతిపక్షంలో ఉండి పార్టీని ముందుకు నడిపించడం ఎలా సాధ్యమని టీడీపీ సీనియర్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ‘ఇప్పుడు మా ముందు గ్రేటర్ ఎన్నికలున్నా యి.
 
  ఇప్పటికిప్పుడు మా వైఖరి మార్చుకోవడానికి అనువైన ప్లాట్‌ఫాం దొరకాలి కదా. మా నిర్ణయం ఏదైనా గ్రేటర్ ఎన్నికల తరువాతే’ అని తెలంగాణ టీడీపీలో సీనియర్ నేత ఒకరు చెప్పారు. తెలంగాణలో టీడీపీ కోసం రక్తం ధారపోసిన కుటుంబాలున్నాయని, చంద్రబాబు వారిని తీసుకెళ్లి సీఎం కేసీఆర్‌కు బలిపెడతారనుకోవడం లేదని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఓ టీవీ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. కేసీఆర్‌తో దోస్తీ కడుతున్న బాబుకు పరోక్షంగా సంకేతాలు ఇవ్వడానికే రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతలే అంటున్నారు.
 
  దానికి తోడు టీటీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు పార్టీ అధినాయకత్వం వైఖరిపై అసంతృప్తితో ఉన్నారని, మంగళవారంనాటి సభలో నమస్కారం అం టూ ఆయన ముక్తసరిగా మాట్లాడటానికి ఇదే కారణమని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ‘మేమేమో నిత్యం కేసీఆర్‌తో, టీఆర్‌ఎస్‌తో గొడవ పడాలి. పార్టీ అధినేత మాత్రం సఖ్యత తో ఉంటారు. ఇదెలా సాధ్యం? పార్టీ కేడర్ మమ్మల్ని ఎలా విశ్వసిస్తుంది’ అని ఎర్రబెల్లి సన్నిహితులవద్ద ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు-కేసీఆర్ కలసిపోయినప్పుడు మనిద్దరి మధ్య విభేదాలు ఎందుకంటూ ఎర్రబెల్లి, రేవంత్ సరదా వ్యాఖ్యలు కూడా చేసుకున్నారని ఓ ఎమ్మెల్యే చెప్పారు.
 
 నేతల్లో నిస్పృహ
 పార్టీ అధినేత చంద్రబాబు గ్రేటర్ ఎన్నికలను సీరియస్‌గా తీసుకోవడం లేదని గ్రహించిన మాజీ కార్పొరేటర్లు అనేక మంది గతవారం రోజులుగా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. మంగళవారం సాయంత్రం ఎల్‌బీనగర్, మహేశ్వరం నియోజకవర్గాలకు చెందిన ఏడుగురు మాజీ కార్పొరేటర్లు టీడీపీని వీడారు. ఇక చంద్రబాబు వైఖరి స్పష్టమైన తరువాత మిగిలిన వారు కూడా పార్టీలో కొనసాగుతారనుకోవడం లేదని పార్టీ నేతలు అంటున్నారు.
 
  పోటీ చేయడానికి ముందుకు వస్తున్నవారు కూడా తక్కువేనని... కొన్ని డివిజన్లలో మినహా టికెట్లకు పెద్దగా డిమాండ్ లేదని జీహెచ్‌ఎంసీ పరిధిలోని టీడీపీ ఎమ్మెల్యే ఒకరు చెప్పారు. ‘బాబు ఎంత బలవంతంమీద ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారో ఆయన ప్రసం గం చూస్తేనే అర్థమవుతుంది. ఇదేమీ మా కేడర్‌కు పనికొచ్చేదిగా లేదు. పైగా పార్టీలో ఉండడం ఎందుకన్న ఆలోచన కలిగించేలా ఉంది’ అని ఆ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.
 
 ఎప్పుడో పన్నెండేళ్ల క్రితం తామేదో చేశామని గొప్పలు చెప్పుకుంటే ప్రయోజనం లేదని టీడీపీ సీనియర్ నేత ఒకరు చంద్రబాబు ప్రసంగాన్ని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వానికి సంబంధమేలేని ఔటర్ రింగ్‌రోడ్డు కూడా తమ ఖాతాలో వేసుకోవడంపైనా టీడీపీ శ్రేణులు విస్తుపోతున్నాయి. ‘ఓటుకు కోట్లు’ కేసు కోసమే బాబు కేసీఆర్‌తో సంధి కుదుర్చుకున్నారన్న ఆరోపణలకు ఆయన ప్రసంగం అద్దం పట్టిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
 
 బీజేపీలో అంతర్మథనం
 తరచూ సీఎం కేసీఆర్‌పై ఒంటికాలితో లేస్తున్న బీజేపీ నేతలు చంద్రబాబు వైఖరితో ఇబ్బంది పడుతున్నారు. టీఆర్‌ఎస్‌కు, సీఎం కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా ప్రచారం మొదలు
 
 పెట్టినవారంతా బాబు ప్రసంగంతో కంగుతిన్నారు. ‘‘ఆయన ప్రసంగం ఇలా ఉంటుందనుకోలేదు. వేదిక మీద ఉన్న మాకే ఏం చేయాలో పాలుపోలేదు. టీడీపీ కార్యకర్తలకు కూడా మింగుడు పడలేదు. దీని ప్రభావం మా పార్టీపై పడుతుందేమో’’ అని బీజేపీ ఎమ్మెల్యే ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీతో పొత్తు లేకుంటే బాగుండనేదాకా తమ పార్టీ నేతలు మాట్లాడుతున్నారన్నారు. ఇక తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్‌రావు అయితే బుధవారం ఉదయం ఓ టీవీ చర్చాగోష్టిలో మాట్లాడుతూ.. చంద్రబాబు వైఖరిని తప్పుపట్టారు.
 
 15 నిమిషాల్లోనే ముగిసిన ప్రసంగం..
 ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసినా, చివరకు కలెక్టర్ల కాన్ఫరెన్స్ అయినా సరే చంద్రబాబు గంటకు తక్కువ కాకుండా మాట్లాడతారు. ఇక బహిరంగ సభల్లో అయితే అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలపై, ప్రతిపక్షంలో ఉంటే అధికారపక్షంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించడం ఆయన నైజం. టీడీపీ నేతలే ప్రైవేట్ సంభాషణల్లో ‘మైకాసురుడు’గా పిలుచుకునే చంద్రబాబు... మంగళవారం హైదరాబాద్‌లోని నిజాం కళాశాల మైదానంలో జరిగిన సభలో 15 నిమిషాల్లోనే తన ప్రసంగాన్ని ముగించడం చూసి వేదిక మీద ఉన్న టీడీపీ, బీజేపీ నేతలే ఆశ్చర్యపోయారు.
 
  ఈ 15 నిమిషాల ప్రసంగంలోనూ తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ను గానీ, సీఎం కేసీఆర్‌ను, ప్రభుత్వాన్ని గానీ పల్లెత్తు మాట అనకపోవడం చూసి విస్తుపోయారు. తాము అధికారంలో ఉన్న ఏపీలో ఏవిషయంలోనూ ప్రధాన ప్రతిపక్షం అభిప్రాయానికి విలువ ఇవ్వకపోగా, అదే పనిగా ఎదురుదాడికి దిగడమే అలవాటు చేసుకున్న చంద్రబాబు... తెలంగాణలో అధికారపక్షాన్ని మాటమాత్రంగానైనా విమర్శించలేదు. దీనికి ‘ఓటుకు కోట్లు’ కేసు కారణమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దాదాపు ఆర్నెల్ల కింద హైదరాబాద్‌లో ఏపీ పోలీసు స్టేషన్ పెడతామని బీరాలు పలికిన చంద్రబాబు.. ఆ తరువాత సీఎం కేసీఆర్‌ను ఒక్క మాట కూడా అనలేనంతగా మారిపోయారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement