తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభమైన వెంటనే స్పీకర్ మధుసూదనచారి ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. మొదట రోడ్ల అభివృద్ధి గురించి సభ్యులు ప్రశ్నలు అడుగగా.. రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమాధానమిస్తూ రోడ్ల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న రోడ్లను సకాలంలో పూర్తి చేస్తామని చెప్పారు.
ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు తమ నియోజకవర్గాల్లోని మండల కేంద్రాల్లో 30 పడలక ఆస్పత్రుల ఏర్పాటు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు గురించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు వైద్యారోగ్యశాఖ మంత్రి సీ లక్ష్మారెడ్డి సమాధానమిస్తూ.. నిజామాబాద్ జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, ప్రభుత్వ ఆస్పత్రులను మొదట బలోపేతం చేస్తామని, తదుపరి దశలో అన్ని ఆస్పత్రులను ఆధునీకరిస్తామని చెప్పారు.