
తల వెంట్రుకల్లో 4 నెలలు.. రోమాల్లో ఏడాది..
ఏ వ్యక్తి అయినా డ్రగ్స్ తీసుకున్నట్టు రుజువు చేయాలంటే అతడికి రక్త పరీక్షలు నిర్వహిస్తారు.
పరీక్షల ద్వారా వెల్లడయ్యే డ్రగ్స్ ఆనవాళ్లు
సాక్షి, హైదరాబాద్:
ఏ వ్యక్తి అయినా డ్రగ్స్ తీసుకున్నట్టు రుజువు చేయాలంటే అతడికి రక్త పరీక్షలు నిర్వహిస్తారు. అయితే రక్త నమూనాల్లో అంత పక్కాగా డ్రగ్స్ తీసుకున్న ఆనవాళ్లు రాకపోవచ్చని ఫోరెన్సిక్ వైద్య నిపుణులు చెబుతున్నారు. 15 రోజుల నుంచి నెల రోజుల క్రితం వరకు తీసుకున్న డ్రగ్స్ ఆనవాళ్లు మాత్రమే రక్త పరీక్ష ద్వారా దొరికే అవకాశం ఉందంటున్నారు. దేశవ్యాప్తంగా డ్రగ్ కేసుల్లో 20 శాతమే రుజువవుతున్నాయని ఫోరెన్సిక్ విభాగం గతంలోనే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ)కి స్పష్టం చేసింది. సీడీఎఫ్‌డీ(కేంద్ర ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్) అధికారులు మాత్రం.. తల వెంట్రుకలు, శరీరంపై రోమాలను పరీక్ష చేస్తే పక్కా ఆధారాలు లభిస్తాయని తెలిపారు. తల వెంట్రుకలను పరీక్ష చేస్తే 4 నెలల క్రితం వరకు డ్రగ్స్ తీసుకున్నా అందుకు సంబంధించిన ఆనవాళ్లు దొరుకుతాయన్నారు.
అదే శరీరంపై ఉన్న రోమాలను పరీక్ష చేస్తే 260 రోజుల నుంచి 360 రోజుల క్రితం వరకు అంటే దాదాపు ఏడాది క్రితం డ్రగ్ తీసుకున్నా ఇట్టే పట్టేయవచ్చని పేర్కొంటున్నారు. దీనిద్వారా 90 శాతం కేసుల్లో పక్కా ఆధారాలు లభిస్తున్నాయని స్పష్టం చేశారు. అలాగే మూత్ర పరీక్షల్లోనూ డ్రగ్ తీసుకున్న ఆధారాలు లభిస్తాయని, అయితే అందులో కేవలం వారం పది రోజులకు మించిన ఆనవాళ్లు కనిపించవని చెప్పారు.
డ్రగ్‌ను బట్టి ఆనవాళ్లు
⇒ వ్యక్తి తీసుకున్న డ్రగ్‌ను బట్టి ఎన్ని రోజుల క్రితం తీసుకున్నారో పక్కాగా చెప్పవచ్చని కేంద్ర ఫోరెన్సిక్ విభాగం సైంటిస్టులు తెలిపారు.
⇒ గంజాయి తీసుకుంటే... వారం నుంచి నెల వరకు మాత్రమే ఆధారాలు లభిస్తాయి. అదే తల వెంట్రుకలు పరీక్షిస్తే 90 రోజుల వరకు ఆధారాలు సేకరించవచ్చు. రక్త పరీక్ష ద్వారా అయితే 2 వారాల వరకు మాత్రమే ఆధారాలు సేకరించే అవకాశం ఉంది.
⇒ కొకైన్ తీసుకుంటే.. 3–4 రోజుల్లో మూత్ర పరీక్ష ద్వారా, 90 రోజుల వరకు తల వెంట్రుకల ద్వారా డ్రగ్ ఆనవాళ్లు దొరుకుతాయి. అదే శరీరంపై రోమాల ద్వారా 250 రోజుల వరకు నమూనాలు సేకరించి డ్రగ్ ఆనవాళ్లు గుర్తించవచ్చు.
⇒ జనరిక్ డ్రగ్స్.. ఇది కేవలం 12 గంటలు మాత్రమే రక్తంలో ఉంటుంది. మూత్రంలో ఒక రోజు ఉండగా, వెంట్రుకల్లో 3 నెలల వరకు ఉంటుంది.
⇒ హెరాయిన్ తీసుకుంటే... మూడు నుంచి నాలుగు రోజుల పాటు మూత్రంలో ఆనవాళ్లు గుర్తించవచ్చు. 12 గంటల్లో బ్లడ్ శాంపిల్స్‌లో దొరికిపోతుంది. తల వెంట్రుకల్లో 100 రోజుల పాటు ఉండే అవకాశం ఉంది.
⇒ ఎల్‌ఎస్‌డీ, ఎండీఎంఏ డ్రగ్..: వెంట్రుకల పరీక్ష ద్వారా 90 రోజుల నుంచి 250 రోజుల వరకు డ్రగ్స్ ఆనవాళ్లు దొరికే అవకాశం ఉంటుంది.