అబిడ్స్: ఎగ్జిబిషన్‌లో ఇన్‌స్పెక్టర్‌పై దాడి చేసిన కానిస్టేబుల్‌పై బేగంబజార్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. శనివారం రాత్రి విధుల్లో ఉన్న బేగంబజార్ ఇన్‌స్పెక్టర్ గంగసాని శ్రీధర్‌పై మీర్‌చౌక్ పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ రవి కిరణ్ సినీఫక్కీలో దాడి చేశాడు. బాధిత ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ ఫిర్యాదుతో రాత్రి పొద్దుపోయాక సెంట్రల్‌జోన్ డీసీపీ కమలాసన్ రెడ్డి, అబిడ్స్ ఏసీపీ జైపాల్ విచారణ జరిపారు. కానిస్టేబుల్ రవి తీరుపై మండిపడ్డారు. అతనిపై ఐపీసీ 353, 323, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అంతటా చర్చ...
ఎగ్జిబిషన్‌లో బందోబస్తు విధుల్లో ఉన్న బేగంబజార్ ఇన్‌స్పెక్టర్ గంగసాని శ్రీధర్‌పై కానిస్టేబుల్ రవికిరణ్ దాడి చేయడం పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఎగ్జిబిషన్ లోపల కూర్చుని ఇతర సిబ్బందితో ముచ్చటిస్తున్న రవికిరణ్‌ను బందోబస్తులో ఉన్న శ్రీధర్ కూర్చోవద్దని మందలించారు.
దీంతో కక్షగట్టిన కానిస్టేబుల్ రవికిరణ్ శనివారం రాత్రి ఇన్‌స్పెక్టర్ ఎగ్జిబిషన్ అజంతాగేటు వద్ద విధులు నిర్వర్తిస్తుండగా.. ముఖానికి మాస్క్, జాకెట్ ధరించి వెనుక నుంచి వచ్చిన ఇన్‌స్పెక్టర్‌పై దాడి బలంగా కొట్టి పారిపోయాడు. సమీపంలోని మనోరంజితం కాంప్లెక్స్‌లోని 5వ ఫ్లోర్‌లో దాక్కున్న అతడిని సందర్శకులు దొంగా.. దొంగా అంటూ బయటకు లాక్కొచ్చి చితకబాదారు. చివరకు మానవతా దృక్పథంతో ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ అతడిని సందర్శకుల నుంచి విడిపించి ఉస్మానియా ఆసుపత్రికి తరలించడం విశేషం.
అధికారుల ఆందోళన...
ఇన్‌స్పెక్టర్ గంగసాని శ్రీధర్‌పై కానిస్టేబుల్ రవికిరణ్ దాడి చేయడంపై నగరంలోని పలువురు ఇన్‌స్పెక్టర్లు, ఏసీపీ స్థాయి అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం నగరంలోని ఏ పోలీస్‌స్టేషన్, ఏసీపీ కార్యాలయంలో చూసినా రవికిరణ్ తీరుపైనే చర్చించుకున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా కానిస్టేబుల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు డిమాండ్ చేస్తున్నారు.
కమిషనర్ సీరియస్...
బేగంబజార్ ఇన్‌స్పెక్టర్‌పై దాడి చేసిన కానిస్టేబుల్ రవి కిరణ్ తీరుపై నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి సీరియస్ అయ్యారు. సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్‌రెడ్డి, అబిడ్స్ ఏసీపీ జైపాల్‌ల విచారణ నివేదిక ఆధారంగా నేడో.. రేపో కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోనున్నట్టు తెలిసింది.
ఇన్‌స్పెక్టర్‌పై దాడి చేసిన కానిస్టేబుల్‌పై కేసు
Published Mon, Jan 19 2015 2:51 AM | Last Updated on Tue, Mar 19 2019 6:01 PM
Advertisement
Advertisement