
చంద్రబాబు కాలం నుంచీ అంతే
ఓయూ ఉద్యోగుల మహాధర్నాలో నేతల ఆరోపణ
ఉస్మానియా యూనివర్సిటీ: గతంలో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ఉన్నప్పటి నుంచి విశ్వవిద్యాలయాల నిధుల కుదింపు ప్రారంభమైందని రాజకీయ జేఏసీ ఛైర్మన్ ప్రొ.కోదండరామ్ ఆరోపించారు. బ్లాక్ గ్రాంట్స్ పెంచాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విశ్వవిద్యాలయాల అధ్యాపకులు, ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో గురువారం ఉస్మానియా యూనివర్సిటీ పరిపాలన భవనం ఎదుట జరిగిన మహాధర్నాలో ఆయన ప్రసంగించారు.
తెలంగాణ రాష్ట్ర పాలకులు నిధులు పెంచాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఎమ్మెల్యే డాక్టర లక్ష్మణ్ మాట్లాడుతూ రాష్ట్ర సాధన ఉద్యమంలో ముందు భాగాన నిలిచిన అధ్యాపకులు, విద్యార్థులు, ఉద్యోగులను నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. జేఏసీ అధ్యక్షుడు ప్రొ.భట్టు సత్యనారాయణ, ఉద్యోగుల నేత కంచి మనోహార్ మాట్లాడుతూ బడ్జెట్ పెంపునకు అధ్యాపకులు, ఉద్యోగులు చేపట్టిన తెలంగాణ వర్సిటీల బంద్ విజయవంతమైనట్లు తెలిపారు.
గడువు కోరిన అధికారులు
తెలంగాణ వ్యాప్తంగా ధర్నాలు, ఇతర ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయని ముందే తెలుసుకున్న ప్రభుత్వ అధికారులు జేఏసీ నాయకులతో గురువారం ఉదయం చర్చలు జరిపారు. ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి రాజీవ్ శర్మ, ఫైనాన్స్ సెక్రెటరీ నాగిరెడ్డి, ఉన్నత విద్యా కార్యదర్శి వికాస్‌రాజ్, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొ.పాపిరెడ్డితో టి.వర్సిటీల ఉద్యోగ జేఏసీ నాయకులు ప్రొ.భట్టు సత్యనారాయణ, ఔటా ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ మనోహార్, ఉద్యోగ సంఘాల అధ్యక్షులు కంచి మనోహార్, పార్థసారథి, మల్లేష్ చర్చల్లో పాల్గొన్నారు.
సుమారు మూడు గంటల పాటు జరిగిన చర్చల్లో ప్రభుత్వ అధికారులు తొలుత వ్యతిరేకతను ప్రదర్శించినా తర్వత సానుకూలంగా స్పందించినట్లు ఉద్యోగ నేతలు వివరించారు. వారం రోజుల గడువును అడిగినట్లు జేఏసీ నాయకులు మహాధర్నాలో వివరించారు. మహాధర్నాలో ప్రొ.కోదండరామ్, బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మణ్, విశ్రాంత అధ్యాపకులు ప్రొ.పీఎల్ విశ్వేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.