గల్లీల నోట.. గెలుపు పాట | The use of banks to vote | Sakshi
Sakshi News home page

గల్లీల నోట.. గెలుపు పాట

Published Mon, Jan 25 2016 1:09 AM | Last Updated on Sun, Sep 3 2017 4:15 PM

గల్లీల నోట..  గెలుపు పాట

గల్లీల నోట.. గెలుపు పాట

గ్రేటర్‌లో ఇవే కీలకం
ఓటు బ్యాంకులుగా వినియోగం
మౌలిక సదుపాయాలకు దూరం


సిటీబ్యూరో: వాళ్లు ఉన్న ఇళ్లు... కిల్లీ కొట్ల కన్న సిన్నగున్నయీ... గల్లీ సిన్నది...’ అంటూ సాగిపోయే గోరటి ఎంకన్న పాట సంగతి ఎలాగున్నా... ఇప్పుడు ఈ గల్లీలే గ్రేటర్ దశను, దిశను మలుపు తిప్పబోతున్నాయి. కోటికి చేరువైన గ్రేటర్ జనాభాలో ఎంతోమంది ఈ ఇరుకు గల్లీల్లోనే జీవనం సాగిస్తున్నారు. రాజకీయ పార్టీల హామీలకు, వాగ్దానాలకు, మేనిఫెస్టోలకు మధ్య తరగతి, ఆ పై వర్గాల కంటే ఎక్కువగా ప్రభావితమయ్యేది... ఆకర్షితులయ్యేదీ ఇక్కడి జనాభాయే. ఏ పార్టీ నేత తమ ప్రాంతానికి వచ్చినా సాదరంగా ఆహ్వానించి... ముందు వరుసలో నిలుచొని జెండాలు మోసేదీ... నినాదాలు చే సేదీ ఈ గల్లీలే. అందుకే అన్ని రాజకీయ పార్టీల దృష్టి వీటిపై పడింది. కాలనీలు, అపార్ట్‌మెంట్ల కంటే గల్లీలను నమ్ముకుంటేనే కాసిన్ని ఎక్కువ ఓట్లు రాలుతాయనే ఆశ కావచ్చు. తమ హమీలను నమ్మేసి... ఓట్లేసేదీ గల్లీలే అనే ధీమా కావచ్చు.కానీ మొత్తంగా అటు వామపక్షాల నుంచి ఇటు పాలక పక్షాల వరకు అన్ని పార్టీలూ గల్లీల కే జైకొడుతున్నాయి. ఈ నేపథ్యంలో గల్లీల సమస్యలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం ఇది....

అమలుకు నోచని హామీలు
స్వచ్చంద సంస్థలు, హక్కుల సంఘాల సర్వేల ప్రకారం నగరంలో మొత్తం 2,200 మురికివాడలు ఉన్నాయి. వీటిలో 1,492 బస్తీలను ప్రభుత్వం గుర్తించింది. 30 లక్షల మందికి పైగా ప్రజలు ఈ ఇరుకు గల్లీల్లో, బస్తీల్లో అనేక సమస్యల మధ్య జీవిస్తున్నారు. దినసరి కూలీలుగా, చిరు వ్యాపారులుగా, ఇళ్లలో పనులు చేస్తూ, ఆటోలు, ట్రాలీలు నడుపుతూ బతుకుతున్నారు. అప్పటి ఉమ్మడి రాష్ర్టం మొదలుకొని ఇప్పటి ప్రత్యేక రాష్ర్టం వరకు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హైదరాబాద్‌ను మురికివాడల రహితంగా అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించినవే. ఏళ్లు గడుస్తున్నాయి... ఎన్నికల పైన ఎన్నికలు వస్తూనేఉన్నాయి. కానీ రాజకీయ పార్టీలకు ఓటు బ్యాంకులైన గల్లీల బతుకులు మాత్రం మారడం లేదు.  

కనీస సదుపాయాలు కరువు
మురికివాడల ప్రజల ప్రధాన సమస్య పారిశుద్ధ్య లోపం. స్వచ్ఛ హైదరాబాద్, స్వచ్ఛ భారత్ వంటి పథకాలు ఎన్ని వచ్చినా గల్లీల్లో పారిశుద్ధ్యం మెరుగుపడడం లేదు. మంచినీటి కొరత, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాలకు నోచుకోవడం లేదు. వందలకొద్దీ ప్రభుత్వ పాఠశాలలు ఉన్నప్పటికీ మరుగుదొడ్లు, తగినన్ని తరగతి గ దులు, ఉపాధ్యాయులు లేక వెలవెలబోతున్నాయి. నగరంలో ఒకవైపు పెద్ద ఎత్తున కార్పొరేట్ విద్యా సంస్థలు విస్తరిస్తున్నాయి. మరోవైపు పేదల బస్తీల్లోని పాఠశాలలు విచ్ఛిన్నమవుతున్నాయి. గ్రేటర్ ఎన్నికల వేళ అనేక హామీలతో మేనిఫెస్టోలను ముద్రించుకొని గల్లీల్లోకి  ప్రవేశిస్తున్న రాజకీయ పార్టీలు, నేతలు బస్తీ వాసుల కనీస సదుపాయాలపై దృష్టి సారించవలసి ఉంది. సమస్యల పరిష్కారానికి స్పష్టమైన కార్యాచరణ ప్రకటించవలసి ఉంది. గ్రేటర్ హైదరాబాద్‌లో మొత్తం 95 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటిలో వైద్యులు, నర్సులు లేరు. మందులు లేవు. అత్యవసర పరిస్థితుల్లో గర్భిణులను పెద్దాస్పత్రులకు తరలించేందుకు అంబులెన్సులు కూడా లేవు. మొత్తంగా గల్లీల్లో సర్కారీ వైద్యం శిథిలమైపోతోంది. దీంతో ఏ చిన్న అనారోగ్య సమస్యకైనా జనం ఉస్మానియా, గాంధీ వంటి ప్రధాన ఆస్పత్రులకు వెళ్లవలసి వస్తోంది. జ్వరం, దగ్గు, జలుబు,తలనొప్పి వంటి చిన్న సమస్యలకు కూడా పెద్దాస్పత్రికి వెళ్లాల్సి వస్తోంది. మరోవైపు గర్భిణులు రక్తహీనతకు గురికాకుండా అందజేయవలసిన ఐరన్ మాత్ర లూ అందుబాటులో ఉండడం లేదు. చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నిరోధించి, స్కూల్‌కు పంపించే దిశగా కృషి చేయవలసిన అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. పక్కా భవనాలు లేకపోవడంతో అంగన్‌వాడీ కేంద్రాలూ సక్రమంగా పని చేయడం లేదు.
 
కార్యరూపం దాల్చని హాకర్స్ పాలసీ...
నగరంలోని అనేక బస్తీలు ఏళ్ల క్రితమే తమ ఉపాధికి అనుగుణంగా ఏర్పాటయ్యాయి. మార్కెట్‌లను, ప్రధాన కూడళ్లను ఆశ్రయించుకొని మూసీకి అటూ.. ఇటూ ఇవి ఆవిర్భవించాయి. బస్తీల జనాభాలో ఎక్కువ శాతం వీధి వ్యాపారులే. మలక్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్, కోఠి, సుల్తాన్‌బజార్, అబిడ్స్, మొజాంజాహీ మార్కెట్, ఉస్మాన్‌గంజ్, సికింద్రాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, మెహదీపట్నం, తదితర ప్రధాన ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో వీధి వ్యాపారులు ఉపాధి పొందుతున్నారు. వీరితో పాటు నాలుగు చక్రాల బండ్లతో వీధుల్లో తిరుగుతూ వ్యాపారం చేసుకునే వాళ్లు కూడా ఉన్నారు. ఇలాంటి చిరు వ్యాపారులకు ‘స్ట్రీట్ వెండర్స్’గా గుర్తింపు కార్డులు అందజేయడంతో పాటు, సామాజిక భద్రత కల్పించే దిశగా అప్పటి ఉమ్మడి ప్రభుత్వం హాకర్స్ పాలసీని రూపొందించింది. వీధి వ్యాపారుల సంఖ్యపై అప్పట్లో మెప్మా అనే సంస్థ సర్వే చేపట్టింది. నగరంలోని వివిధ ప్రాంతాలను ‘రెడ్, గ్రీన్, అంబర్’ రంగులతో   హాకర్స్ జోన్‌గా విభజించారు. రెడ్‌జోన్‌లలో హాకర్స్ వ్యాపారం చేయడానికి వీల్లేదు. గ్రీన్ జోన్‌లో ఎప్పుడైనా అనుమతినిస్తారు. అంబర్ జోన్‌లలో నిర్ణీత వేళల్లో మాత్రమే అనుమతి ఉంటుంది. హాకర్స్ పాలసీ రూపొందించి ఏళ్లు గడుస్తున్నప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు. ఇప్పటి వరకూ వారికి లెసైన్సులు ఇవ్వలేదు. దీంతో నిత్యం అభద్రతా భావంతో  వారు వ్యాపారం కొనసాగిస్తున్నారు. మురికివాడలను ఓటు బ్యాంకులుగా పరిగణించే దృష్టితో కాకుండా వారి సమస్యల పరిష్కారం దిశగా రాజకీయ పార్టీలు దృష్టి సారించాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement