సీసీ కెమెరాలతో పోలీసుల పనితీరులో పారదర్శకత
సాక్షి, హైదరాబాద్: ఠాణాల్లో సీసీ కెమెరాలు ఉండటం వల్ల పోలీసుల్లో జవాబుదారీతనం, పారదర్శకత పెరుగుతుందని రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మ అన్నారు. వివిధ ఠాణాల్లో ఏర్పాటు చేసిన 450 సీసీ కెమెరాలు అనుసంధానించిన సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో పోలీసుస్టేషన్ సీసీటీవీ ప్రాజెక్టు, వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. దేశంలోనే ఈ ప్రాజెక్టు మొదటిది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీసీ కెమెరాల విధానం వల్ల ప్రజలు, పోలీసుల మధ్య స్నేహపూర్వక వాతావరణం పెరుగుతుందని అన్నారు.
ఈ తొలి అడుగు పీపుల్ ఫ్రెండ్లీ ఇమేజ్‌కు దర్పణం పడుతుందన్నారు.‘సీసీ కెమెరాల వల్ల ఠాణాల్లో ఏం జరుగుతుందనేది స్పష్టంగా తెలిసిపోతుంది. పోలీసు సిబ్బంది ఏ మేరకు విధులు నిర్వహిస్తున్నారో వీడియో రూపంలో కనబడుతుంది. ఈ విధానాల వల్ల ప్రజల్లో కూడా పోలీసులకు మంచి పేరు లభిస్తుంది.
లాకప్‌లలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం బాగుంది’ అని డీజీపీ అన్నారు. విద్యో యాప్ ద్వారా ఠాణాకు రాలేని వారి వద్ద నుంచి స్టేట్‌మెంట్ రికార్డు చేయడంతోపాటు ఘటనాస్థలికి వెళ్లి బాధితుల వివరణ తీసుకుంటే మంచి సాక్ష్యాలు లభిస్తాయన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పనులు చకచకా జరిగిపోతాయన్నారు. సైబరాబాద్ విభజనపై విలేకరులు అడిగిన ప్రశ్నకు డీజీపీ సమాధానమిస్తూ విభజనపై కసరత్తు జరుగుతోందని, త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అడిషనల్ డీజీ రవిగుప్తా, సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, జాయింట్ సీపీ శశిధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.