సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) జిల్లా కమిటీలను పునర్వ్యవస్థీకరించాలని యోచిస్తోందా..? గతంలో జిల్లా కమిటీలు అవసరం లేదన్న నిర్ణయాన్ని పున:సమీక్షించుకుంటోందా..? కొత్త జిల్లాల ప్రాతిపదికన పార్టీ యంత్రాంగాన్ని క్రియాశీలం చేయాలనే నిర్ణయానికి వచ్చిందా..? దీనికి టీఆర్‌ఎస్ ముఖ్య నేతలు అవుననే సమాధానం చెబుతున్నారు.
జిల్లా స్థాయిలో పార్టీ నిర్మాణం, కమిటీలు అవసరం అని పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావుకు పలువురు సన్నిహితులు, ముఖ్యులు విన్నవించారు. జిల్లా స్థాయిలో పార్టీ యంత్రాంగం లేకపోవడం వల్ల క్షేత్రస్థాయిలో వస్తున్న పలు సమస్యలు, ఇబ్బందులను కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో జిల్లా స్థాయిలో పార్టీ కమిటీలను పునర్వ్యవస్థీకరించడానికి కేసీఆర్ సూత్రప్రాయంగా అంగీకరించినట్టుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి.
కొత్త జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం
రాష్ట్రంలోని 31 జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాలను నిర్మించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఇందు కోసం పార్టీ తరఫున టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయ కార్యదర్శి, ఎమ్మెల్సీ ఎం.శ్రీనివాస్‌రెడ్డి పేరుతో అన్ని జిల్లాల కలెక్టర్లకు లేఖలు రాశారు. పార్టీ కార్యాల యాల నిర్మాణానికి అనువైన స్థలాన్ని, నిబంధనల మేరకు కేటాయించాలని అందులో కోరారు.
పార్టీ కార్యాలయాల కోసం అందుబాటులో ఉన్న నాలు గైదు స్థలాల్ని ప్రతిపాదిస్తే, వాటిలో పార్టీ రాజకీయ కార్యకలాపాల కోసం అనువైన స్థలాలను ఎంపిక చేసుకోవాలని జిల్లా మంత్రులకు కేసీఆర్ సూచించారు. పాత జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఉన్నవారే, ఆ జిల్లాలోని కొత్త జిల్లా కేంద్రాల్లో కార్యాలయం కోసం స్థలాన్ని ఎంపిక చేసే బాధ్యతను తీసుకోవాలని ఆదేశించారు.
ఇప్పటికే పలు జిల్లాల మంత్రులు స్థలాలను పరిశీలిస్తున్నారు. కలెక్టర్లు భూమిని కేటాయించ గానే కార్యాలయ భవన నిర్మాణం ప్రారంభించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క నమూనాతో కాకుండా, అన్ని జిల్లాలకు ఒకటే నమూనాతో కార్యాలయాలను నిర్మించాలనే యోచనలో కేసీఆర్ ఉన్నారని చెబుతున్నారు. సంపూర్ణ వాస్తు, పార్టీ అవసరాలు, జిల్లా స్థాయి సమావేశాలకు అవసరమైన స్థాయిలో ఏర్పాట్లు వంటివాటి కోసం నమూనాను సిద్ధం చేయాలనే యోచనలో ఉన్నారు.
కమిటీలు అవసరమంటున్న నేతలు..
రాజకీయ పార్టీగా విస్తృత యంత్రాంగం, పార్టీ కార్యకర్తల సంఖ్య భారీగా పెరిగిన నేపథ్యంలో జిల్లా స్థాయిలో పార్టీ కమిటీలు ఉండాలని టీఆర్‌ఎస్ నేతలు కోరుతున్నారు. నియోజకవర్గాల వారీగా పార్టీ బాధ్యతలను ఎమ్మెల్యేలు లేదా పార్టీ ఇన్‌చార్జ్‌లు చూసుకోవాలని గతంలో పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. పార్టీ అధికారంలోకి వచ్చేనాటికి జిల్లా కమిటీలున్నా, కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన తర్వాత జిల్లా కమిటీలు అవసరం లేదని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
ఎన్నికలు జరిగే అసెంబ్లీ నియోజకవర్గమే యూనిట్‌గా పార్టీ పనిచేస్తుందని, దీనికి పార్టీకి చెందిన ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, ఎమ్మెల్యే లేకుంటే ఇన్‌చార్జ్ పార్టీ వ్యవహారాలకు బాధ్యత వహించాలని ఆదేశించారు. పార్టీ కార్యకలాపాల సమన్వయం కోసం నియోజకవర్గం నుంచి ఒక సమన్వయకర్తను నియమించాలని నిర్ణయించారు. పార్టీకి జిల్లా సమన్వయకర్తల నియామకం కూడా ఇప్పటిదాకా పూర్తికాలేదు. అయితే టీఆర్‌ఎస్‌లో భారీగా చేరికలతో పాత, కొత్త నాయకుల మధ్య చాలా నియోజకవర్గాల్లో విబేధాలు తలెత్తాయి.
నాయకుల మధ్య ఆధిపత్య పోరు, వ్యక్తిగత వైషమ్యాలు పార్టీకి నష్టం చేసే పరిస్థితి నెలకొందని రాష్ట్రంలో వివిధ నియోజకవర్గాల నుంచి పార్టీ అధినేత కేసీఆర్‌కు నివేదికలు, ఫిర్యాదులు అందాయి. దీంతో వాటివల్ల పార్టీకి నష్టం రాకుండా ఉండటానికి జిల్లా స్థాయిలో పూర్తిస్థాయి యంత్రాంగం ఏర్పాటు చేయాలనే యోచనకు కేసీఆర్ వచ్చినట్టుగా ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే జిల్లా స్థాయిలో పార్టీకి అధ్యక్షుడు, కార్యవర్గం ఉంటుందా, సమన్వయకర్తలు ఉంటారా, జిల్లా పార్టీ స్వరూపం ఎలా ఉంటుందనే దానిపై ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదు.
Comments
Please login to add a commentAdd a comment