రాజకీయ శత్రువులంతా గులాబీ గూటికే..
సాక్షి, హైదరాబాద్: అంతా తెలుగుదేశం పార్టీలో ఎదిగిన వారే! చిన్న వయసులోనే ఎమ్మెల్యే, మంత్రిగా పదవులు అనుభవించిన వారు కొందరైతే... టీడీపీలో ఉన్నన్ని రోజులు పదవులను అనుభవించిన వారు మరికొందరు. 2014 ఎన్నికల వరకు వీరందరిదీ పసుపు గూడే! దాదాపు 20 ఏళ్లకు పైగా కలిసి పనిచేసి, పార్టీలో అంతర్గతంగానే శత్రువులుగా మెదిలిన ఆ నాయకులు ఒక్కొక్కరుగా పార్టీ మారడం మొదలుపెట్టారు. 1994లో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన తలసాని శ్రీనివాస్ యాదవ్, జి. సాయన్నలు ఇప్పటికే టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరితో పాటు ఎమ్మెల్యే, మంత్రి పదవిని అనుభవించి స్టాంపుల కుంభకోణంలో చిక్కుకొని 2003లో జైలుపాలైన సి. కృష్ణయాదవ్ సోమవారం టీఆర్‌ఎస్ జెండా పట్టుకోనున్నారు.
అయితే 1994, 1999లో ఎమ్మెల్యేలుగా గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్, కృష్ణయాదవ్‌ల మధ్య మంత్రి పదవి కోసం పోటీ, తీవ్ర అభిప్రాయ భేదాలు ఉండేవి. హైదరాబాద్ నుంచే ఎన్నికైన ఒకే సామాజిక వర్గానికి చెందిన వీరిద్ధరిలో ఎవరో ఒకరే మంత్రిగా ఉండే అవకాశం ఉండేది. ఇదే తలసాని, కృష్ణయాదవ్‌ల మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలకు కారణమైంది. కృష్ణయాదవ్ జైలు నుంచి వచ్చిన తరువాత టీడీపీలో చేరేందుకు చేసిన ప్రయత్నాలను ఎప్పటికప్పుడు అడ్డుకునేందుకే తలసాని ప్రయత్నించారు.
చివరికి కృష్ణయాదవ్ టీడీపీలోలో చేరినా ఆయనకు ప్రాధాన్యత కల్పించలేదు. అప్పటి వరకు హైదరాబాద్ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న తలసాని టీఆర్‌ఎస్‌లో చేరిన వెంటనే కృష్ణయాదవ్‌కు ఆ పదవి లభించింది. కృష్ణయాదవ్ టీడీపీ అధ్యక్షుడిగా పనికిరాడంటూ చంద్రబాబుకు విన్నవించి ఆ పదవిని మాగంటి గోపీనాథ్‌కు కట్టబెట్టడంలో ప్రధాన పాత్ర పోషించిన కంటోన్మెంటు ఎమ్మెల్యే జి. సాయన్న కూడా ఇప్పటికే టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరందరికన్నా సీనియర్ అయిన మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కూడా ఈ ముగ్గురిలో ఒక్కొక్కరిని ఒక్కో విధంగా విభేదిస్తారు.
వీరేకాకుండా ఇటీవలే టీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ సీబీఐ డెరైక్టర్ కె. విజయ రామారావుతో కూడా మాజీ టీడీపీ నేతలైన ప్రస్తుత టీఆర్‌ఎస్ నేతలకు పలు విషయాల్లో అభిప్రాయ బేధాలున్నాయి. 1999 నుంచి 2004 వరకు మంత్రిగా ఉన్న ఆయన పోలీస్ ఆఫీసర్‌గానే వ్యవహరిస్తూ మాస్ లీడర్లుగా ఉన్న తలసాని, కృష్ణయాదవ్‌ల తీరుపై పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. వీరంతా ఇప్పుడు గులాబీ గూటికి చేరడం భవిష్యత్‌లో ఎలాంటి పరిణామాలకు వేదికవుతుందో చూడాలి.