సబ్‌ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఎస్సై) ప్రిలిమినరీ రాత పరీక్షా ఫలితాలను డీజీపీ అనురాగ్‌శర్మ గురువారం విడుదల చేశారు.
- సివిల్స్, ఏఆర్ విభాగంలో 50 శాతం ఉత్తీర్ణత
- కమ్యూనికేషన్, పీటీవో విభాగంలో 16 శాతం ఉత్తీర్ణత
- జనరల్ కేటగిరీ అభ్యర్థులు కేవలం 28 శాతం మాత్రమే అర్హత
- జూన్‌లో దేహదారుఢ్య, మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్న పీఆర్‌బీ
హైదరాబాద్ : సబ్‌ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఎస్సై) ప్రిలిమినరీ రాత పరీక్షా ఫలితాలను డీజీపీ అనురాగ్‌శర్మ గురువారం విడుదల చేశారు. సివిల్, ఆర్ముడు రిజర్వుడు(ఏఆర్), కమ్యూనికేషన్ విభాగాల్లో పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ఈ నెల 17న రాత పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. సివిల్, ఏఆర్, టీఎస్‌ఎస్‌పీ విభాగాలలో 510 పోస్టులకు గాను 1,74,962 మంది ప్రిలిమినరీ రాత పరీక్ష రాయగా 50.79 శాతంతో 88,875 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో పురుషులు 79,854 మంది కాగా, మహిళలు 9,021 మంది ఉన్నారు.
అదే విధంగా కమ్యూనికేషన్, పీటీవో విభాగాలలో 29 పోస్టులకు గాను మొత్తం 10,584 మంది ప్రిలిమినరీ రాత పరీక్ష రాయగా 16.14శాతంతో 1,709 మంది అర్హత సాధించారు. వీరిలో పురుషులు 1,513 మంది ఉండగా, మహిళలు 196 మంది అర్హత సాధించారు. మొత్తం మీద పరీక్షా ఫలితాలలో ఖమ్మం జిల్లా 54.36 శాతంతో అత్యధిక ఉత్తీర్ణత సాధించగా, మెదక్ జిల్లా అతితక్కువగా కేవలం 44శాతమే ఉత్తీర్ణత సాధించింది. ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్హత సాధించినవారికి జూన్‌లో దేహదారుఢ్య, మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ జె.పూర్ణచందర్‌రావు స్పష్టం చేశారు.