సుజనా మాటలు అబద్ధాల పుట్ట
- కేంద్రం తరపున వకాల్తా పుచ్చుకుంటారా?
- వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజం
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక హోదా అంశంపై కేంద్ర మంత్రి సుజనా చౌదరి చెప్పిన మాటలన్నీ అబద్ధాల పుట్ట అని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. ఆయన అలా ఉత్సాహంగా ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే అవకాశం లేదని, కేంద్రం ఇవ్వనంటోందని చెప్పడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ప్యాకేజీ ఇవ్వనంటున్నారని, అందుకు సమానమైన ధనాన్ని అంచనా వేసి ఇస్తామంటున్నారని కేంద్ర మంత్రి నింపాదిగా చెబుతున్నారన్నారు. ‘డబ్బుకు రంగుండదు’ (మనీ హాస్ నో కలర్) ఏ రూపంలో వస్తే ఏమిటని రాష్ట్ర ప్రజలను మభ్య పెట్టే యత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదేమైనా మనీ డీలా?
ప్రత్యేక హోదాను ప్రతిబింబించాల్సింది పోయి.. కేంద్రం చెప్పిన మాటలను వల్లె వేస్తూ వారి తరపున సుజనా వకాల్తా పుచ్చుకున్నారని పద్మ ఆరోపించారు. ఇదేమైనా మనీ డీలా.. బేరసారాలు సాగించి రాయబారంలాగా చేసుకోవడానికి? అని ప్రశ్నించారు. ప్యాకేజీ పేరుతో ధనం తెచ్చుకుంటే టీడీపీ ప్రభుత్వానికి, వారి నేతలకు మేలు జరగొచ్చేమోకానీ, రాష్ట్ర ప్రజలకేమీ ఒరిగేదిలేదన్నారు. కేంద్రంలో ఏ మార్పు జరిగినా దాన్ని అడ్డం పెట్టుకుని ప్రత్యేక హోదా ఇవ్వలేమంటున్నారని చంద్రబాబు చెప్పడం ఏమిటని ఆమె ప్రశ్నించారు.
‘ఓటుకు కోట్లు’లో బాబు దొంగే
ఓటుకు కోట్లు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోర్టులో గెలిచినా ప్రజల దృష్టిలో మాత్రం దొంగ, దోషిలాగా నిలబ డ్డారని వాసిరెడ్డి పద్మ చెప్పారు. ఈ వ్యవహారంలో ఏసీబీ దర్యాప్తు జరక్కుండా హైకోర్టు స్టే ఇవ్వడంపై ఆమె స్పందిం చారు. కోర్టులకు మించింది ప్రజా కోర్టు అని.. ప్రజల దృష్టిలో చంద్రబాబు నీచుడుగా మిగిలారన్నారు. ఓటుకు కోట్లు వ్యవహారం ప్రత్యక్షంగా ప్రజల కళ్లల్లో పడిందని ఆమె తెలిపారు.