బీమా లేకపోయినా వాహనాల బదిలీ
{పహసనంగా ధ్రువపత్రాల పరిశీలన
ఇదీ ఆర్టీఏ పని తీరు
సిటీబ్యూరో: ఆర్టీఏ కార్యాలయాలు నకిలీ ధ్రువపత్రాలకు చిరునామాగా మారిపోతున్నాయి. డ్రైవింగ్ లెసైన్స్‌లు, వాహనాల రిజిస్ట్రేషన్లు, వాహనాల బదిలీ వంటి కీలకమైన పౌర సేవల విషయంలో రవాణా అధికారులు శ్రద్ధ చూపడం లేదు. దీంతో ఏ వాహనాలు ఎవరి చేతుల్లోకి వెళ్తున్నాయో... ఎలాంటి వ్యక్తులు డ్రైవింగ్ లెసైన్సులు తీసుకుంటున్నారో తెలియని గందరగోళం నెలకొంది. సాక్షాత్తూ ఆ శాఖ అధికారుల తనిఖీల్లోనే ఈ విషయాలు వెల్లడి కావడం గమనార్హం. మహిళా భద్రత నేపథ్యంలో ఇటీవల ఆర్టీఏ పెద్ద ఎత్తున ఆటోలు, క్యాబ్‌ల తనిఖీలు చేపట్టింది. గ్రేటర్‌లోని లక్షా 30 వేల ఆటోలలో 80 శాతానికి పైగా వాహన యజమానుల వివరాలు కచ్చితంగా లేకపోవడం... నకిలీ ధ్రువపత్రాల ఆధారంగానే వేలాది ఆటోలు ఒకరి నుంచి మరొకరి చేతిలోకి మారిపోవడం, డ్రైవర్లకు, వాహన యజమానులకు మధ్య ఎలాంటి సంబంధం లేకపోవడం వంటివి ఈ తనిఖీల్లో బయటపడ్డాయి. ఆటోలే కాకుండా ద్వితీయ శ్రేణి బైక్‌లు, కార్లు, ఇతర వాహనాల రిజిస్ట్రేషన్ల బదిలీల్లోనూ నకిలీ పత్రాలే ఆధారమవుతున్నాయి. హైదరాబాద్ ఆర్టీఏ పరిధిలోని పశ్చిమ మండలం (మెహదీపట్నం), దక్షిణ మండలం (బహదూర్‌పురా)తో పాటు, రంగారెడ్డి ఆర్టీఏ పరిధిలోని కూకట్‌పల్లి వంటి ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లోనూ ధ్రువపత్రాల పరిశీలన ప్రహసనంగా మారిపోయింది. ఏజెంట్లు, దళారులు ఇచ్చే నకిలీ డాక్యుమెంట్ల ఆధారంగానే వాహన బదిలీలు, డ్రైవింగ్ లెసైన్సుల జారీ వంటి పౌర సేవలను అందిస్తున్నట్టు ఉన్నతాధికారుల పరిశీలనలో వెల్లడైంది.
తనిఖీల సంగతి అంతే...
ఇలా వాహన యజమానుల ధ్రువీకరణ సరిగ్గా లేకపోవడంతో గత నెలలో ఆర్టీఏ చేపట్టిన ఆటోరిక్షాల నమోదు ప్రక్రియ వారం రోజుల్లోనే అటకెక్కింది. ఏ ఆటో ఎవరి చేతుల్లో ఉందో తెలుసుకొనేందుకు అన్ని చోట్లా ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఆటో యజమానులు, డ్రైవర్లు స్వచ్ఛందంగా వచ్చి తమ పేర్లు, ఫోన్ నెంబర్లు, అడ్రస్‌లు, డాక్యుమెంట్‌లు నమోదు చేసుకోవాలని సూచించారు. మరోవైపు పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించారు. మహిళా ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినఈ డ్రైవ్‌లో ఆర్టీఏ పూర్తిగా విఫలమైంది. ఆటో యజమానులు, డ్రైవర్ల కచ్చితమైన వివరాలను రాబట్టలేకపోవడం ఆర్టీఏ పౌర సేవల్లోని డొల్లతనాన్ని బట్టబయలు చేసింది.
భద్రతకు ముప్పు
తప్పుడు చిరునామాలు, పేర్లపై హైదరాబాద్‌లో డ్రైవింగ్ లెసైన్స్‌లు తీసుకొని, వాహనాలు కొనుగోలు చేసి ఉగ్రవాదులు విధ్వంసాలకు పాల్పడుతున్న ఉదంతాలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. అయిఆన రవాణా శాఖ అధికారుల్లో చలనం కనిపించడం లేదు. మెహదీపట్నం కార్యాలయంలో ఇలాంటి బోగస్ పత్రాల ఆధారంగా అనేక పనులు జరిగిపోతున్నాయని ఆటో సంఘాలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అక్కడ ఇన్స్యూరెన్స్ పత్రాలు లేకపోయినా వాహనాలను బదిలీ చేస్తున్నారని కొందరు ఆటో సంఘాల నేతలు కొద్దిరోజుల క్రితం ఉన్నతాధికారుల వద్ద మొరపెట్టుకోవడం విశేషం. మరోవైపు వాహనదారుల పుట్టిన తేదీ, నివాస ధ్రువీకరణ పత్రాల్లో నకిలీలు ఎక్కువగా ఉండడంతో మైనారిటీ తీరని పిల్లల చేతుల్లోకి డ్రైవింగ్ లెసైన్సులు వెళ్తున్నాయి. ఇలాంటి వారు అపరిమిత వేగంతో వాహనాలు నడుపుతూ తర చుగా ప్రమాదాల బారిన పడుతున్నారు. నగరంతో సంబంధం లేని వ్యక్తులు, ఇక్కడ నివాసం కూడా ఉండని వాళ్లు డబ్బుతో తమకు కావలసిన ఆర్టీఏ పౌరసేవలను కొనుగోలు చేయగలుగుతున్నారు.
నకిలీ పత్రాలు... దళారుల సిత్రాలు
Published Fri, Jan 2 2015 12:52 AM | Last Updated on Thu, Jul 26 2018 1:37 PM
Advertisement
Advertisement