సాక్షి, హైదరాబాద్: హెచ్‌ఎండీఏ మాస్టర్ ప్లాన్లలో పార్కుల ఏర్పాటు గురించి ఎటువంటి ప్రస్తావన లేకపోవడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. పార్కుల ఏర్పాటు విషయంలో వైఖరి ఏమిటో నిర్దిష్టంగా తెలియజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పార్కుల ఏర్పాటును పట్టించుకోకపోవడం వల్లే నగరం కాంక్రీట్ జంగీల్‌గా మారిపోతోందన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తెరగాలంది. తదుపరి విచారణను జూన్ 15కు వాయిదా వేస్తూ.. అప్పటికి హెచ్‌ఎండీ మాస్టర్ ప్లాన్లను తమ ముందుంచాలంది.
ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావుతో కూడిన ధర్మాసనం బుధ వారం ఉత్తర్వులిచ్చింది. నగరం విస్తరిస్తున్నా కూడా పార్కుల ఏర్పాటులో ప్రభుత్వాలు శ్రద్ధ చూపడం లేదని, దీనివల్ల హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పట్టణాలన్నీ కాంక్రీట్ జంగిల్‌గా మారిపోతున్నాయని.. పార్కుల ఏర్పాటు విషయంలో ప్రభుత్వానికి తగిన ఆదేశాలు జారీ చేయాలంటూ సీనియర్ న్యాయవాది కె.ప్రతాప్‌రెడ్డి హైకోర్టులో పిల్ వేశారు. ఈ వ్యాజ్యాన్ని బుధవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.