దుబాయ్ లో ఆకట్టుకుంటున్న బంగారు కారు!
దుబాబ్ః బంగారు పూతతో, సుమారు పది లక్షల డాలర్ల ఖర్చుతో తయారైన ప్రత్యేక కారు ఇప్పుడు దుబాయ్ ఆటో షోలో అందర్నీ ఆకట్టుకుంటోంది. ప్రత్యేక ప్రమాణాలు, ఆధునిక సౌకర్యాలతో రూపొందిన విభిన్న డిజైన్.. కారు ప్రియులను కట్టి పడేస్తోంది.
దుబాయ్ ఆటో మెకానికా 2016 ప్రదర్శనలో భాగంగా దుబాయ్ లో కొనసాగున్న ఆటో షోలో బంగారు ప్లేటెడ్ కారు అందర్నీ అమితంగా ఆకర్షిస్తోంది. నిస్సాన్ ఆర్35 జిటి-ఆర్ కారును ట్యూనర్లు, స్పోర్ట్స్ కార్లు తయారీదారులైన కెయు హెచ్ ఎల్ రేసింగ్... గాడ్జిల్లా పేరున ఆటో షోలో ప్రదర్శనకు ఉంచారు. ఆర్టిస్, కేయుహెచ్ ఎల్ రేసింగ్ సంయుక్తంగా మాస్టర్ నిపుణుడు తకైకో ఇజావా సహకారంతో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా రూపొందించి, ఆటోమెకానికా లో ప్రదర్శించారు.
ప్రత్యేక బంగారు రంగు, 3.8 లీటర్ల వి6 ట్విన్ టర్బో, 545 హెచ్ పీ ఇంజిన్లకు తోడు అదనపు హార్స్ పవర్ తో... ఆ కొత్తకారు ఆటో షో సందర్శకులకు కనువిందు చేస్తోంది. రీ ఇన్ఫోర్డ్స్ బాడీ, ఏరో డైనమిక్ లక్షణాలు కలిగిన బంగారు కారు... కచ్చితమైన హ్యాండ్లింగ్ వ్యవస్థను కూడ కలిగి ఉంది. ఈకారులో ఉండే ఆధునిక ఇంజన్... 6 స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ట్రాన్స్ మిషన్ తో ఉండటమే కాక, కారును నడిపే డ్రైవర్.. రేసు కారు వేగాన్ని ఎంపిక చేసుకునేందుకు వీలుగా ఉంటుంది. ప్రత్యేక ట్రాన్స్ ఎక్సిల్ లక్షణాలతో సరి బేసి గేర్లు కలిగి, అత్యంత త్వరగా గేర్లు మార్చుకునేందుకు వీలుగా ఉంటుంది. జీటీఆర్ మోటార్ పోటీల్లో ఉపయోగించేందుకు కావలసిన ప్రమాణాలతో, 20 స్పోక్ వీల్స్ తో ఈ కొత్త బంగారు కారు... మార్కెట్లో తన స్థానాన్ని కాపాడుకుంటుందని తయారీదారులు ఆశిస్తున్నారు.