జైలు నుంచి 41 మంది ఖైదీలు పరారీ
కరకాస్: మధ్య వెనిజులా నగరమైన మిరండా రాష్ట్రంలోని లాస్ టిక్యూస్ నగరంలోని జైలు నుంచి దాదాపు 41 మంది ఖైదీలు పరారైయ్యారు. జైలు గోడకు రంధ్రం చేసి వీరంతా బుధవారం తెల్లవారుజామున పరారైయ్యారని ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి గురువారం వెల్లడించారు. పరారైన నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు వివరించారు.
అయితే జైలులో పరిమితికి మించి ఖైదీలు ఉన్నారని అందువల్లే.... వారు పరారైయ్యారని స్థానిక పత్రిక పేర్కొంది. ఖైదీలు పరారైయ్యే సమయంలో జైల్లో 130 మంది ఖైదీలు ఉన్నారని వెల్లడించింది. పరారైన ఖైదీలలో హత్య, వాహనాలు దొంగతనం, కిడ్నాపింగ్ కేసులు నమోదు అయిన వారు ఉన్నారని తెలిపింది.