జోస్, సౌదా.. ఓ గులాబీ రంగు సూట్‌కేస్..
10 రోజుల క్రితం..
వెనిజువెలాలోని బార్సిలోనా జైలు..
సమయం.. అర్ధరాత్రి ఒంటి గంట..
11, 12, 13..
నిద్ర పట్టనప్పుడు ఇలా ఊచలు లెక్కపెట్టడం జోస్ ఆంటోనియోకు అలవాటు..
ఒక్కడే.. ఏకాంతంగా..
నాలుగు గోడల మధ్య బందీగా..
కారు దొంగతనం కేసులో జోస్‌కు
9 ఏళ్ల 8 నెలల జైలు శిక్ష పడింది..
రేపు తనను కలవడానికి సౌదా వస్తోంది.. ఏదైనా ప్లాన్ చేయాలి అని మనసులో అనుకున్నాడు.
► సౌదా.. జోస్ ప్రియురాలు..
తర్వాతి రోజు తన కుమార్తెతో కలిసి జైలుకు వచ్చింది.. వచ్చేటప్పుడు అక్కడ ఉండటానికి వీలుగా బట్టలు అన్ని ఓ సూట్‌కేసులో పెట్టుకుని మరీ వచ్చింది. ఇక్కడ ఖైదీల తాలూకు కుటుంబ సభ్యులు ఓ రోజు ఉండటానికి అనుమతిస్తారు.. అందుకే సూట్‌కేసు!
► రోజు గడిచింది.. సౌదా తిరిగివెళ్లే టైమయింది. పాపను, సూట్‌కేసును పట్టుకుని బయల్దేరింది. అసలే మనిషి సన్నం.. సూట్కేసేమో బరువు.. దీంతో లాగలేక ఇబ్బంది పడుతోంది.. జైలు చివరి గేటు దాకా వచ్చేసింది.. గేటు దాటితే.. బయటికొచ్చేసినట్లే..
► ఇంతలో గార్డులకు డౌటొచ్చింది.. వచ్చేటప్పుడు ఈజీగా మోసేసిన సూట్‌కేసును.. వెళ్లేటప్పుడు లాక్కుని వెళ్తోంది ఎందుకు అని అనుమానపడ్డారు. జైలు నుంచి ఏదైనా తీసుకెళ్లిపోతుందేమోనని భయపడ్డారు.. సూట్‌కేసు తెరవమన్నారు.. తొలుత నిరాకరించినా.. తప్పలేదు..
► సూట్‌కేసు తెరిస్తే.. అమ్మ ఒళ్లో బజ్జునే బుజ్జాయిలాగా.. సూట్‌కేసులో జోస్.. పాములా చుట్టుకుని.. పడుకున్నాడు.. అందరూ నోరెళ్లబెట్టారు..
సీన్ కట్ చేస్తే..
11, 12, 13..
నిద్రపట్టనప్పుడు ఇలా ఊచలు లెక్క పెట్టడం జోస్ ఆంటోనియోకు అలవాటు.. అయితే.. ఈసారి ఒంటరిగా కాదు.. సౌదాతో కలిసి.. జంటగా..