న్యూఢిల్లీ: ప్రపంచంలో ఆకలితో అలమటిస్తున్నవారు, పోషకాహార లోపంతో బాధ పడుతున్నవారు రోజురోజుకు కోకొల్లలుగా పెరిగిపోతున్నారంటూ ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. తక్షణమే తగిన చర్యలు తీసుకోక పోయినట్లయితే 2035 సంవత్సరం నాటికి ప్రపంచ జనాభాలో సగం మంది ఈ పోషకాహార లోపానికి గురవుతారని ఐక్యరాజ్య సమితి ఆహారం, వ్యవసాయ సంఘం గురువారం విడుదల చేసిన ఓ నివేదికలో హెచ్చరించింది.
ప్రస్తుతం ప్రపంచంలో మూడోవంతు జనాభా ఆకలితో, పౌషకాహార లోపంతో బాధ పడుతున్నారని, ఫలితంగా వీరి ఆరోగ్య ఖర్చులకు, వీరి ఉత్పాదన శక్తి తగ్గిపోవడం వల్ల ఏడాదికి మూడున్నర లక్షల కోట్ల డాలర్లు నష్టపోతున్నామని నివేదిక అంచనా వేసింది. ప్రతి రోజు 80 కోట్ల మంది ప్రజలు రాత్రిపూట భోజనం లేక కాలే కడుపులతోనే కలత నిద్ర పోతున్నారని నివేదిక పేర్కొంది. మరోపక్క 190 కోట్ల మంది ప్రజలు ఊబకాయంతో బాధపడుతున్నారట.
పౌష్టికాహార సమస్యను ప్రభుత్వం తన సమస్యగా భావించి నివారించేందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని పౌష్టికాహార లోపంపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో సమితి ఆహార, వ్యవసాయ సంఘం డెరైక్టక్ జనరల్ జోష్ గ్రజియానో హెచ్చరించారు. సరైన డైట్, వ్యాయామం లేకపోవడం వల్లనే ప్రపంచంలో ఎక్కువ మంది ఆస్పత్రుల పాలవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేసింది.