
ఇతడు ఆలోచించాడు... రోబో చేయి పాటించింది..!
ఇతడికి పండ్ల రసం తాగాలనిపించింది. అలా అనుకోగానే రోబోటిక్ చేయి చకచకా కదిలింది. పండ్ల రసాన్ని సిద్ధం చేసింది! ఆ తర్వాత నోటికీ అందించింది! అమెరికాలోని లాస్ ఏంజెలిస్‌లో గతేడాది మార్చి 28న జరిగిన సీన్ ఇది. కాలిఫోర్నియా యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, కెక్ మెడిసిన్ యూనివర్సిటీ, తదితర సంస్థలు సంయుక్తంగా రూపొందించిన ‘కృత్రిమ నాడీ పరికరం’ ద్వారా ఇది సాధ్యమైంది. ఇతడి మెదడులో ఆలోచనలను చదివే చిప్(కృత్రిమ నాడీ పరికరం)ను అమర్చారు.
మెదడులోని ఆలోచనలను ఆ చిప్ విశ్లేషించి, రోబో చేయికి సంకేతాలు పంపింది. దీంతో ఆ సంకేతాలకు అనుగుణంగా రోబో చేయి పనిచేసింది. ఈ టెక్నాలజీ పరిశోధన ఫలితాలను గురువారం శాస్త్రవేత్తలు ప్రకటించారు. అవయవాలు కోల్పోయినవారికి, పక్షవాతానికి గురైనవారికి ఈ టెక్నాలజీ వరప్రసాదం కానుందని వారు చెబుతున్నారు. అయితే, ఎరిక్ జి. సోర్టో అనే ఇతడే కృత్రిమ నాడీ పరికరాన్ని ఉపయోగించిన తొలి వ్యక్తి కావడం మరో విశేషం.