జైళ్లలో 20 వేల మొబైల్ ఫోన్స్.. సిమ్స్
లండన్: బ్రిటన్‌లోని ఒక జైలు ఖైదీలకు విలాసవంతంగా మారింది. జైలుకు వెళ్లిన వాళ్లు తాము జైలుకు వెళ్లామనే ఫీలింగే రానంత ఉల్లాసంగా గడిపేస్తున్నారు. ఏకంగా ఇంట్లో ఉపయోగించినట్లే జైలులో మొబైల్ ఫోన్లు ఉపయోగించుకుంటూ సోషల్ మీడియాలో వీర విహారం చేస్తున్నారు. ఫొటోలు తీసుకుంటూ వీడియోలు తీస్తూ ఏం చక్కా ఫేస్‌బుక్‌లలో పెడుతున్నారు.
ఈ విషయం బయటకు తెలిసి తనిఖీలు చేపట్టిన అధికారులకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 వేల మొబైల్ ఫోన్లు, సిమ్‌కార్డులు దొరికాయి. ఇది చూసి అధికారులు బిత్తరపోతున్నారు. గత రెండేళ్లలో దొరికిన మొబైల్ ఫోన్లకంటే ఈసారి రెట్టింపు స్థాయిలో దొరకడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫోన్లన్ని కూడా ఒక్క సామాజిక మీడియాకే ఉపయోగిస్తున్నారంటే పొరపడ్డట్లే.
ఎందుకంటే జైలులో ఉండి తమ నేర చరిత్రను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు వీటిని ఉపయోగిస్తున్నారు. హత్యలు, డ్రగ్స్ వ్యాపారం, కిడ్నాప్‌లువంటి ఎన్నో పనులకు ఈ ఫోన్లనే వాడుతున్నారంట. తొలుత సామాజిక అనుసంధాన వేదిక ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ విషయాలు చూసి న్యాయశాఖ కార్యదర్శి లిజ్ ట్రస్ కొత్త నిబంధనలు జారీ చేశారు. ఇక నుంచి అన్ని జైలల్లో మొబైల్ సిగ్నల్ల జామర్ల పెట్టాలని ఆదేశించారు. ఈ విషయంపై గతంలోనే డేవిడ్ హాన్సన్ అనే లేబర్ పార్టీకి చెందిన మాజీ న్యాయశాఖ మంత్రి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
తాజా వాస్తవాలు వెలుగుచూసిన నేపథ్యంలో తాను గతంలోనే చెప్పానని, కానీ, పెడచెవిన పెట్టిన ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇలా జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2016లో బ్రిటన్‌లోని పలు జైళ్లలో నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 20,075 మొబైల్ ఫోన్లు బయటపడ్డాయి. అంతకుముందు ఏడాదితో పోల్చితే 18శాతం పెరిగాయి. గత ఏడాది 16,987 మొబైల్ ఫోన్లు, యూఎస్‌బీలు, సిమ్ కార్డులు, మీడియా కార్డులు దొరికాయి.