
ఆకట్టుకుంటున్న ఆక్లాండ్ లాంతరెన్ ఫెస్టివల్
న్యూజిల్యాండ్ ఆక్లాండ్ లో ఈసారి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లాంతర్ల వెలుగులు సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఆక్లాండ్ డొమైన్ మునుపెన్నడూ లేని విధంగా ఎనిమిది వందల లాంతర్లతో దేదీప్యమానమైంది.
చైనా కొత్త సంవత్సర వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో ఈసారి ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన లాంతర్ల వెలుగులు సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఆక్లాండ్ మునుపెన్నడూ లేని విధంగా 800 లాంతర్లతో దేదీప్యమానమైంది. ఉత్సవాలను చూసేందుకు వచ్చే జనంకోసం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను, ప్రదర్శనలను కూడా ఏర్పాటు చేశారు.
లాంతరెన్ పండుగలో వివిధ ఆకృతుల్లో తయారుచేసిన 800 చైనీస్ హ్యాండ్ మేడ్ లాంతర్లు సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. వారి నైపుణ్యానికి తార్కాణంగా నిలుస్తున్నాయి. పండుగ సంబరాల్లో భాగంగా ఏర్పాటుచేసిన స్టేజ్ షోలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చైనా చిత్రకళలు చూపరులను కట్టిపడేస్తున్నాయి. అన్ని వయసుల వారినీ ఆకర్షించేలా ఏర్పాటుచేసిన కార్యక్రమాలను సందర్శకులు ఉచితంగా తిలకించే సౌకర్యం కల్పించారు.
ఉత్సవాల సందర్భంగా రుచికరమైన ఆసియా వంటకాలు నోరూరిస్తున్నాయి. చేతిపనులు, అల్లికలు, లాంతర్ల తయారీ ప్రదర్శనలు అభిమానుల మనసు దోస్తున్నాయి. చైనా సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా సంప్రదాయ నృత్యాలు, మార్షల్ ఆర్ట్స్, లైవ్ మ్యూజిక్ తో పాటు... అనేక అంతర్జాతీయ ప్రదర్శనలు వేడుకల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఆదివారం ముగింపు వేడుకల్లో భాగంగా బాణసంచా ప్రదర్శన ప్రత్యేకతను సంతరించుకోనుంది.