రంగులు చల్లుకున్న హిందూ, ముస్లింలు
ఢాకా: బంగ్లాదేశ్‌లోనూ హిందువులు హోలి పండుగను ఘనంగా జరుపుకొన్నారు. హోలి రంగుల్లో తడిసిపోతూ.. నృత్యాలు చేస్తూ వీధుల్లో హోరెత్తించారు. హోలి ప్రధానంగా హిందువుల పండుగే అయినప్పటికీ బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో హిందువులతోపాటు ముస్లింలు కూడా రంగులు చల్లుకుంటూ కనిపించారు. హిందు, ముస్లిం స్నేహితులు రంగుల్లో తడిసిపోతూ.. తమలోని సామరస్య భావనను చాటుకున్నారు.
ఢాకాలోని ఓల్డ్ సిటీ ప్రాంతంలో చాలామంది హిందువులు ఉదయమే దేవాలయాలను సందర్శించి పూజలు నిర్వహించారు. ముఖ్యంగా బెంగాలీ హిందువులు దుర్గామాత పూజలు నిర్వహించారు. దుర్గమాతను ఆరాధించే పండుగల్లో హోలీ కూడా కీలకమైనదిగా బెంగాలీలు భావిస్తారు. ఇక ఢాకా యూనివర్సిటీ కూడా రంగుల్లో తడిసిపోయింది. నృత్యాలతో హోరెత్తింది. ఇక్కడ విద్యార్థులు కులమతాలకు అతీతంగా హోలీ పండుగ జరుపుకొన్నారు. హోలీ పండుగ స్నేహాన్ని ఐక్యతను చాటుతుందని, మతాల మధ్య ఉన్న అంతరాన్ని దూరం చేస్తుందని, అందుకే అందరితో కలిసి హోలీ ఆడుతున్నామని బంగ్లా హిందువులు తెలిపారు.