నవ్వులు పూయించిన ఒబామా
♦ వైట్‌హౌస్‌లో చిట్టచివరి డిన్నర్ ఇచ్చిన ఒబామా
♦ అందరిపై జోకులు వేస్తూ నవ్వించిన అమెరికా నేత
♦ ఒబామా ఔట్ అంటూ ప్రసంగానికి ముగింపు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన చిట్టచివరి వైట్‌హౌస్ డిన్నర్‌ను శనివారం ఇచ్చారు. రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు, ప్రముఖ జర్నలిస్టులు హాజరైన ఈ కార్యక్రమంలో తనపై తానే జోకులు వేసుకున్నారు. డెమొక్రాట్లు, రిపబ్లికన్లపై సెటైర్లు వేశారు.. మీడియా ప్రముఖులు, తన తర్వాత అధ్యక్ష పీఠమెక్కుతారని భావిస్తున్న వారి పైనా జోకులు పేల్చారు. వాషింగ్టన్ హిల్టన్ హోటల్‌లో జరిగిన ‘వైట్‌హౌస్ కరస్పాం డెంట్స్ డిన్నర్’కు బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రాతో పాటు హాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. ఒబామా మాట్లాడుతూ, ‘నా ఎనిమిదో, ఆఖరి ప్రసంగం ఇవ్వడం చాలా ఉద్విగ్నంగా ఉంది. ఇది చాలా గౌరవం. ఎనిమిదేళ్ల క్రితం యువకుడిని. ఎంతో కసితో ఉండేవాడిని. ఇప్పుడు చూడండి ఎలా అయిపోయానో’ అని అన్నారు.
‘‘వచ్చే ఏడాది ఈ స్థానంలో మరో అధ్యక్షులు ఉంటారు. ఆమె ఎవరో గెస్ చేయండి’’ అంటూ పరోక్షంగా హిల్లరీ క్లింటన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. హిల్లరీ ఆంటీ అంటూ ఆమెను ఆటపట్టించారు. అయితే ఈ కార్యక్రమానికి రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం ఆశిస్తున్న డోనాల్డ్ ట్రంప్, టెడ్ క్రూజ్, జాన్ కాషిచ్ హాజరుకాలేదు. అయినా ట్రంప్‌ను టార్గెట్ చేసుకుని ఒబామా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మిస్ స్వీడన్, మిస్ అర్జెంటీనా, మిస్ అజర్‌బైజాన్ ట్రంప్‌కు విదేశీ విధానాలకు సంబంధించి సరైన అనుభవం లేదని భావించారని, అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నట్లు వారు తెలిపారని ఒబామా చెప్పారు. ఆద్యంతం నవ్వులు పూయించిన ఒబామా చివరగా మైక్‌ను డ్రాప్ చేసి ‘ఒబామా ఔట్’ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.
ఇండో అమెరికన్ జర్నలిస్ట్‌కు అవార్డ్
ఈ కార్యక్రమంలో ఒబామా, మిషెల్ దంపతులు ప్రముఖ ఇండో అమెరికన్ జర్నలిస్ట్ నీలా బెనర్జీని ఎడ్గర్ ఏ పో అవార్డ్‌తో సత్కరించారు. ఆమెతో పాటు ‘ఇన్‌సైడ్ క్లైమేట్ న్యూస్’ నుంచి మరో ముగ్గురికి వారు ఈ పురస్కారాన్ని బహూకరించారు. జాతీయ స్థాయిలో అందించిన పాత్రికేయ సేవలకు ‘వైట్ హౌజ్ కరెస్పాండెంట్స్ అసోసియేషన్’ అ అవార్డ్‌ను అందిస్తుంది.