
'అణ్వాయుధాలను సిద్ధంగా ఉంచండి'
ప్యాంగ్యాంగ్: శత్రు దేశాల నుండి పెరుగుతున్న ముప్పు దృష్ట్యా.. అణ్వాయుధాలను సిద్ధంగా ఉంచాలని, ఏ సమయంలో నైనా దాడి చేయడానికి వీలుగా సన్నాహకాలు చేసుకోవాలని ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. ఉత్తర కొరియా నూతనంగా తయారుచేసిన రాకెట్ లాంచర్లను పర్యవేక్షించిన సందర్భంగా కిమ్ అధికారులతో మాట్లాడుతూ.. అణ్వాయుధాల సంఖ్య, నాణ్యతను పెంచాలని, ఇది దేశ రక్షణకు అత్యవసరమని చెప్పినట్లు ఆ దేశ అధికార వార్తా సంస్థ కేసీఎన్ఏ తెలిపింది.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి బుధవారం ఉత్తర కొరియా దుందుడుకు చర్యలపై మరిన్ని ఆంక్షలు విధించిన నేపథ్యంలో కిమ్ ఈ ఆదేశాలు జారీ చేశారు. కిమ్ ఆదేశాలతో కొరియా ద్వీపకల్పంలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ కథనాలపై స్పందించిన అమెరికా రక్షణ శాఖ అధికారి బిల్ అర్బన్.. ఉద్రిక్త పరిస్థితులలో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడటానికి బదులుగా అంతర్జాతీయ ఒప్పందాలు, బాధ్యతలకు కట్టుబడి ఉండాల్సిందిగా ఉత్తర కొరియాను కోరారు.