నయాగరా అందాలు అదృశ్యమౌతాయా?
ప్రకృతి రమణీయ దృశ్య కావ్యం నయాగరా జలపాతం. అక్కడి ఎత్తైన కొండ కోనలనుంచి ఉరికి వచ్చే నీటి ధారలు.. వేసవిలో సందర్శకులకు కనువిందు చేస్తాయి. శతాబ్దాల కాలంగా ఆ మనోహర దృశ్య రూపం సందర్శకులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం అమెరికాలోని న్యూయార్క్, కెనడాలోని ఒంటారియా రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఆ జలపాతంపై బ్రిడ్జి ప్రాజెక్టు నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయన్న వార్తలు... సందర్శకులను, స్థానికులను తీవ్ర నిరాశకు గురి చేస్తున్నాయి. ఈ ప్రయత్నం ఆ ప్రాంతాన్ని ఎడారిగా మార్చి... అక్కడి అందాలను కనుమరుగు చేస్తుందన్న వదంతులు వినిపిస్తున్నాయి.
నయాగరా ఫాల్స్ ప్రాంతంలో అమెరికాను, గోట్ ఐలాండ్ ను కలుపుతున్న 115 సంవత్సరాలనాటి రెండు వంతెనలున్నాయి. వాటిని పునరుద్ధరించే దిశగా సన్నాహాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికన్ ఫాల్స్ మూతపడే ప్రతిపాదన ఉన్నట్లు న్యూయార్క్ స్టేట్ పార్క్... రవాణా సంస్థల ద్వారా తెలుస్తోంది. దీంతో అమెరికన్ జలపాతం, బ్రైడల్ వైల్ జలపాతం మధ్య ఉన్న పచ్చదనం కనిపించకుండా పోతుందన్న అనుమానాలూ వ్యక్తమౌతున్నాయి. కాగా వాటర్ ఫాల్స్ కు బ్రిడ్జి నిర్మాణానికి ఎటువంటి సంబంధం లేదని అధికారులు చెప్తున్నారు.
సుమారు 85శాతం నయాగరా జలపాతం కెనడా భాగంలోని హార్స్ షో ఫాల్స్ లోనే ఉంది. మిగిలిన ప్రాంతం మాత్రమే ఆమెరికా భాగంలో ఉంది. ప్రస్తుతం ఈ అమెరికన్ ఫాల్స్ భాగంలో తాత్కాలిక ఆనకట్ట కట్టి డ్రైన్ల ద్వారా పూర్తి నీటి ప్రవాహాన్నిహార్సేషో ఫాల్స్ వైపు మళ్ళించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడున్న అతి పురాతనమైన 115 ఏళ్ళనాటి వంతెనలు పడగొట్టాల్సిన అవసరం ఉందని, ఇందులో భాగంగానే నీటి ప్రవాహాన్ని మళ్ళించేందుకు డ్రైన్లు నిర్మించాల్సి వస్తుందని అంటున్నారు. బ్రిడ్జిలు తిరిగి నిర్మించేందుకు స్తంభాలు, వంతెన గోడల నిర్మాణాల పునాదులు గట్టిగా ఉండాలంటే ఈ ప్రాంతాన్ని పొడిగా మార్చాల్సిన అవసరం కూడా ఉందంటున్నారు. ఈ కొత్త వంతెనలు నిర్మించేందుకు సుమారు తొమ్మిది నెలల కాలం పట్టనున్నట్లు తెలుస్తోంది.
అయితే అంతటి రమణీయ ప్రాంతాన్ని సందర్శకులకు దూరం చేయడంపై స్థానికులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు ఈ ప్రాంతం ఆధ్యాత్మిక భావన కలిగిస్తుందంటున్నారు. ఇదిలా ఉంటే ఈ నూతన నిర్మాణం కెనడా వైపు కంటే అమెరికావైపు అవసరమని, ఈ కొత్త రాతి నిర్మాణం ఆర్థికవ్యవస్థ అభివృద్ధికి తోడ్పడవచ్చని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ వంతెన నిర్మాణం వల్ల తమకు అద్భుతమైన మార్కెటింగ్ కు అవకాశాలు లభిస్తాయని నయాగరా టూరిజం అండ్ కన్వెన్షన్ కార్పొరేషన్ సీఈవో అంటున్నారు. పైగా నయాగరా ఫాల్స్ ను పొడిగా చూసే అవకాశం జీవితకాలంలో చాలా తక్కువమందికి మాత్రమే ఉంటుందని చెప్తున్నారు. అయినా ఇది మొత్తం నయాగరాను మూసివేయడం కాదని, అమెరికన్ ఫాల్స్ ప్రాంతం మాత్రమే మళ్ళించబడుతుందని, కెనడా ప్రాంత ఫాల్స్ ఎప్పట్లానే సందర్శకులకు కనువిందు చేస్తాయని తెలుపుతున్నారు. అంతేకాక నీరు లేని సమయంలో ఈ ప్రాంతాన్ని ప్రత్యేక పర్యాటక ప్రాంతంగా తీర్చి దిద్దేందుకు ప్రయత్నిస్తామని పర్యాటక అధికారులు అంటున్నారు.