చైనా పార్లమెంట్‌ కీలక నిర్ణయం | China Approves Impose National Security Law On Hong Kong | Sakshi
Sakshi News home page

చైనా పార్లమెంట్‌ కీలక నిర్ణయం

Published Thu, May 28 2020 4:01 PM | Last Updated on Thu, May 28 2020 4:13 PM

China Approves Impose National Security Law On Hong Kong - Sakshi

బీజింగ్‌ :  ప్రపంచమంతా ప్రాణాంతక కరోనా వైరస్‌తో పోరాడుతున్న క్లిష్ట సమయంలోనూ చైనా తన సామ్రాజాన్ని విస్తరించుకోవాలని ప్రయత్నిస్తోంది. హాంకాంగ్‌పై ఆధిపత్యానికి  వడివడిగా అడుగులు వేస్తున్న డ్రాగన్‌ దేశం గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. హాంకాంగ్‌‌ వాసుల స్వేచ్ఛకు సంకెళ్లు వేసే జాతీయ భద్రతా చట్టానికి చైనా పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఆదేశాలతో జాతీయ భద్రతా చట్టంపై చర్చించేందుకు గురువారం ప్రత్యేకంగా సమావేశమైన నేషనల్‌ పీపుల్స్‌‌ కాంగ్రెస్‌ (ఎన్‌పీసీ) ఈ బిల్లుకు ఆమోదం తెలిపినట్లు ఓ అంతర్జాతీయ పత్రిక తన కథనంలో పేర్కొంది.

మొత్తం 2800 మంది ఎన్‌పీసీ సభ్యులు నూతన చట్టానికి అనుకూలంగా ఓట్లు వేశారని సమాచారం. తాజా నిర్ణయంతో చైనా ఇంటెలిజెన్స్‌ సంస్థలు హాంకాంగ్‌లో తిష్ట వేసే అవకాశం ఉంది. హాంకాంగ్‌లో ఉగ్రవాదాన్ని, వేర్పాటువాదాన్ని అణిచేయడానికి, విదేశీ జోక్యాన్ని నిరోధించడానికి ఈ చట్టం ఎంతో అవసరమని చైనా ప్రభుత్వం చెబుతోంది. ఒక దేశం రెండు వ్యవస్థల విధానాన్ని మరింత మెరుగుపరచి.. దానిని పటిష్టం చేయాలని భావిస్తోంది. కాగా చైనా చట్టాలను, జాతీయ గీతాన్ని అవమానిస్తే నేరంగా పరిగణించే బిల్లుకు గత నెలలోనే ముసాయిదాను తయారు చేసిన విషయం తెలిసిందే. (ఆమెను విడుదల చేయండి : చైనా వార్నింగ్‌!)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement