రైలు లింక్ ఒప్పందం కుదిరింది..
బీజింగ్: చైనా, నేపాల్ దేశాలు ప్రధాన మైలు రాయిని దాటాయి. నేపాల్ ప్రధాని కెపి ఒలి అభ్యర్థనను చైనా అంగీకరించడంతో ఏళ్ళ తరబడి పెండింగ్ లో ఉన్న చైనా-నేపాల్ లింక్ రైల్ నిర్మాణంతో పాటు పది ఒప్పందాలపై సంతకాలు చేసి, ఇరు దేశాలమధ్య సంబంధాలను సుస్థిరం చేసుకున్నాయి. ప్రతి విషయానికీ నేపాల్ భారతదేశంపై ఆధారపడటాన్ని తగ్గించడంలో భాగంగా చైనా నుంచి టిబెట్ మీదుగా నేపాల్ కు వ్యూహాత్మక రైల్వే లింక్ నిర్మాణానికి వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.
నేపాల్ ప్రధాని కెపి ఒలి ఏడు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం చైనా చేరుకున్నారు. ఆయనకు చైనా ప్రీమియర్ కెక్వాంగ్ గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్ లో రెడ్ కార్పెట్ తో ఘన స్వాగతం పలికారు. చైనా అధ్యక్షుడు క్సి జిన్ పింగ్ కు కూడ పిలుపినిచ్చారు. అయితే నేపాల్ లో ప్రభుత్వ మార్పు... అక్కడే స్థిరపడ్డ భారతీయులు వ్యతిరేకించడం, నేపాల్ సరిహద్దుల్లో ఇద్దరు భారతీయుల్ని నేపాల్ భద్రతా దళాలు కాల్చి చంపడం వంటి అనేక సంఘటనలు ఇటీవల భారత్, నేపాల్ దేశాల మధ్య సహృద్భావ వాతావరణాన్ని దెబ్బ తీశాయి. ఈ నేపథ్యంలో నేపాల్ ప్రధాని చైనా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
చైనా, నేపాల్ దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు, సరఫరా మార్గాలను పెంపొందించుకొనేందుకు నేపాల్ ప్రధాని పర్యటన ప్రధాన్యత నిచ్చింది. అయితే చర్చల సందర్భంగా ఇద్దరు ప్రధానమంత్రులు ద్వైపాక్షిక సంబంధాలపై సమగ్ర సమీక్ష చేసి, ఇరు దేశాలమధ్య క్రమంగా పెరుగుతున్న సంబంధాలపై సంతృప్తిని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంలో ఇరు దేశాల మధ్య పరస్పర విశ్వాసం, అవగాహన కుదిరిందని, అలాగే అన్ని రంగాల్లో లాభదాయకమైన సహకారం ఉంటుందని నేపాల్ విదేశాంగ శాఖ జారీ చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. ట్రేడ్ విస్తరణ, సీమాంతర మార్గాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉత్పాదనలో పరస్పర సహకారం, పర్యాటకం, ఫైనాన్స్, విద్య మరియు సంస్కృతి లపై ప్రధానంగా ప్రధానులిద్దరూ చర్చించినట్లు తెలిపింది. ముఖ్యంగా లీ, ఒలి లు చర్చల్లో చైనా నుంచి టిబెట్ మీదుగా నేపాల్ కు రైల్వే మార్గం నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది.